అవును... ఆడు మగాడ్రా బుజ్జీ!

జర్నలిస్టు సంఘాలు లేకుండా కొత్త అక్రెడిటేషన్లు   తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త అధ్యాయం   ఇక మిగిలింది ఎల్‌ఏ యాడ్స్ ప్రక్షాళనే   భూసేకరణ యాడ్స్‌నూ సమాచార శాఖ పరిథిలోకి తీసుకోవాలి   చేయాలన్న సంకల్పం... చేసే దమ్ము.. చేయగల ధైర్యం  ఉండాలే గానీ,  అనుకున్నది పూర్తి చేయడానికి ఏదీ అడ్డుకాదు. రాదు!  ఏపీలో జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ల మంజూరుపై సమాచార శాఖ కమిషనర్ తమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయయం చూస్తే అది అవుననిపించకమానదు. ఇంతకాలం అక్రెడిటేషన్ల సంఘాల  చూరుపట్టుకుని వేళ్లాడుతున్న,  జర్నలిస్టు సంఘ గబ్బిలాల కస్తూరి వాసనలు లేకుండానే.. ఈసారి జర్నలిస్టులకు కొత్త కార్డులివ్వాలన్న నిర్ణయం సాహోపేతమే కాదు. విప్లవాత్మకం కూడా! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క సమాచార శాఖ కమిషనర్ తీసుకోలేని, దమ్మున్న నిర్ణయం తీసుకున్న విజయ్‌కుమార్ మొనగాడి కిందే లెక్క.   కొత్త ఏడాదికి కొత్త  కార్డులపై ఇప్పటివరకూ జరుగుతున్న తర్జనభర్జన-మీనమేషాలకు ఏపీ సమాచార శాఖ కమిషర్ విజయకుమార్‌రెడ్డి తన సంచలన నిర్ణయంతో తెరదింపి, జర్నలిస్టులకు కొత్త కార్డుల పంపిణీకి లైన్‌క్లియర్ చేయడం స్వాగతించదగ్గదే. ఇప్పటివరకూ ఈ విషయంలో అడ్డగోడగా నిలిచిన జర్నలిస్టు సంఘాల పంచాయితీని పక్కకు పెట్టి... సారీ... పక్కన పారేసి,  కొత్త కార్డుల ప్రక్రియకు పచ్చజెండా ఊపిన కమిషనర్‌ను,  అభినందించడం  ప్రతి జర్నలిసు నైతిక బాధ్యత.   అసలు అక్రెడిటేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలు ఎందుకు? అందులో ఆ నాయకమ్మన్యులు ఉండి ఉద్ధరించేది, ఊడబొడిచేదీ ఏమిటి? జర్నలిస్టులకు యాజమాన్యాల నుంచి జీతాలిప్పించే దమ్ము లేని సంఘాలు, ప్రభుత్వ శాఖలపై స్వారీ చేయడం ఏమిటి? కమిషనర్లను మొహమాటపెట్టి, తమ యూనియన్ల సభ్యులకు అదనంగా కార్డులు ఇప్పించుకోవడమే కదా ఈ నేతల మెహర్బానీ? చిన్నా చితకా సంఘాలు కూడా,  అక్రెడిటేషన్ కమిటీ సభ్యులమని ఫోజులు కొట్టడానికే తప్ప, ఈ కమిటీలో జర్నలిస్టులు ఎందుకు పనికివస్తారు? పోనీ ఈ కమిటీ ఏమైనా ఏడాది పొడవునా పనిచేస్తుందా? లేదు. ఒక్కటంటే ఒకేసారి!  మరి దేనికీ బిల్డప్పులు? కొత్త కార్డుల మంజూరుకు ఈ సంఘాల మోకాలడ్డు, ప్రతిబంధకాలూ ఎందుకు?  ఇవీ... కొన్ని దశాబ్దాల నుంచీ జర్నలిస్టుల మస్తిష్కాలలో నాటుకుపోయిన ప్రశ్నలు. ఉమ్మడి రాష్ట్రం నుంచీ ఇప్పటివరకూ ఇవే ప్రశ్నలు, జర్నలిస్టు  మెదళ్లను తొలిచేస్తున్నాయి. కానీ, అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే... ఈ కమిటీలో జర్నలిస్టులను సిఫార్సు చేసేది,  ఇంకా పెద్ద జర్నలిస్టు ‘మహానేతలు’ కాబట్టి.   ఇప్పుడిక ఆ పితలాటకం లేదు. మా సంఘాలే ఉండాలి. అప్పటివరకూ ఎవరికీ కార్డులివ్వకూడదు. పాతవే కొనసాగించాలన్న పంచాయితీ అసలే లేదు. ఎందుకంటే.. అసలు జర్నలిస్టు సంఘాల లొల్లి లేకుండానే, జర్నలిస్టులకు కొత్త కార్డులివ్వాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి! అంత సాహసం చేసిన కమిషనర్ నిజంగా చరిత్ర సృష్టించారనే చెప్పాలి. ఎందుకంటే... సమైక్య రాష్ట్రం నుంచి ఇప్పటివరకూ, జర్నలిస్టు సంఘాలను పక్కనపెట్టిన కమిషనర్లు ఎవరూ లేరు కాబట్టి. ఏ కమిషనరయినా జర్నలిస్టు సంఘాలకు భయపడాల్సిందే. లేకపోతే సీఎంల దాకా పంచాయతీ వెళ్లేది. అలాంటిది..  ఒక కమిషనర్ జర్నలిస్టు సంఘాలతో సంబంధం లేకుండానే.. అక్రెడిటేషన్ కమిటీని అధికారులతోనే వేసి, కొత్త కార్డులివ్వాలని నిర్ణయించడం మామూలు విషయం కాదు కదా? దానికి బోలెడంత దమ్మ కావద్దూ..? భవిష్యత్తులో కూడా ఇదే విధానం అనుసరించడం మంచిది.  అందుకే... ఆడు మగాడ్రా బుజ్జీ!   నిజానికి కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న అనేక దమ్మున్న నిర్ణయాల్లో ఇది ఒకటి మాత్రమే. సమాచార శాఖలో ప్రకటనలన్నీ యాడ్ ఏజెన్సీల నుంచే ఇచ్చే  విధానం  ఉమ్మడి రాష్ట్రంలో  మొదలయి, గత ఏడాదిన్నర వరకూ కొనసాగింది. అంటే ఏదైనా పత్రిక లేదా చానెల్‌కు యాడ్స్ ఇవ్వాలంటే, మధ్యలో ఏజెన్సీ పాత్ర ఉండాల్సిందే. ప్రభుత్వంలో ఎవరుంటే, వారిని పట్టేసి.. ఎవరికి కావలసినవి వారికి సమర్పించుకుని ఏజెన్సీలు హవా సాగించేవి. పత్రికా ప్రకటనల నుంచి హోర్డింగ్సు వరకూ ఇదే వరస.  అందుకు సమాచార శాఖ సదరు ఏజెన్సీలకు 15 శాతం కమిషన్లు ఇచ్చేది. పోనీ, ఆ అంత కమిషన్లు తీసుకునే సదరు ఏజెన్సీలు,  పత్రికలకు సకాలంలో డబ్బులిస్తాయా అంటే అదీ లేదు. గత సర్కారు ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి, ఏజెన్సీలు ఇప్పటిదాకా పత్రికలకు బకాయిలు చెల్లించిన దాఖలాలు లేవు. కొత్త కమిషనర్ విజయకుమార్  ఈ సంప్రదాయానికి తెరదించారు.అంటే..అసలు సమాచార శాఖలో యాడ్ ఏజెన్సీల వ్యవస్థకే మంగళం పాడారు.  ఎలాగంటే.. ఏజెన్సీలకు పత్రికలు ఇచ్చే ఆ 15 శాతం కమిషను, ఇప్పుడు ప్రభుత్వమే తీసుకుని, వాటిని ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తోంది. మంచిదే కదా!   అదొక్క నిర్ణయమే కాదు. కొత్త కమిషనర్ తీసుకున్న మరొక సాహసోపేత నిర్ణయం.... పత్రికల  యాడ్స్ టారిఫ్‌ను గణనీయంగా తగ్గించడం. ఇప్పటివరకూ ఈనాడు, సాక్షి, డెక్కన్‌క్రానికల్ వంటి పత్రికలే ఎక్కువ ప్రకటనల రేటు ఉండేవి. వాటి మొదటి పేజీ ప్రకటన ఖరీదు లక్షల నుంచి కోటికి పైమాటే. ప్రభుత్వం ఇచ్చే ఒక ప్రకటన  బడ్జెట్‌లో,  సింహభాగం ఈ పత్రికలకే సరిపోయేవి. టీడీపీ హయాంలో అయితే.. సింహభాగం బడ్జెట్ అంతా ఈనాడు-ఆంధ్రజ్యోతి ఖాతాకే వెళ్లేవి. ఇక టెండరు లేకుండానే అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్- గవర్నమెంట్ అఫిషియల్ మీడియా హక్కుల  తాలూకు నిధులన్నీ,  ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌కే వెళ్లేవి. ఇక వాటికి పోగా మిగిలిన బడ్జెట్‌ను, మిగిలిన పత్రికలకు సర్దుబాటు చేసేవారు.   అయితే సర్క్యులేషన్ పరంగా కూడా అవి పెద్దవే. కానీ.. సమాచార శాఖ బడ్జెట్ తగ్గిపోయింది.  ఆ భారం తగ్గించుకునే వ్యూహంలో భాగంగా.. కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, సమాచారశాఖ నిర్దేశించిన రేట్లను అంగీకరిస్తేనే, ప్రకటనలిస్తామని షర తు విధించారు. దానితో గత్యంతరం లేని పెద్ద పత్రికలు,  కొన్ని వేల మెట్లు దిగివచ్చి, కమిషనర్ ప్రతిపాదనను అంగీకరించడం అనివార్యమయింది. ఫలితంగా గత సర్కారు హయాంలో కోటిరూపాయల ఫుల్‌పేజీ ఉన్న ఒక యాడ్.. ఇప్పుడు 30 వేలకు ముద్రించాల్సి వస్తోంది. మరి ఇది శుభపరిణామమే కదా?   ఇంకొన్ని తెలుగు పత్రికల ప్రాణం చాలా బలహీనమయినా... వాటి ప్రకటనల రేట్లు మాత్రం ఈనాడు, క్రానికల్‌కు మించే ఉండేవి. అంటే దశాబ్దాలపాటు ఆ తరహా పత్రికలు యాడ్స్ రూపంలో ఎంత సంపాదించాయో,  ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కమిషనర్ తీసుకున్న కొత్త తరహా విధానం వారికి వాతపెట్టినట్టే. అది వేరే విషయం. అలా... ప్రభుత్వాలను కొన్ని దశాబ్దాల పాటు శాసించి, శ్వాసించిన పెద్ద పత్రికలను సైతం నేలమీదకు తీసుకురావడానికి, నిజంగా దమ్ము-ధైర్యమే కాదు. సంకల్పం కావాలి. అది తనకు ఉందని నిరూపించిన కమిషనర్ విజయకుమార్‌రెడ్డిని అభినందించాల్సిందే. ఆయన తీసుకున్న ఈ సాహోసోపేత నిర్ణయం వల్ల, ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదా అయినట్లే కదా?   ఇన్ని విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్న కమిషనర్... భూసేకరణ ప్రకటనల్లో జరుగుతున్న కోట్లాదిరూపాయల కుంభకోణంపైనా దృష్టి పెడితే మంచిది. జిల్లాల్లో పత్రికలకు ఇస్తున్న భూసేకరణ ప్రకటనలు,  స్పెషల్ కలెక్టరు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల  దయాధర్మంపై వస్తున్నాయి. అతె్తసరు కాపీలు ముద్రించే చాలా పత్రికలు.. ఫిఫ్టీ-ఫిఫ్టీ నిష్పత్తిలో కోట్లాదిరూపాయల యాడ్సు సంపాదిస్తున్నాయి. దీనివల్ల ఖజానాకు వందల కోట్లు నష్టం వస్తోంది. చంద్రబాబు సర్కారులో ఇదొక మాఫియాగా మారిందన్న ఆరోపణలుండేవి. ప్రకాశం, విజయనగరం, నెల్లూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో అయితే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, భూసేకరణ యాడ్స్ పుణ్యాన కోట్లకు పడగలెత్తారన్న ఆరోపణలుండేవి. ఇప్పుడు క్యాబినెట్‌లో ఓ పెద్ద స్థాయిలో ఉన్న.. ఓ ‘మంత్రిగారి వియ్యంకుడి’కి చెందిన పత్రిక, గత మూడేళ్లలో  కేవలం భూసేకరణ యాడ్సులోనే కోట్లాది రూపాయలు  సంపాదించింది. అయినా అడిగే దిక్కులేదు.   అయితే.. భూసేకరణ యాడ్స్ అంశం సమాచారశాఖ పరిథిలో లేకపోవడం, రెవిన్యూ శాఖ పరిథిలో ఉండటంతో సమాచార శాఖ అధికారులు ప్రేక్షకపాత్ర పోషించాల్సి వస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు,  తమ ప్రకటనలన్నీ సమాచార శాఖ ద్వారానే ఇవ్వాలన్న ఆదేశాలు ఉన్నాయి. కానీ భూసేకరణ ప్రకటనలు మాత్రం మినహాయించడమే, కొన్ని పత్రికలకు కల్పతరువులా మారింది. ఆ అంశాన్ని కూడా సమాచారశాఖ పరిథిలో తీసుకువస్తే ప్రభుత్వం కొన్నివందల కోట్లు ఆదా చేసినట్టవుతుంది. పెద్ద పత్రికలను దారికి తెచ్చి, కోట్లాదిరూపాయలు ఆదా చేసిన కమిషనర్... నిజాయితీగా నడుపుతున్న చిన్న పత్రికలను కూడా ప్రోత్సహిస్తే మంచిది.  -మార్తి సుబ్రహ్మణ్యం  

