కృత్రిమ వరద సృష్టించి ప్రకృతికి కోపం తెప్పించారా?
posted on Nov 27, 2020 @ 7:42PM
అదేదో సినిమాలో సునీల్ ఒక డైలాగ్ చెప్తాడు. "నెత్తి మీద జుట్టు ఉండాలనుకుంటే శాంపిల్ సోప్ వాడినా ఉంటుంది, ఒక్కసారి రాలిపోవాలని డిసైడ్ అయితే మాత్రం ఎంత కాస్ట్ లీ షాంపూలు వాడినా రాలిపోవడం ఆగదు". నివర్ తుఫాన్ పుణ్యమా అని ఇప్పుడు ఈ డైలాగ్ గుర్తుకొచ్చింది. మనం కృత్రిమ వరదలు సృష్టించినంత మాత్రాన నగరాలు అంత తేలికగా మునగవు. లోతట్టు ప్రాంతాలపైనే వరదలు ప్రభావం చూపిస్తాయి. ఇప్పటికైనా ఈ విషయం జగన్ సర్కార్ కి బోధ పడిందో లేదో!.
వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రాజధానిని మార్చేస్తుందని గత ఎన్నికలకు ముందు టీడీపీ ఆరోపించింది. అయితే, వైసీపీ మాత్రం అదంతా అబద్ధం, అమరావతే రాజధానిగా ఉంటుందని హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదని, వరదలు ముంచెత్తుతాయని ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చింది. అంతేకాదు, అమరావతిలో కృత్రిమ వరదలు సృష్టించే ప్రయత్నం కూడా చేసింది. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3 టీఎంసీలు అయితే.. రాజధాని ప్రాంతాన్ని ముంచాలనే ఉద్దేశంతో, 4 టీఎంసీల నీటిని బ్యారేజీలో నిల్వ ఉంచి కుట్రపూరితంగా నీళ్లను ఒకేసారి వదిలారని ఆరోపణలు కూడా వచ్చాయి. అలాగే, ఇటీవల భారీ వర్షాలకు ఏపీ హైకోర్టు ప్రాంతమంతా జలమయమైందని వైసీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. అయితే అదంతా తప్పుడు ప్రచారమని తరువాత తేలిపోయింది. దానితోపాటే రాజధానిగా అమరావతి ప్రాంత ఎంపిక కూడా సరైనదని తేలిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ సహా పలు మహా నగరాలు వరదలకు అల్లాడిపోయాయి. కానీ అమరావతిలో మాత్రం వరదలు రాలేదు.
ఇక, ఇప్పుడు నివర్ తుఫాన్ ధాటికి ఏపీలోని పలు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కడపను వరదలు ముంచేశాయి. బుగ్గవంక ప్రాజెక్టు నీటితో నగర ప్రజలు రాత్రంతా భయం గుప్పిట్లో గడిపారు. బుగ్గవంక పరీవాహ ప్రాంతాలకు చెందిన రెండు వేల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీగా పంట నష్టం కూడా వాటిల్లింది. కడపతో పాటు ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలు కూడా తుఫాన్ ధాటికి ప్రభావితమయ్యాయి. అయితే ఈ తుఫాన్ ప్రభావం కూడా అమరావతి ప్రాంతంలో కనిపించలేదు.
తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్టుగా.. ఒక ప్రాంతంలో కృత్రిమ వరద సృష్టించి ముంచాలని చూస్తే, ప్రకృతికి కోపం వచ్చి అన్ని ప్రాంతాలపై ప్రభావం చూపుతుందేమో అనిపిస్తుంది. మరి ఇప్పటికైనా జగన్ సర్కార్ అమరావతి వరదముప్పు ప్రాంతం కాదని తెల్సుకుంటుందో లేదో.