కేసీఆర్ సభ టైంలోనే ప్రధాని టూర్! గ్రేటర్ వ్యూహమేనా?
posted on Nov 27, 2020 @ 9:55AM
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగుతున్న సమయంలో ప్రధాని మోడీ హైదరాబాద్ రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకే వస్తున్నా.. గ్రేటర్ ఎన్నికల సమయంలో పర్యటన ఉండటం పొలిటికల్ హీట్ పెంచుతోంది. అందులోనూ సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల సభ ఉన్న రోజునే.. అదే సమయానికే మోడీ హైదరాబాద్ వస్తుండటం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలతో గ్రేటర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా అధికారిక కార్యక్రమమే అయినా.. ఎంపిక చేసుకున్న సమయంపై రాజకీయ ఆసక్తి నెలకొంది. సాధారణంగా ప్రధాని పర్యటన ఉంటే రాష్ట్రాల అధికారులకు వారం రోజుల ముందే సమాచారం వస్తుంది. ప్రధాని పర్యటనకు పోలీసులు ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా ఇలా వారం రోజుల ముందే చెబుతారు. కాని ఈసారి ప్రధాని పర్యటనకు సంబంధించిన సమాచారం రాష్ట్ర అధికారులకు కేవలం రెండు రోజుల ముందే వచ్చింది. దీంతో పోలీసులు హడావుడిగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని బట్టే ప్రధాని హైదరాబాద్ పర్యటన అకస్మాత్తుగా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది.
జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ ఏర్పాట్లు కూడా చేస్తుంది. అయితే శనివారమే ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్నట్లు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. కోవిడ్–19 వైరస్‌కు విరుగుడుగా నగరానికి చెందిన భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ తయారుచేస్తున్న ‘కొవాగ్జిన్’ పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ప్రధాని వస్తున్నారని కేంద్ర సర్కార్ సమాచారమిచ్చింది. 28న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా మోదీ హకీంపేట సైనిక విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి శామీర్‌పేట వద్ద గల భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శిస్తారు. వ్యాక్సిన్ రూపకల్పనకు కృషిచేస్తున్న శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం పుణె పర్యటనకు వెళ్తారని అధికారవర్గాలు తెలిపాయి.
ఎల్బీ స్టేడియంలో 30 వేలమందితో బహిరంగసభ నిర్వహించి గ్రేటర్ ఎన్నికల వాతావరణాన్ని టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మలచుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నారు. సరిగ్గా అదేరోజు ప్రధాని మోడీ అధికారిక పర్యటన ఖరారు కావడం వెనక బీజేపీ వ్యూహం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో దూకుడుగా వెళుతూ ఓటర్లను ఆకర్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. చివరి అస్త్రంగా ప్రధాని మోడీని నగరానికి రప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం బహిరంగసభ రోజే ప్రధాని నగర పర్యటన జరిగితే జాతీయ మీడియాతో పాటు స్థానిక మీడియాలోనూ ప్రధాని పర్యటనకు అధిక ప్రచారం లభించే అవకాశాలున్నాయని.. బల్దియా ఎన్నికల్లో బీజేపీకి ప్రధాని పర్యటన కొంత వరకు కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి ముఖ్య నేతలు బల్దియాలో ఎన్నికల ప్రచారం చేశారు. జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ ను కూడా బీజేపీ రంగంలోకి దింపింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి 2023లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమను గెలిపిస్తే గ్రేటర్ ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని బీజేపీ హామీ ఇవ్వడం.. ప్రధాని మోడీ కూడా కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలించేందుకు వస్తుండటం ఆసక్తిగా మారింది. ఇది కచ్చితంగా కమలనాధులకు కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం ప్రధాని మోడీ పర్యటనకు గ్రేటర్ ఎన్నికలకు సంబంధం లేదని చెబుతున్నారు.కరోనాపై ఇటీవలే సీఎంలతో ప్రధాని సమీక్ష నిర్వహించారని, అందులో వచ్చిన అభిప్రాయాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలించేందుకు ప్రధాని వస్తున్నారని క్లారిటీ ఇస్తున్నారు.
మరోవైపు ప్రధాని మోడీ అధికారిక పర్యటన కోసం నగరానికి వస్తే ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ సైతం ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తరువాతే కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగసభకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.