చెప్పిచ్చుక్కొడతా అంటూ టీడీపీ ఎమ్మెల్సీల పైకి దూసుకెళ్లిన సీనియర్ మంత్రి 

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. నిన్న శాసనమండలిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. "చెప్పిచ్చుక్కొడతా.." అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, బుద్దా నాగజగదీశ్వరరావు గురించి చేసిన వ్యాఖ్యలు శాననమండలిలో పెను దుమారం రేపాయి. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదమే జరిగింది. ఒకదశలో ఇరుపక్షాల సభ్యులు ఒకరిపై మరొకరు చేయి చేసుకుంటారేమోనన్న పరిస్థితి నెలకొంది. బుధవారం శాసనమండలి ప్రారంభ సమయంలో వాయిదా తీర్మానాలు తిరస్కరించిన తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ దేవదాయ శాఖ మంత్రి తనను ఉద్దేశించి సభలో మంగళవారం చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఎవరు, ఏం మాట్లాడారో రికార్డులు పరిశీలించాలన్నారు. అంగవైకల్యాన్ని ఎత్తిచూపడం చట్టవ్యతిరేకమని, మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మరోపక్క యనమల రామకృష్ణుడు అన్నారు. మండలి చైర్మన్‌ షరీఫ్‌ దీనిపై స్పందిస్తూ.. రికార్డులు పరిశీలించి తన నిర్ణయం చెపుతానన్నారు.   అయితే ఆయన రికార్డులు పరిశీలించడానికి వెళ్తుండగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి లేచి.. కొందరు మంత్రులు సభలో వీధి రౌడీలకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారన్నారు. దీంతో మంత్రి బొత్స లేచి.. మంత్రులను వీధి రౌడీలు అంటావా? చెప్పిచ్చుక్కొడతా... అంటూ దీపక్‌రెడ్డి వైపు వేలు చూపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు కలుగజేసుకోవడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.   అయితే కొద్దిసేపు వాగ్వాదం తరువాత మంత్రి బొత్స, దీపక్‌రెడ్డి, నాగజగదీశ్వరరావు వైపు దూసుకొచ్చారు. దీంతో నాగజగదీశ్వరరావు జోక్యం చేసుకుంటూ.. ‘‘నోర్ముయ్‌.. చెప్పుచ్చుకుని కొడితే కొట్టించుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరిక్కడ’’ అని మంత్రికి కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా "రా చూసుకుందాం.. " అంటూ దీపక్‌రెడ్డి, నాగజగదీశ్వరరావు కూడా బొత్స వైపు దూసుకెళ్లారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే బొత్సను మరో మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఆపే ప్రయత్నం చేశారు. మరోపక్క నాగజగదీశ్వరరావును టీడీపీ ఎమ్మెల్సీలు జనార్దన్‌ తదితరులు అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

జగన్ సర్కార్ కు బీజేపీ ఎంపీ షాక్.. ఆ విషయంపై కేంద్రానికి లేఖ 

ఏపీలోని జగన్ ప్రభుత్వం పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు ఒక లేఖ రాసారు. రాష్ట్ర ప్రభుత్వం FRBM పరిధిని దాటి అప్పులు చేస్తోందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో అయన పేర్కోన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. నిబంధనలకు విరుద్ధంగా లోన్లు తీసుకుని.. వచ్చిన నిధులను ఉచిత పథకాల కోసం విచ్చల విడిగా ఖర్చు పెడుతున్నారని.. ఇది చాలా ఆందోళనకరమని సురేష్ ప్రభు తన లేఖలో పేర్కొన్నారు. అందుకే కార్పొరేషన్లకు ఇచ్చే రుణాలకు రెండు వందల శాతం ల్యాండ్ గ్యారంటీ తీసుకునేలా.. మార్టిగేజ్ చేసుకునేలా చూడాలని.. అలాగే రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి చాల ఆందోళనకరంగా మారిందని అయన వ్యాఖ్యానించారు.   ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేయిదాటక ముందే సరైన చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ ‌ను సురేష్ ప్రభు కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు కూడా ఎంపీ సురేష్ ప్రభు లేఖలు రాశారు. అయితే గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన సురేష్ ప్రభు.. ఈ విధంగా లేఖ రాయడంతో దీనిపై కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందో అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన సురేష్ ప్రభు ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

