రాజకీయ గందరగోళంలో గబ్బర్ సింగ్! తమిళ పత్రిక సెటైర్లు
posted on Nov 28, 2020 @ 11:31AM
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను గందరగోళ నేతగా అభివర్ణించింది తమిళనాడుకు చెందిన ఓ సాయంకాల దినపత్రిక. ఆయనపై సెటైర్లు వేస్తూ తమిళ మురసులో ప్రత్యేక కథనం వచ్చింది. రాజకీయాల్లో ఆయన తీసుకుంటున్న అయోమయ నిర్ణయాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయనను ఇలానే అనుకుంటున్నారని ఆ పత్రిక రాసుకొచ్చింది. జనసేన పార్టీ ఆవిర్బావం నుంచి పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పార్టీలతో పొత్తుల అంశాలను వివరిస్తూ.. పవన్ కల్యాణ్ ను గందరగోళవాదిగా చూపించే ప్రయత్నం చేసింది తమిళ మురసు సాయంకాల పత్రిక.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు గందరగోళంగా ఉంటున్నాయనే ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్. 50 డివిజన్లకు అభ్యర్థులు ఖరారయ్యారని చెప్పారు. పార్టీ ఆఫీసులో గ్రేటర్ ఎన్నికల కోసం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని, బీజేపీకి తాము మద్దతిస్తామని ప్రకటించారు. ఈ వివరాలను కూడా తమిళ పత్రిక తమ కథనంలో పొందు పరిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ పార్టీ తొలుత నిర్ణయించిందని, అయితే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్‌లను కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ తన మనసు మార్చుకుని యూటర్న్ తీసుకున్నారని విమర్శించింది. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, బీజేపీకి జనసేన మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారని వివరించింది. అంతేకాకుండా, అప్పటికే ప్రకటించిన అభ్యర్థులను వెనక్కి తీసుకుంటున్నట్టు పవన్ చెప్పారని ఆ పత్రిక తమ కథనంలో పేర్కొంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ కూటమిలో చేరిన పవన్ పార్టీకి ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని, ఆ తర్వాత మాయవతి నేతృత్వంలోని ఆ కూటమి నుంచి జనసేన బయటకు వచ్చిందని, అనంతరం బీజేపీతో పవన్ సంబంధాలు పెట్టుకున్నారని కథనంలో పేర్కొంది. దీంతో ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో తెలియని పవన్‌ను గందరగోళ రాజకీయ నేతగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు విమర్శిస్తున్నారని తమిళ మురసు తన కథనంలో పేర్కొంది. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా తాజాగా పవన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనప్పుడు పార్టీ ఎందుకని ఆయన ప్రశ్నించారు.