ఇలాంటి నేతలతో ప్రయోజనమేంటీ! వలసలపై బీజేపీలో చర్చ
posted on Nov 27, 2020 @ 6:27PM
తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఇతర పార్టీల్లోని నేతలను ఆహ్వానిస్తున్నారు కమలనాథులు. బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలిస్తూ.. ఆ పార్టీలోకి భారీగానే వలసలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొంత మంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు కమలం కండువా కప్పుకోగా.. మరికొందరు నేతలు త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మొదలుకొని నియోజకవర్గ స్థాయి నేతలు కాషాయ గూటికి చేరుతున్నారు. అయితే పార్టీలో జరుగుతున్న చేరికలపై బీజేపీలోనే భిన్న స్పందన వస్తుందనే ప్రచారం జరుగుతోంది. స్వామి గౌడ్ వంటి నేతలు ఫర్వాలేదు కాని.. ప్రజా బలం లేని లీడర్ల కోసం ప్రయత్నించడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎవరిని పడితే వారిని చేర్చుకోవడం వల్ల..అద్వానీ, వాజ్ పేయి వంటి మచ్చలేని నేతలు నడిపించిన పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందనే ఆందోళన కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది.
బీజేపీలోని కొందరు నేతలు భయపడుతున్నట్లే ఆ పార్టీలోకి తాజా వలసలు కనిపిస్తున్నాయి. గతంలో బీజేపీలో పనిచేసి వెళ్లినవారు, ఏనాడు ఎన్నికల్లో పోటీ చేసి గెలవని వారు, మీడియాలో ఫోకస్ కావడం తప్ప ప్రజల్లో పలుకుబడి లేని వారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేవారు, గొడవలు పడుతూ కాంట్రవర్సీగా ఉండే నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీలోకి జరిగిన వలసలు చూసినవారు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి, సర్వే సత్యనారాయణ, విక్రం గౌడ్, గూడురు నారాయణ రెడ్డి వంటి వారితో పార్టీకి ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువుంటాయనే గుసగుసలు బీజేపీ కార్యాలయంలో వినిపిస్తున్నాయి.
విజయశాంతి రాజకీయ జీవితం బీజేపీతోనే ఆరంభమైంది. ఇప్పటి వరకు ఆమె నాలుగు పార్టీలు మార్చేసింది. సొంతగా ఒక పార్టీ పెట్టుకుని కొంత కాలానికి దుకాణం ఎత్తేసింది. 1998లో బీజేపీలో చేరింది విజయశాంతి. కొంత కాలానికే బీజేపీ నుంచి బయటికొచ్చి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించింది. 2009లో ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసింది రాములమ్మ. 2009లో మెదక్ లోక్ సభ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కొద్ది రోజులకే కేసీఆర్ తో విభేదాలు రావడంతో ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయశాంతిని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. 2018 ఎన్నికల తర్వాత నుంచి ఆమె రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. రాజకీయాల్లో నిలకడ లేని రాములమ్మ చేరికతో బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏమిటన్న చర్చ బీజేపీలోనే జరుగుతోంది.
కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా బీజేపీలో చేరారు. సర్వేకు పెద్ద కేడర్ కూడా లేదు. ఆయనకు సొంత నియోజకవర్గం కూడా లేదు. గత ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఇప్పుడాయన పార్టీలో చేరితే ఉపయోగం ఏంటన్నది కొందరు కమలనాధుల వాదన. ఎప్పుడూ వివాదాస్పద కామెంట్లతో కాంట్రవర్సిగా ఉండే సర్వేతో కమలానికి నష్టమే తప్ప లాభం ఉండదనే చర్చ కమలనాధుల్లో జరుగుతుంది.సర్వే లాంటి నేతలు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు. గతంలో ఆయన చేసిన కామెంట్లు చాలాసార్లు కాంట్రవర్సీ అయ్యాయి. బీజేపీ నేతగానూ ఆయన నోరు జారితే పార్టీకి తీరని నష్టం జరగవచ్చనే అభిప్రాయం కొందరు బీజేపీ నేతల నుంచి వస్తుందని చెబుతున్నారు.అంతేకాదు సర్వేతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారనే విషయం తెలిసాకా కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందిగా మారాయి.తాము వద్దనుకుని వదిలించుకున్న నేతలను బీజేపీ తీసుకుంటుందనే కాంగ్రెస్ నేతల కామెంట్లకు కమలనాధుల దగ్గర కౌంటరే లేకుండా పోయింది.
మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ కూడా బీజేపీలో చేరబోతున్నారు. విక్రం గౌడ్ రాజకీయాల్లో పూర్తిగా విఫలమైన వ్యక్తి. 2016 గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అతన్ని మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన విక్రం గౌడ్ తన డివిజన్ లో మూడో స్థానంలో నిలిచి ఘోరంగా ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషా మహాల్ నుంచి పోటీ చేసి కనీస పోటీ కూడా ఇవ్వలేదు. మూడేండ్ల క్రితం విక్రం గౌడ్ పై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే పోలీసుల విచారణలో .. విక్రం గౌడే కిరాయి గ్యాంగుతో తనపై దాడి చేయించుకున్నాడని తేలడంతో అతని పరువు పోయింది. డివిజన్ లో కార్పొరేటర్ గా గెలవలేని వ్యక్తి బీజేపీలోకి వస్తే పార్టీకి వచ్చే ప్రయోజనం ఏంటన్నది కమలం కార్యకర్తల ప్రశ్న. పీసీసీ కోశాధికారిగా ఉన్న గూడురు నారాయణ రెడ్డి కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం ఉంది. మీడియాలో ఫోకస్ కావడం తప్ప జన బలం లేని గూడూరు లాంటి నేతలతో పార్టీకి ప్లస్ అయ్యేది ఏమి లేదని బీజేపీలో చర్చ జరుగుతోంది.
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. కొత్తగా వచ్చిన నేతలు కార్పొరేటర్ అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వలస నేతలకు టికెట్లు ఇవ్వడంపై పార్టీలో నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగం పల్లి నియోజకవర్గాల్లో మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు ఆందోళన చేశారు. అంతేకాదు కొత్తగా వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీకి నష్టం జరిగిందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీలో చేరుతున్న నేతలతో భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీలో ఇప్పటికే బలమైన నేతలు ఉన్నారని, పార్టీ బలోపేతానికి అవసరమయ్యే నేతలను తీసుకుంటే సరిపోతుందని కొందరు నేతలు చెబుతున్నారు. ప్రజా బలం లేని, వివాదాస్పదంగా ఉండే నేతలను తీసుకుంటే పార్టీకి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.