కేంద్రం నిధులిస్తే వైఎస్ విగ్రహం పెడతారా?- చంద్రబాబు ఫైర్

జగన్ అవినీతిపరుడు కాబట్టి అందరిపై అవినీతి ముద్ర వేసేందుకు యత్నిస్తున్నారని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పోలవరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నవారు... దాన్ని ఎందుకు నిరూపించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రానికి నష్టం చేశారని విమర్శించారు. గతంలో తాము వేసిన అంచనాలను తప్పుపట్టారని... ఇప్పుడు అవే అంచనాలను కరెక్ట్ అంచనాలని చెప్పుకుంటున్నారని టీడీపీ చీఫ్ మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని వైసీపీ సర్కార్ ను  ప్రశ్నించారు చంద్రబాబు.   పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటూ జగన్ పై  చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం ప్రాజెక్టును కడుతూ, అక్కడ వైయస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా? అని ధ్వజమెత్తారు. వైయస్ విగ్రహం పెడితే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. వైయస్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనతో పోలవరంకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని చెప్పారు.గోదావరి నీళ్లను తెలంగాణ మీదుగా శ్రీశైలానికి తెస్తామని జగన్ చెప్పినప్పుడు అది కుదిరే పని కాదని తాను చెప్పానని... తాను చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ ప్రశ్నలు అడిగితే తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

గ్రేటర్ లో అద్భుతంగా పోరాడారు! బండికి ప్రధాని ప్రశంస

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్‌కి ప్రధాని మోడీ ఫోన్ చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు ఎన్నికల సరళిపై, పార్టీ పరిస్థితులపై ముచ్చటించారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని మోడీ అభినందించినట్టు పేర్కొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల స్థితిగతులపై వివరాలు అడిగి  తెలుసుకున్నారుని, నాయకుల, కార్యకర్తలపై జరిగిన దాడుల వివరాలు అడిగారని బండి సంజయ్ తన ప్రకటనలో చెప్పారు.    పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను ప్రధాని మోడీ కొనియాడారన్నారు. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ పనిచేయడంపట్ల  ఆయన హర్షం వ్యక్తం చేశారన్నారు. దైర్యంగా ముందుకు సాగాలని అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని మోడీ సూచించినట్టు తెలిపారు.

బాణాసంచా అమ్మకం, కాల్చ‌డంపై నిషేధం పొడిగింపు

బాణాసంచా అమ్మ‌కం, కాల్చ‌డంపై కొనసాగుతున్న నిషేధాన్ని నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ (ఎన్‌జీటీ) మ‌రి కొంత కాలం పొడిగించింది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్(ఢిల్లీ, ప‌రిస‌ర ప్రాంతాలు) తోపాటు, కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉన్న అన్ని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు ఈ నిషేధం వ‌ర్తిస్తుంద‌ని ఎన్‌జీటీ స్పష్టం చేసింది. ఓ వైపు కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే, మరోవైపు బాణాసంచా దానికి ఆజ్యం పోస్తోందని ఎన్‌జీటీ వ్యాఖ్యానించింది. కరోనా మహమ్మారి పోయేంత వరకు బాణాసంచా కాల్పులపై నిషేధం ఉంటుందని ఎన్‌జీటీ స్పష్టం చేసింది.   కాగా, ఇటీవల దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో పెద్ద ఎత్తున బాణాసంచాకాల్చారు. అసలే కాలుష్య కోరల్లో చిక్కుకునివున్న ఢిల్లీలో.. బాణాసంచా కాల్చడంతో కాలుష్యం పెరిగిపోయింది. పైగా, కరోనా వైరస్ వ్యాప్తి పెరిగి కేసులు మళ్లీ విజృంభించాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ.. నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్ తోపాటు గాలి నాణ్యత తక్కువగా ఉన్న అన్ని నగరాలు, పట్టణాల్లో బాణాసంచా అమ్మకం, కాల్చ‌డంపై కరోనా ప్రభావం తగ్గే వరకు నిషేధం విధించింది.

కరోనా వ్యాక్సిన్ కు బ్రిటన్ అత్యవసర అనుమతి... వచ్చే వారమే ప్రజలకు పంపిణీ 

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కరోనా సెకండ్ వేవ్ తో తల్లడిల్లుతున్న నేపథ్యంలో బ్రిటన్ లో కూడా మరో సారి కరోనా విజృంభిస్తుందని వార్తలు వస్తున్న తరుణంలో బ్రిటన్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మన్ ఫార్మా సంస్థ బయో ఎన్‌టెక్ కలిసి రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ను అత్యవసరంగా ప్రజలకు అందించేందుకు ఎమర్జెన్సీ ఆథరైజేషన్ ను మంజూరు చేసింది. దీంతో కరోనా వ్యాక్సిన్ ను తన ప్రజలకు అందిస్తున్న తొలి దేశంగా బ్రిటన్ రికార్డ్ సృష్టించింది. వచ్చే వారం నుంచి బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుంది. మరో వారం రోజులలో వ్యాక్సిన్ అనుమతులు వస్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.   ఔషధ నియంత్రణ సంస్థ ఎమ్‌హెచ్ఆర్ఏ సూచనల్ని అంగీకరిస్తూ ఈ అనుమతిని జారీ చేశాం. వచ్చే వారం నుంచి ఈ వ్యాక్సిన్ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది అని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. తొలి విడతలో వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని బ్రిటన్ కు చెందిన వ్యాక్సిన్ కమిటీ నిర్ధారించనుంది. అయితే.. తొలి విడతలో కరోనాతో ఎక్కువ ప్రమాదం ఎదుర్కొంటున్న ఓల్డేజ్ హోంలలోని వారు, వృద్ధులు, వైద్య సిబ్బందికి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా బ్రిటన్ ప్రభుత్వం వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతులు మంజూరు చేయడమనేది కరోనాపై జరుగుతున్న యుద్ధంలో చాలా కీలక ఘట్టంగా నిపుణులు పేర్కొంటున్నారు. మరో పక్క బ్రిటన్ హెల్త్ సెక్రెటరీ స్పందిస్తూ.. ఇది చాలా గొప్ప శుభవార్త అని వ్యాఖ్యానించారు.   బ్రిటన్ ప్రజల క్షేమం కోసం ఫైజర్ వ్యాక్సిన్ పనితీరును వేగంగా ముదింపు వేసి, అత్యవసర అనుమతులను జారీ చేసినందుకు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థకు ఫైజర్ కంపెనీ సంస్థ సీఈఓ ఆల్బర్టా బోర్లా ధన్యావాదాలు తెలిపారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ను అత్యవసరంగా అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని అయన పేర్కొన్నారు.

ముచ్చటగా మూడో రోజు.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మూడో రోజు సమావేశాల్లో కూడా కొందరు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఈరోజు అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని అధికారపక్ష ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఆటంకం కలిగిస్తున్న 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో 9 మంది ఎమ్మల్యేలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్‌ అయిన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయ స్వామి, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, జోగేశ్వరరావు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.   మరోవైపు, అసెంబ్లీలో చర్చ జరగకుండా కావాలని అడ్డుపడుతున్నారంటూ టీడీపీ నేతలపై సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ఉన్న చోట దిగజారిన రాజకీయాలు కనిపిస్తాయని విమర్శించారు. చంద్రబాబు ఏనాడూ పోలవరం గురించి ఆలోచన చేయలేదని సీఎం అన్నారు. గత సీఎంలు పోలవరాన్ని పూర్తి చేయాలనుకోలేదని, 2004లో వైఎస్‌ సీఎం అయ్యాక 86 శాతం భూసేకరణ చేసి కుడి కాలువ పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో కేవలం 14శాతం పనులు జరిగాయన్నారు. తాము అధికారంలోకి రాకముందు వరకు 29.80 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని సీఎం పేర్కొన్నారు.

కేసుల భయంతో కేంద్రానికి సరెండర్! ‌జగన్ పై చంద్రబాబు ఫైర్

పోలవరంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గరంగరం చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ప్రతి పక్ష నేత చంద్రబాబు. జగన్ ప్రభుత్వం చేతగానితనంతో పోలవరం అంశంలో చాలా సమస్యలు వస్తున్నాయని విమర్శించారు. కేసుల భయంతో నిధుల విషయంపై కేంద్రాన్ని అడగలేక జగన్ సరెండర్‌ అయ్యారని ఆరోపించారు. ఎన్నికల ముందు వైసీపీ చెప్పిన మాటలన్నీ విని ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపించారని.. పోలవరం పూర్తిచేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని చెప్పారు చంద్రబాబు. కేంద్రంతో మాట్లాడి పోలవరం నిధులు సాధిస్తారా? లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 22 ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. పోలవరం భూసేకరణ చేసి ఆర్‌అండ్‌ఆర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  దీనిపై కేంద్రాన్ని ఒప్పించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. ఎన్నికల్లో గెలిపిస్తే మేం పోరాడతాం, సాధిస్తామని చెప్పారని.. ఇప్పుడు నాటకాలాడొద్దని తీవ్రస్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు.    చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్. ‌పోలవరం పూర్తి చేసేది తమ ప్రభుత్వమేనన్నారు. మార్చి నాటికి 17,500 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ఇవ్వబోతున్నామని చెప్పారు. ఐదేళ్లలో ఏనాడైనా ఆర్‌అండ్‌ఆర్‌ గురించి ఆలోచించారా? అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు అనిల్ కుమార్. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 2022 ఖరీఫ్‌ నాటికి నీళ్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కేసుల భయంతో కేంద్రానికి సరెండర్‌ అవుతున్నారంటూ చంద్రబాబు చేసిన కామెంట్లపై అనిల్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ అధికారంలో ఉన్నప్పుడే ఆమెను జగన్‌ ఎదిరించారన్నారు.  

ఆఖరి గంటలో 9 శాతం పోల్! రిగ్గింగ్ జరిగిందని బీజేపీ కంప్లైంట్

గ్రేటర్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందా? పాతబస్తిలో పోలింగ్ శాతం ఒక్కసారిగా ఎలా పెరిగింది? చివరి రెండు గంటల్లో ఏం జరిగింది? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం గందరగోళంగా మారింది. గ్రేటర్ పోలింగ్ పై తుది అధికారిక లెక్కలు విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. 45.97 శాతం పోలింగ్ జరిగిందని ప్రకటించింది. ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. గతంలో కంటే పోలింగ్ శాతం భారీగా తగ్గిందని అంతా భావించగా.. ఎస్ఈసీ లెక్కల ప్రకారం గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. చివరి గంటలో ఏకంగా తొమ్మిది శాతం పోలింగ్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పార్టీలు చివరి గంటలో రిగ్గింగ్ చేశాయనే ఆరోపణలు వస్తున్నాయి.   గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు 3.95 శాతం పోలింగ్ జరిగింది. 11 గంటల వరకు ఇది 11.62 శాతానికి పెరిగింది. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ శాతం 20.35 శాతంగా ఉండగా.. 3 గంటల సమయానికి  29.76 శాతానికి చేరింది. సాయంత్రం ఐదు గంటలకు 36.73 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అప్పటి వరకు ప్రతి గంట గంట పోలింగ్‌ను పది నిమిషాల్లో ప్రకటించిన ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని నిలిపివేసింది. కారణాలను మాత్రం తెలుపలేదు.దీంతో పోలింగ్ శాతం 38 శాతం ఉంటుందని భావించారు. కాని తుది లెక్కల్లో మాత్రం గ్రేటర్ లో 45.97 శాతం పోలింగ్ జరిగిందని ప్రకటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. ఎస్ఈసీ లెక్కల ప్రకారం చివరి గంటలోనే 9 శాతం ఓటింగ్ పెరగగా.. పాతబస్తిలో ఇది దాదాపు 12 శాతంగా ఉంది. చార్మినార్ , చాంద్రాయణ గుట్టలో దాదాపు 15 శాతం పోలింగ్ చివరి గంటలోనే జరిగిందని ఎన్నికల సంఘం లెక్కలను బట్టి తెలుస్తోంది. దీంతో ఓల్ట్ సిటీలో ఓ పార్టీ చివరి గంటల్లో రిగ్గింగ్ చేసిందనే అనుమానాలు బలపడుతున్నాయి.   పాతబస్తీలో ఎంఐఎం పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ఆ పార్టీ నేతలు రామచంద్రరావు, ఆంటోనిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.  పాతబస్తీలో మజ్లీస్‌పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడుతుందని తాము సమాచారం ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఆరోపించారు. చివరి గంటలో అకస్మాత్తుగా పోలింగ్‌ ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. ఘాన్సీబజార్‌ డివిజన్ లో పోలింగ్‌ స్టేషన్‌ 1 నుంచి 19 వరకు, పురానాపూల్‌ డివిజన్ లో పోలింగ్‌ స్టేషన్‌ 3,4,5,38 నుంచి 45 వరకు ఉన్న బూత్‌లలో 94 శాతం పోలింగ్‌ జరిగిందని.. ఇక్కడ ఎంఐఎం రిగ్గింగ్ చేసిందని ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పోలింగ్ బూత్ లలోకి వెళ్లి రిగ్గింగ్ చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు రాంచంద్రరావు. రిగ్గింగ్ చేసుకోవాలనే బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారని ఆయన ఆరోపించారు. ఆ రెండు డివిజన్లలో రీపోలింగ్‌ జరపాలని కోరారు.    ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు కనిపించలేదు. పాతబస్తిలోని కొన్ని డివిజన్లలో మధ్యాహ్నం 1 గంట వరకు ఐదు శాతం కూడా పోలింగ్ జరగలేదు. ఓల్ట్ సిటీలో ఓవరాల్ గా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం5 గంటలకు మొత్తం 10 గంటల్లో 20 శాతం పోలింగ్ జరగగా... ఆఖరి గంటలోనే మరో 20 శాతం పోలింగ్ జరగడం అశ్చర్యపరుస్తోంది. ఆఖరి గంటలో ఎక్కడా హడావుడి లేకుండా, క్యూ లైన్లు కనిపించకుండా పోలింగ్ ఎలా పెరిగిందనేది ఎవరికి అర్ధం కావడం లేదు. పోలింగ్ ముసిగిన సమయానికి ఎక్కడా ఓటర్లు లైన్‌లో ఉన్నట్లు, పోలింగ్ కోసం అదనపు సమయం తీసుకున్నట్లు ప్రకటించలేదు. కాని ఎన్నికల సంఘం తుది లెక్కల్లో మాత్రం పోలింగ్ 45.97 శాతానికి పెరిగింది. ఈ లెక్కన సాయంత్రం ఆఖరి గంటలో జరిగిన పోలింగ్ శాతం 9 శాతంగా నమోదైంది. అప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వైపు చూడని ఓటర్లు ఒక్కసారిగా కేంద్రాల్లోకి ఎలా పోటెత్తారన్నది అర్ధం కాకుండా ఉంది.  10 గంటల పాటు రాని ఓటర్లు చివరి గంటలో ఎలా వచ్చారు… ఎక్కడి నుంచి వచ్చారో తెలియడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.   ఉదయం నుంచి జరిగిన పోలింగ్.. ఎస్ఈసీ ఇచ్చిన తుది లెక్కలకో  గ్రేటర్ పోలింగ్‌లో ఆఖరి గంటలో ఏం జరిగిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. పోలింగ్ శాతంపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉంది. మరీ ఎస్ఈసీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరీ..

సభాపతి తీరుపై విమర్శలు.!

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభా సభాపతి రూల్సు కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, కేవలం ఒక పార్టీకి ప్రతినిధిగా సభను నడిపిస్తున్నారని విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తునాయ్. కనీసం సభా మర్యాదలను కూడా పాటించకుండా శాసనసభా సభాపతే ఈ విదంగా సభ్యులను సభలోనే అగౌరపర్చడం ఏమిటని ఇటు రాజకీయ వర్గాలు అటు న్యాయకోవిదులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.    ముఖ్యంగా నిన్న, అంటే డిసెంబర్ 1 వ తారీఖున సభలో ఆయన ప్రతిపక్ష నాయకునిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయ్. రాష్ట్ర అసెంబ్లీలో నిన్న పేదల గృహ నిర్మాణంపైన చర్చ జరుగుతున్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కొంత సహనం కోల్పోయినమాట వాస్తవమే. సభాపతి కుర్చీలో కూర్చున్న తమ్మినేని సీతారాం దీనిపై స్పందిస్తూ, "ఏమనుకుంటున్నావ్? నీ ఉడత ఊపులకు, పిల్లి శాపనార్ధాలకు ఎవరూ భయపడరు. ఎల్ఓపీ అయితే ఎవరికీ గొప్ప? జాగ్రత్త… ఏం మాట్లాడుతున్నావ్?" అంటూ వ్యాఖ్యలు చేయడం అన్ని వర్గాలనుండి రకరకాల విమర్శలకు తావిచ్చింది.    సభలో వున్న సభ్యులు, ఇటు అధికార పక్షానికి చెందిన వారైనా, అటు ప్రతిపక్షమువారైనా, విమర్శలు గుప్పించుకోవడం సర్వ సాదారణమేనని, దీనికి సభాపతి కుర్చీలో కూర్చున్న వారు మాత్రం కొంత సౌమ్యాత పాటించవలసిన అవసరం ఎంతయినా ఉందని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. సభాపతే నిగ్రహం కోల్పోతే ఇక సభ నడిచే విధానం ఎలా ఉంటుందో ఎవరైనా సులభంగానే వూహించుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.    ఒకవేళ సభలో వున్న సభ్యులు సహనం కోల్పోయి ఏదైనా మాట్లాడితే కుర్చిలో కూర్చున్నవారు వారిని వారించి సభను సవ్యంగా సాగేటట్లు చూడవలిసిందిపోయి, సభాపతే ఆవిధంగా సభ్యులను, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిని ఆవిధంగా మాట్లాడడం ఏమాత్రం స్వాగతించవసిన విషయం కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంలో కూర్చున్నవాళ్లు తమ వాదనలను గట్టిగా విన్పించడం, దీనికి అటు అధికార పక్షంలో కూర్చున్నవాళ్లు సరైన రీతిలో సమాధానం చెప్పడం ఏమాత్రం తప్పు లేదని, సభ్యులు కోపతాపాలను సభలో ప్రదర్శించడం లో తప్పు లేదని, సభను సరైన రీతీలో నడపవలసిన సభాపతి మాత్రం ఏనాడు సహనం కోల్పోకూడదని, అలాంటిది తమ్మినేని సీతారాం స్పీకర్ చైర్ లో కుర్చున్న దగ్గరనుండి దీనికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చారని వీరు అభిప్రాయపడుతున్నారు.    ఇది తమ్మినేనికి కొత్తేమి కాదని, గతంలో అనేక పర్యాయాలు ఇలా జరిగిందని రాష్ట్ర రాజకీయ నాయకులంటున్నారు. గత జులై లో సుప్రీమ్ కోర్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్రాసిన లేఖ ఫై స్పందించిన తమ్మినేని న్యాయ స్థానాలపైనే వ్యాఖ్యలు చేసారని గుర్తుచేస్తున్నారు. ఇక గత జనవరిలో అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులపై చర్చ జరుగుతున్న సమయంలో కూడా ఆయన సహనం కోల్పోయి ప్రతిపక్ష సభ్యులపై చేసిన వ్యాఖ్యలు, జనవరి 6 న కొంతమంది అధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇక గత సంవత్సరం నవంబర్లో  శ్రీకాకుళంలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయనను పిలవలేదని ఆయన చేసిన కామెంట్లు, ఏమాత్రం ఆయన పొజిషన్ కు తగ్గవి కాదని వారంటున్నారు.    ఒకవేళ ఏ సభ్యుడైన సభామర్యాదలు పాటించకుండా ఏవైనా అసభ్య పదజాలం వాడినా, సభాపతి హోదాలో అయన ఆ సభ్యుడిని ఆ కామెంట్లు ఉపసంహరించుకోమని డిమాండ్ చేయవచ్చని, గతంలో చైర్లో కూర్చున్న చాలామంది ఇలాంటివి పాటించారని, ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో వున్నవారే వారి వారి కామెంట్లను ఉపసంహరించుకున్న దాఖలాలు చాలా ఉన్నాయని, కానీ సభాపతి మాత్రం ఎక్కడ సహనం కోల్పోయిన సందర్భాలు లేవని, ఇది ఇప్పుడే చూస్తున్నామని నాయకులంటున్నారు. ఏది ఏమైనా, చైర్కు ఒక హోదా ఉందని, దానిలో కూర్చున్నవారు ఆ హోదా ను కాపాడవసిన అవసరం ఎంతయినా ఉందని మాత్రం వారు గుర్తుచేస్తున్నారు. 

చైనా కంటే ముందుగానే అమెరికాలో కరోనా.. యూఎస్ సీడీసీ వెల్లడి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చైనా నుండి వ్యాప్తి చెందిందని ఇప్పటివరకు అందరు నమ్ముతూ వస్తున్నారు. అయితే అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇచ్చిన తాజా రిపోర్టు దీనికి బిన్నంగా ఉంది. సీడీసీ విడుదల చేసిన రిపోర్ట్ లో.. అమెరికాలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఒక కొత్త విషయాన్ని వెల్లడించింది. గత ఏడాది డిసెంబరు మధ్యలోనే కరోనా మహమ్మారి అమెరికాలో వ్యాప్తి చెందిందని ఆ రిపోర్టు లో పేర్కొంది. అయితే చైనా మాత్రం జనవరిలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి అధికారికంగా ప్రకటన చేసింది.   అయితే ఇప్పటివరకు ఈ కరోనా వైరస్‌కు చైనానే కారణమని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. అయితే సీడీసీ తెలిపిన ఈ వివరాలతో చైనా, అమెరికా ల మధ్య దీనిపై మరో వివాదం చోటుచేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీడీసీ చేసిన ఈ అధ్యయనం కోసం రెడ్‌క్రాస్ సాయంతో 7,389 మంది రక్త దాతల బ్లడ్ శాంపిల్స్ సేకరించి, వాటిపై పలు పరిశోధనలు నిర్వహించింది. ఈ శాంపిల్స్‌లోని 106 నమూనాలలో కరోనా వైరస్ కనుగొన్నారు.

ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం.. తణుకు ఎమ్మెల్యేకు పాజిటివ్‌

ఏపీ అసెంబ్లీలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వరరావుకి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అయితే ఆయన రెండు రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పుడు ఇదే విషయం అసెంబ్లీలో హాట్‌ టాపిక్‌గా మారింది. రెండు రోజులుగా ఆయనను కలిసిన ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే తనకు కరోనా సోకినట్లు తేలడంతో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు నాగేశ్వరరావు హాజరు కావడం లేదు. ఆయనను కలిసిన ఎమ్మెల్యేలు సైతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం.   ఇదిలా ఉంటే, ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,68,749 కి చేరింది.  కొత్తగా నలుగురు వ్యక్తులు కరోనా వల్ల మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు 6,996కి చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,427 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

అనవసర పదాలు తొలగించి "జనగణమన" ను మార్చండి.. మోడీకి బీజేపీ ఎంపీ లేఖ

మన దేశ జాతీయ గీతం "జనగణమన" లో కొన్ని అనవసర పదాలు ఉన్నాయని.. వాటిని మార్చాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. మన జాతీయ గీతంలో ఎవరినో ప్రశంసిస్తూ రాశాఋ అనే అనుమానాలు కూడా ప్రజలలో ఉన్నాయని అయన తెలిపారు. జాతీయగీతంలోని అనవసర పదాలను తొలగించి, అవసరమైన పదాలతో జాతీయ గీతాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని 1949 నవంబరు 26న అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబు రాజేంద్ర ప్రసాద్‌ చెప్పారని స్వామి ఈ సందర్భంగా గుర్తు చేశారు.   సుభాష్ చంద్ర బోస్ సారధ్యంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ 21 అక్టోబరు 1943న ఇంఫాల్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే వారు ఆలపించిన గీతాన్నే అమలు చేయాలని నిన్న ప్రధానికి రాసిన లేఖలో స్వామి డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆ గీతంలో పేర్కొన్న సింధ్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్ భూభాగంలో ఉందని, దీంతో ఆ పదాన్ని తొలగించి "ఈశాన్యం" అనే పదాన్ని జోడించాలని 2019లో కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారని అయన గుర్తుచేశారు. ఇదే సమయంలో "జనగణమన" లోని "భారత భాగ్య విధాత" అనే పదానికి బదులు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ 1943లో "శుభ్ సుఖ్‌ చైన్"’ అనే పదాన్ని జోడించి ఆలపించింది. అప్పట్లో ఈ కొత్త జాతీయ గీతాన్ని బోస్‌ రచించగా కెప్టెన్‌ రామ్‌సింగ్‌ స్వరపరిచారని అయన తెలిపారు. కొత్త జాతీయ గీతాన్ని వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ అంటే రిపబ్లిక్ డే లోపు రూపొందించాలని ప్రధానికి రాసిన లేఖలో అయన సూచించారు.

గ్రేటర్ లో ఓటింగ్ తగ్గడానికి అసలు కారణం ఇదేనా? 

హైదరాబాదీలు బద్దకస్తులు.. ఓటింగ్ కోసం సెలవు ఇస్తే హాలీ డే ట్రిప్ గా మారుస్తారు.. ఇది జీహెచ్ఎంసీలో ఓటింగ్ శాతం తక్కువగా జరగడంతో హైదరాబాదీలపై వస్తున్న విమర్శలు. అయితే క్షేత్రస్థాయిలో చూస్తే నగర ఓటర్లలో మెజార్టీ మంది.. అంటే దాదాపు 65 శాతం వరకు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. పోలింగ్ తర్వాత సిటీలోని కొందరు ఓటర్లను పరిశీలించినప్పుడు వారిలో మెజార్టీగా ఓటు వేసిన వారే. ఫీల్డ్ లో సీన్ ఇలా ఉంటే.. గ్రేటర్ పరిధిలో ఓవరాల్ ఓటింగ్ మాత్రం 45 దగ్గరే ఉంటుంది. ఇదే ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడానికి అసలు కారణం... ఓటర్ లిస్టు తప్పుల తడకగా ఉండటమే ప్రధాన కారణమని తెలుస్తోంది.    ప్రతిసారీ గ్రేటర్​ పరిధిలో చాలా తక్కువగా ఓటింగ్​ నమోదవడంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనాభా, ఓటర్ల లెక్కల టెక్నికల్​ అంచనాల మేర కు.. ప్రతి 100 మంది జనాభాకు 67 మంది ఓటర్లుండాలి. నగరాల్లో 70 మంది వరకు ఓటర్లు ఉంటరు. గ్రేటర్​ హైదరాబాద్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం 68 లక్షల మంది, 2014 సామాజిక సర్వే ప్రకారం 78 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం సిటీ జనాభా 90 లక్షలు అనుకుంటే... దాదాపు 65 లక్షల ఓటర్లు ఉండాలి. కానీ 74 లక్షల 44 వేల మంది ఉన్నారు. ఈ లెక్కన సిటీలో డబుల్ ఓటర్లు, నివాసం లేని వారి ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే.. లెక్కలేనన్ని తప్పులు కనపడతాయి. జనాభాకు, ఓటర్ల సంఖ్యకు అసలు పొంతనే ఉండదు. ఓటర్లకు.. పోలింగ్​కు లెక్క కుదరదు. ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేసుకునే విషయంలో చూపిస్తున్న చొరవ.. ఇండ్లు మారినప్పుడో, సిటీని వదిలి వెళ్తున్నప్పుడో, చనిపోయినప్పుడు జాబితాలో పేర్లు తొలగించడంలోనో చూపడం లేదు. దీనివల్ల హైదరాబాద్​ ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు రెండు, మూడు చోట్ల ఉన్నాయని ఎక్స్​పర్టులు చెప్తున్నారు. జిల్లాల్లో ఓట్లు ఉన్నవారికి కూడా గ్రేటర్ లో లక్షలాది మందికి ఓట్లు ఉన్నాయని తెలుస్తోంది.   అసెంబ్లీ, లోక్ సభ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు నగరంలో భారీగా కొత్త ఓట్లు నమోదవుతుంటాయి. ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు... ముందు జాగ్రత్తగా తమ వారితో బోగస్ ఓట్లు నమోదు చేయిస్తారని చెబుతున్నారు. జిల్లాలకు చెందిన వారితో అప్లయ్ చేయిస్తారు. వారందరికి ఓటు వస్తుంది. ఎన్నికల తర్వాత సదరు నాయకుడు ఈ ఓట్ల సంగతే మర్చేపోతాడు. దీంతో అలాంటి వారి ఓట్లు గ్రేటర్ జాబితాలో అలానే ఉంటాయి. సిటీలోని అద్దెకు ఉండేవారు... తాము వెళ్లిన ప్రతి చోట కొత్త ఓట్లకు నమోదు చేయించుకుంటారు. కాని తమ పాత ఓటును మాత్రం తీసివేయించుకోరు. ఇలా సిటీలో రెండు, మూడు ఓట్లు ఉన్నవారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు. సరైన జాబితా తయారీలో ఎస్‌ఈసీ ఫెయిలైందనే ఆరోపణలు వస్తున్నాయి.    పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు, భవన నిర్మాణ కూలీల ఓట్లను కొన్ని పార్టీలు, నేతలు.. ఎన్నికలకు ముందు ఎన్ రోల్ చేయిస్తుంటారు. తర్వాత వాటిని తొలగించరు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచే వచ్చి నగరంలో పనిచేసిన వేలాది మంది కూలీల పేర్లు కూడా గ్రేటర్ ఓటర్ జాబితాలో ఉన్నాయంటున్నారు. రాజకీయ నేతలకు సొంత కంపెనీలు ఉంటే.. తమకు ఎప్పటికైనా కలిసివస్తాయనే ఆశతో తమ వర్కర్ల పేర్లతో ఓట్లు నమోదు చేయిస్తున్నారు. కార్మికులకు ఇప్పటికే ఓటు ఉన్నా మళ్లీ అప్లయ్ చేయిస్తారు. రెండు ఓట్లు ఉన్నా గుర్తించే టెక్నాలజీ ఎన్నికల కమిషన్ దగ్గర లేకపోవడంతో వారందరికి రెండో, మూడో ఓట్లు కూడా వస్తున్నాయి. ఇలాంటి తరహా ఓటర్లు కూడా గ్రేటర్ లో వేలల్లోనే ఉంటారని చెబుతున్నారు.   మొత్తంగా  ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉండటం, ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తగ్గినట్లుగా క్రియేట్ అవుతుందనే అభిప్రాయం మేథావులు, రాజకీయ అనలిస్టుల నుంచి వస్తోంది. బోగస్, డబుల్, నివాసం లేని వారి ఓట్లను తొలగిస్తే గ్రేటర్ లో నిజమైన ఓటర్ల సంఖ్య 65 లక్షల వరకే ఉంటుందని చెబుతున్నారు. 65 లక్షల ఓటర్లకు గాను 35 నుంచి 40 లక్షలు పోలైతే దాదాపు 65 శాతం పోల్ అవుతున్నట్లే. హైదరాబాదీలపై వస్తున్న బ్యాడ్ ఇమేజ్ పోవాలంటే ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేయడమే పరిష్కారం అంటున్నారు. ఓటర్ల జాబితాలో తప్పుడు, రిపిటీషన్​ ఓట్ల తొలగింపు   పకడ్బందీగా చేపట్టాల్సి ఉందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అలా చేస్తే ఫేక్ ఓట్లు, డబుల్ ఓట్లు పోతాయని, నిజమైన ఓటర్లే హైదరాబాద్ లో మిగిలిపోతారని చెబుతున్నారు. అప్పుడే హైదరాబాదీలు ఓటింగ్ పాల్గొంటున్నారా లేక పోలింగ్ డే రోజును హాలీడేగా మార్చుకుంటురా తేలుతుందంటున్నారు ఎక్స్ పర్ట్స్.  

ఉగ్రవాదులు చొరబడిన సొరంగం ద్వారా పాకిస్తాన్ లోకి ఎంటరైన బీఎస్ఎఫ్ జవాన్లు.. 

కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను భగ్నం చేసే లక్ష్యంతో పాకిస్తాన్ నుండి భారత్‌లోకి ప్రవేశించిన జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులను గత నెల 19న జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా వద్ద భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఈ ఘటనలో వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి అంత పెద్ద మొత్తంలో ఆయుధాలు లభ్యం కావడంతో అధికారులు విచారణ చేపట్టగా సొరంగ మార్గం ద్వారా వారు కశ్మీర్‌లోకి ప్రవేశించినట్టు తేలింది. ఉగ్రవాదులు భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ఏర్పాటు చేసిన రహస్య సొరంగ మార్గాన్ని బిఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు.   దీంతో ఉగ్రవాదులు ఉపయోగించిన ఈ రహస్య సొరంగ మార్గం లోకి ఓ బిఎస్ఎఫ్ బృందం ప్రవేశించి దానివెంట 200 మీటర్ల మేర పాకిస్థాన్ భూభాగంలోకి ప్రయాణించారు. దీంతో దాయాది పాకిస్తాన్ కుట్రలను బిఎస్ఎఫ్ బహిర్గతం చేసింది. దీంతో ఈ సొరంగ మార్గం ప్రారంభం పాకిస్థాన్‌లో ఉన్నట్టుగా గుర్తించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు తమ సైన్యం సహకారంతో వారిని భారత భూభాగంలోకి పంపుతున్నారని భారత్ చేస్తున్న ఆరోపణలపై పాకిస్తాన్ ఎప్పటికప్పుడు బుకాయిస్తున్న నేపథ్యంలో.. తిరిగి వచ్చేటప్పుడు బిఎస్ఎఫ్ బృందం సాక్ష్యాధారాల కోసం వీడియో తీసినట్టు బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్తానా తెలిపారు. ఈ సొరంగ మార్గం సాంబా జిల్లా బోర్డర్ పోస్ట్ సమీపంలో ఉన్నట్లు కనుగొన్నారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 160 మీటర్లు, సరిహద్దు కంచె నుంచి 70 మీటర్ల పొడవు, 25 మీటర్ల లోతులో ఈ రహస్య సొరంగం ఉందని.. భారత వైపు దట్టమైన పొదల మధ్య దీని ద్వారం ఉందని ఆస్తానా తెలిపారు.

అర్చకులను చావబాదిన కేసులో ఆలయ చైర్మన్, ఉద్యోగుల అరెస్ట్ 

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార ఆలయంలో అర్చకులను చెర్నాకోలతో చావబాదిన కేసులో ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు నాగరాజు, ఈశ్వరయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా కార్తీక పౌర్ణమి ఆదివారం రాత్రి ఆలయ ఆవరణలో అటెండర్ ఈశ్వరయ్య టికెట్లు విక్రయిస్తుండాన్ని అర్చకుడు సుధాకరయ్య, ఆయన కుమారులు చక్రపాణి, మృగపాణి ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ తోపులాటలో కిందపడిన అటెండర్ ఈశ్వరయ్య వెళ్లి ఆలయ కమిటీ చైర్మన్, వైసీపీ నాయకుడు అయిన ప్రతాప్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఆగ్రహంతో ఊగిపోయిన ప్రతాప్‌రెడ్డి, ఆలయ సూపర్‌ వైజర్ నాగరాజు, మరో ఇద్దరితో కలిసి వచ్చీ రావడమే పూజారులపై చెర్నాకోల తో దాడిచేయగా, ఆయనతో కూడా వచ్చినవారు కర్రలతో అర్చకులను వెంబడించి మరీ కొట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చక్రపాణి గుడిలోకి వెళ్లి తాళం వేసుకున్నారు.   ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న నిందితులు ప్రతాప్‌రెడ్డి, నాగరాజు, ఈశ్వరయ్యలను అరెస్ట్ చేశారు. ఈ దౌర్జన్య ఘటనపై అటు అర్చక సంఘాల నుండి ఇటు భక్తుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి విచారణకు ఆదేశించారు. దీంతో దేవాదాయ శాఖ రీజినల్ కమిషనర్ వెంకటేష్, ఏసీ ఆదిశేష నాయుడు ఓంకార ఆలయానికి చేరుకొని అర్చకులతో విడివిడిగా విచారణ జరిపి తమ నివేదికను సిద్ధం చేసి దేవాదాయ కమిషనర్‌కు పంపుతున్నట్లు విలేకరులకు తెలిపారు. అయితే తమకు న్యాయం జరగకుంటే ఉరివేసుకుంటామని బాధిత పూజారులు సుధాకరయ్య, ఆయన కుమారులు విచారణకు వచ్చిన అధికారుల కారుకు అడ్డుగా నిలబడి ఆందోళన చేసారు. దీంతో దిగి వచ్చిన అధికారులు దాడికి పాల్పడిన కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని, పాలకమండలి రద్దు, ఈవో మోహన్ సస్పెన్షన్ కోరుతూ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మరోపక్క ఈ ఘటన పై బ్రాహ్మణ సంఘాలు వినూత్న పద్దతిలో తమ నిరసన వ్యక్తం చేసాయి. కర్నూల్ లో ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పేరిట పిండ ప్రధాన కార్యక్రమం చేసి తమ నిరసన వ్యక్తం చేసారు.

తస్సాదియ్యా.. తుస్సుమంది!

‘గ్రేటర్’ పోలింగ్ శాతం గోవిందా   తగ్గిన పోలింగ్ కారుకే లాభమా?   ‘అప్ప ఆర్భాటమే గానీ బావ బతికుంది లేద’న్నట్లుంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ వ్యవహారం. అమిత్‌షా నుంచి యోగి ఆదిత్యనాధ్ వంటి అతిరధమహామహులంతా దిగివచ్చి, కేటీఆర్ నుంచి కేసీఆర్ వరకూ ప్రచారం చేసినా గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన పోలింగ్  40 శాతమే.  బాగా చదువుకున్న వారు, అస్సలు చదువుకోని వారు, అత్తెసరు చదువుల మేలుకలయిక అయిన భాగ్యనగరంలో నమోదయిన ఈ పోలింగ్..   ‘భాగ్యనగర బద్ధకానికి’ ఓ తీపిగుర్తు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ, పోలింగ్‌బూత్‌ల వద్ద భూతద్దం పెట్టి వెతికినా ఓటర్లు కనిపించలేదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, మియాపూర్‌లో నివసించే సినిమాస్టార్లు,  పాపం అప్పటికీ.. మేము ఓటేశాం. మరి మీ సంగతేమిటని మేల్కొలిపేలా ట్వీట్లు చేసినా,  భాగ్యనగర బద్ధకిస్టుల్లో చలనం లేదు మరి! వచ్చిన సెలవులను టెకీలు, ప్రైవేటు ఉద్యోగులు హాయిగా జాలీ ట్రిప్పులు వేసుకుని నగరం దాటి... ఆరకంగా ముందుకెళ్లారు.   చదువుకున్న వాళ్లకంటే చదువులేనోళ్లే నయమన్న సామెత, గ్రేటర్ ఎన్నికల్లో అక్షరసత్యమయింది. కాళ్లు లేని వికలాంగులు.. ఒక్క కాలున్న వికలాంగులు, చేతికి కర్రను ఊతంగా చేసుకున్న పండు వృద్ధులకున్న ఓపిక... తీరిక, ‘మహానగర సకలాంగులకు’ లేకుండా పోయింది. తమ ఓటు హక్కు  వినియోగించుకున్న వికలాంగులే.. ‘ సకలాంగుల’నిపించుకున్నారు. కాలనీ బూత్‌లలో మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఓటరు జాడ మిణుకుమిణుకుమంటూనే కనిపించింది. అదే మురికివాడలు, బస్తీల్లోని పోలింగ్ బూత్‌లలో కనీసం 20, 30 మందితో ఉన్న క్యూలయినా కనిపించాయి. అడ్డగుట్ట ఒక్కటే ఓటర్లతో ఫుల్లయింది. అసలు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడూ 50 శాతం వరకూ చేరిన దాఖలాలే లేవు. 2002లో 41.22 శాతం, 2009లో 42.95 శాతం, 2016లో 45.27 ఇప్పుడు 37 శాతానికి దగ్గరగా చేరింది. ఇక ఈ ఎన్నికలే ఇలా ఉంటే..  రానున్న గ్య్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు,  ఇంకెంత సక్కదనంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మేధావులు, మేతావులకు కొదువ లేని మహానగర దుస్థితి ఇది.   ఇంతోటి దానికి.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీజేపీ-టీఆర్‌ఎస్ కార్యకర్తల బాహాబాహీ, ధర్నాలు, దౌర్జన్యాలు ఆరోపణలు, బురద రాజకీయాలు ఎందుకో అర్ధం కాదు. పాపం అమిత్‌షాలు, నద్దాలు, యోగులూ స్పెషల్‌ఫ్లైట్లు వేసుకుని వచ్చినా,  వారికి ఆయిల్‌ఖర్చు కూడా దండగే. నగరంలో ఆ మందం ఓట్ల శాతం  కూడా గిట్టుబాటుకాలేదు పాపం!   పోలింగ్ సరళి పరిశీలిస్తే.. బస్తీలు, మురికివాడలున్న ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు మొగ్గు కనిపించింది. ఇక కాలనీల్లో ఉన్న పోలింగ్ బూత్ ప్రాంతాల సరళి మాత్రం, బీజేపీ వైపే సానుకూలత వ్యక్తమయింది. కానీ కాలనీల్లోని పోలింగ్ బూత్‌లలో పోలింగ్ శాతం దారుణంగా కనిపించింది.  అయితే కమలం వికాసం పోలింగ్ బూత్ ప్రాంతాల కంటే,  బయటే ఎక్కువగా కనిపించింది.   కాగా.. తాజా సరళి తమకే అనుకూలమని తెరాస వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాము కనీసం 90 నుంచి 95 స్థానాలు సాధిస్తామన్న అంచనాతో ఉన్నారు. అటు మజ్లిస్ హవా ఉన్న ప్రాంతాల్లో కూడా,  పోలింగ్ శాతం తగ్గినప్పటికీ.. తాము 40 నుంచి 45 స్థానాలు సాధిస్తామన్న ధీమా మజ్లిస్ నేతల్లో కనిపిస్తోంది. బీజేపీ మాత్రం తగ్గిన ఓటింగ్ శాతంతో, కొంత గందరగోళంలో పడినట్లు నేతల వ్యాఖ్యల బట్టి అర్ధమవుతోంది. తగ్గిన పోలింగ్ శాతం.. సహజంగా అధికారపార్టీకే అనుకూలంగా ఉంటుందని, అయినా తాము తీవ్రస్థాయిలోనే పోటీ ఇచ్చామని కమలదళాలు చెబుతున్నాయి.   ఇక పోలింగ్ సరళి తొలి నుంచీ మందకొడిగానే మొదలయింది. సహజంగా ఏ ఎన్నికల్లోనయినా... ఒక పార్టీపై ఆగ్రహం ఉంటే, ఓటర్లు  పోలింగ్ కేంద్రానికి ఉత్సాహంగా  తరలివస్తారు. ఆ పార్టీపై తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో ప్రదర్శిస్తారు. సహజంగా ప్రజలకు అధికార పార్టీలపైనే   ఆగ్రహం ఉంటుంది కాబట్టి.. దానిని ఓడించాలని భావిస్తే, పోలింగ్‌బూత్‌లు ఓటర్లతో నిండిపోతాయి. ఆ పరిస్థితి, అలాంటి ఆగ్రహం ప్రదర్శించాలన్న కసి-పట్టుదల,  ‘గ్రేటర్’ ఎన్నికల్లో కనిపించలేదు. ఇక సహజంగా ఒక పార్టీకి మద్దతునివ్వాలనుకునే ఓటరు, తాపీగా.. సమయం చూసుకుని, తమ పనులు ముగించుకున్న తర్వాతనే  పోలింగ్ కేంద్రానికి వస్తారు. ఈలోగా తమ ప్రాధాన్యపరమైన పనులుంటే, పోలింగ్‌బూత్‌కూ రారు. కాకపోతే టీవీలు చూస్తూ, తమకు తెలిసిన వారికి ఫలానా పార్టీకి ఓటేయమని, లేకపోతే రాష్ట్రం నాశనమవుతుందంటూ  హితోక్తులు చెబుతుంటారు.   ఇది సహజంగా ఏ రాష్ట్రంలోనయినా కనిపించే ఓటర్ సైకాలజీనే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ అదే కనిపించింది. ఫలితమే మందకొడి పోలింగ్. మిగిలినదంతా ‘షేమ్’ టు ‘షేమ్’!  పదండి ముందుకు.  పదండి తోసుకు.. పోదాం పోదాం హాలిడే ట్రిప్పులకు!! ప్రజాస్వామ్యం ఎటు పోతే మాకెందుకు? ఏమైపోతే మనకెందుకు? అయినా మన ఒక్క ఓటుతోనే రాజ్యాలు తారుమారవుతాయా ఏంటీ? మనకు హాలిడే ఇచ్చారా.. ఎంజాయ్ చేశామా అన్నదే కదా ముఖ్యం? అంతే కదా.... బ్రో? -మార్తి సుబ్రహ్మణ్యం

గ్రేటర్ లో అనూహ్య ఫలితాలు! మేయర్ పీఠం ఆ పార్టీకేనా? 

గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు చేంజ్ కోరుకున్నారా? అధికార పార్టీ అభివృద్ది నినాదాన్ని ఆదరించారా? పాతబస్తిలో పతంగి పార్టీ పరిస్థితి ఏంటీ?. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన  జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు ఇవే హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ  జరుగుతోంది.  పోలింగ్ సరళి అధారంగా  లెక్కలు  వేసుకుంటూ ఎవరి గెలుస్తారో అంచనా వేసుకుంటున్నాయి పార్టీలు. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల్లో ఈసారి విలక్షమైన తీర్పు రాబోతుందని తెలుస్తోంది.    అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ భారీగా జరిగిందంటున్నారు. యువతతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులంతా కమలానికి మద్దతుగా నిలిచారని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. గతంలో నాలుగు డివిజన్లు గెలిచిన బీజేపీ ఈసారి 45 నుంచి 50 డివిజన్లు గెలవచ్చని చెబుతున్నారు. గతంలో 99 డివిజన్లు గెలిచిన టీఆర్ఎస్ ఈసారి 60 డివిజన్లలోపే ఆగిపోతుందని తెలుస్తోంది. ఓల్ట్ సిటీలో పట్టున్న ఎంఐఎంకు కూడా షాక్ తగలనుందని, ఆ పార్టీకి గతంలో కంటే 10 సీట్ల వరకు తగ్గవచ్చని.. అక్కడ జరిగిన పోలింగ్ సరళిని బట్టి అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ కు 6 నుంచి 10 సీట్లు  గెలవొచ్చంటున్న పొలిటికల్ అనలిస్టులు.. తెలుగు దేశం పార్టీ నాలుగైదు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చిందని చెబుతున్నారు.                     ఎల్బీనగర్, ఉప్పల్ , మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరిగిందని చెబుతున్నారు.ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉండగా... 2016లో కారు పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి టీఆర్ఎస్ కు తీవ్ర వ్యతిరేకత ఎదురైందని, రెండుమూడు సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఎల్బీనగర్ జోన్ లో ముందు నుంచి కాంగ్రెస్ బలంగా కనిపించినా... పోలింగ్ రోజున కొంత వెనకబడిందని తెలుస్తోంది. దీంతో ఎల్బీనగర్ సెగ్మెంట్ లో  బీజేపీ ఆరు నుంచి 8 డివిజన్లు గెలవడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఉప్పల్ లో  అధికార పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని తెలుస్తోంది. ఉప్పల్ నియోజకవర్గంలో మూడు పార్టీలకు సమంగా సీట్లు రావచ్చంటున్నారు. మల్కాజ్ గిరి జోన్ లో తొమ్మిది డివిజన్లు ఉండగా.. అధికార పార్టీకి నాలుగు, బీజేపీకి రెండు వస్తాయని మరో మూడు చోట్ల టఫ్ పైట్ నడించిందని అంచనా వేస్తున్నారు. ఏఎస్ రావు నగర్ లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని, ఆ సీటుపై ఆ పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.   కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ సాగింది. ఇక్కడ పోలింగ్  కేంద్రాల దగ్గర  చాలా చోట్ల గొడవలు జరిగాయి. కుత్బుల్లాపూర్ పరిధిలో కూడా బీజేపీ. టీఆర్ఎస్ కు సమానంగా సీట్లు రావొచ్చని, కాంగ్రెస్ కు రెండు సీట్లు రావొచ్చంటున్నారు. సెటిలర్లంతా బీజేపీ వైపు నిలిస్తే మాత్రం ఫలితం ఏకపక్షంగా ఉండవచ్చంటున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో తొమ్మిది డివిజన్లు ఉండగా.. ఇక్కడ అధికార పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారు. నాలుగు డివిజన్లలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉండటం గులాబీ పార్టీకి కలిసి రావచ్చని లెక్కలు వేస్తున్నారు. కేపీహెచ్బీ, బాలాజీనగర్ లో మాత్రం  బీజేపీ, టీఆర్ఎస్ మధ్య టఫ్ పైట్ నడిచింది. శేరిలింగం పల్లి నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉండగా.. ఇక్కడ కూడా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ జరిగింది. ఇక్కడ సెటిలర్లే కీలకం కావడంతో ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. అయితే టీఆర్ఎస్ కు ఐదు, బీజేపీకి రెండు రావచ్చని, వివేకానంద నగర్ డివిజన్ లో టీడీపీకి అవకాశం ఉందని చెబుతున్నారు.    సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ సాగిందంటున్నారు. సికింద్రాబాద్ , అంబర్ పేట నియోజకవర్గాల్లో బీజేపీకి... సనత్ నగర్, జూబ్లీహిల్స్  నియోజకవర్గాల్లో అధికార పార్టీ మెజార్టీ డివిజన్లు  వస్తాయని చెబుతున్నారు.  ఖైరతాబాద్ , ముషిరాబాద్ లో మాత్రం హోరాహోరీ ఉంటుందని తెలుస్తోంది.  ఈ రెండు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ కు చీలకుండా ముస్లిం ఓట్లలో ఎక్కువ శాతం కారుకు పడితే అధికార పార్టీకి మెజార్టీ సీట్లు దక్కవచ్చు. హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ఎంఐఎంకే మెజార్టీ డివిజన్లు వచ్చినా... గతంలో కంటే 10 సీట్లు తగ్గవచ్చంటున్నారు. నాంపల్లి, మలక్ పేట నియోజకవర్గాల్లో  కొన్ని సీట్లు బీజేపీకి .. గోషామహాల్ నియోజకవర్గంలో కొన్ని సీట్లు టీఆర్ఎస్ కు రావచ్చంటున్నారు. బీజేపీలోని విభేదాలు ఇక్కడ ఆ పార్టీకి నష్టం కలిగించాయని అంచనా వేస్తున్నారు.    రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నాలుగు డివిజన్లు ఉండగా.. అసదుద్దీన్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఈసారి ఎంఐఎం రెండు గెలవచ్చని చెబుతున్నారు. మైలార్ దేవ్ పల్లిలో ఎమ్మెల్యే సొదరుడు, బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డికి హోరాహోరీ పోరు జరిగిందంటున్నారు. అత్తాపూర్ లోనూ  గట్టి పోటీనే జరిగింది. మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్లను గెలిపించుకోవడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా శ్రమించినా.. అవి గెలవడం టీఆర్ఎస్ అంత ఈజీ కాదంటున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో మూడు డివిజన్లు ఉండగా.. గ్రేటర్ వ్యాప్తంగా ఇక్కడే ఎక్కువ పోలింగ్ జరిగింది. ఇక్కడ మూడు డివిజన్లలో బీజేపీ., టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ జరిగింది. అయితే మంత్రి హరీష్ రావు సీరియస్ గా ప్రచారం చేయడం, కేంద్ర సర్వీసు ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో టీఆర్ఎస్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు.     మొత్తంగా హోరాహోరీగా సాగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గతంలో కంటే భిన్నమైన ఫలితాలు రాబోతున్నాయని చెబుతున్నారు. పోలింగ్ శాతం తక్కువగా ఉండటంతో ఊహించని రిజల్ట్స్ కూడా రావచ్చంటున్నారు. కొన్ని డివిజన్లలో 10 వేల ఓట్లు మాత్రమే పోల్ కావడంతో 4 వేల ఓట్లు వచ్చిన వారు కూడా గెలిచే అవకాశం ఉంది. అలాంటి డివిజన్లలో షాకింగ్ ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో కంటే టీఆర్ఎస్ కు భారీగా సీట్లు తగ్గినా  ఎక్స్ అఫిషియో సభ్యులు.. అవసరమైతే  ఎంఐఎంతో కలిసి మరోసారి మేయర్ పీఠం సాధిస్తుందని మాత్రం చెబుతున్నారు.