జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్: ఎయిమ్స్ గుడ్ న్యూస్ 

మనదేశంలో కరోనా టీకా కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఆలిండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. డిసెంబర్ చివరికి లేదా జనవరిలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ తెలిపారు. కరోనా టీకా పరీక్షలు తుది దశకు చేరుకున్నాయని, అత్యవసర వినియోగానికి అనుమతులు లభించిన వెంటనే పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని భద్రపరిచేందుకు అవసరమైన ఉష్ణోగ్రతలు, స్థలం, వ్యాక్సిన్ ఇచ్చే వారికి శిక్షణ, సిరంజిల లభ్యత వంటి వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏర్పాట్లు చేస్తున్నాయని డాక్టర్ రణ్‌దీప్ వెల్లడించారు.   కరోనా టీకా సేఫ్టీ, రియాక్షన్స్  పైనా ఎయిమ్స్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. కరోనాటీకాకు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నప్పుడు అపశ్రుతులు సహజమేనని చెప్పారు.  చెన్నైలో వ్యాక్సిన్ పరీక్షలో పాల్గొన్న ఓ వలంటీర్ అనారోగ్యానికి గురైనట్టు వచ్చిన వార్తలపైనా డాక్టర్ రణదీప్ స్పందించారు. అతడికి ఇతరత్రా కారణాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తి ఉండొచ్చని, టీకా వల్ల అయి ఉండదని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 80 వేల మంది వలంటీర్లకు టీకా ఇచ్చినా ఎవరిలోనూ ఎటువంటి సమస్యలు ఎదురు కాలేదన్నారు. అయితే ఏదైనా వ్యాక్సిన్‌ను సుదీర్ఘకాలంపాటు తీసుకుంటే మాత్రం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. మన దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు చెప్పిన డాక్టర్ గులేరియా.. మరో మూడు నెలల్లో పెద్ద మార్పు కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రేటర్ పీఠం మళ్లీ గులాబీదే!  ఎగ్జిట్ పోల్స్ లో కారు హవా  

గ్రేటర్‌ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. ఇప‍్పటివరకూ వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌లో అధికారి పార్టీదే హవా. గతంలో కంటే సీట్లు తగ్గుతున్నా.. టీఆర్‌ఎస్‌ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఓట్ల శాతం మెరుగ్గా ఉన్నా సీట్లలో బీజేపీ వెనకబడే ఛాన్స్‌ ఉంది. పాతబస్తిలో పట్టు నిలుపుకుని మజ్లిస్‌ పార్టీ 40 కంటే ఎక్కువ సీట్లలో గెలవనుందని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది.    ‘పీపుల్స్‌ పల్స్‌’ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే లో టీఆర్‌ఎస్‌కు 68-78 స్థానాలు, బీజేపీకి 25-35, ఎంఐఎంకు 38-42 స్థానాలు, కాంగ్రెస్‌కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌, బీజేపీకి మధ్య 6 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సైలెంట్‌ వేవ్‌ కన్పిస్తోందని..ఈ వేవ్‌ పనిచేస్తే బీజేపీ మరింత లాభపడే అవకాశం ఉందని ‘పీపుల్స్‌ పల్స్ వెల్లడించింది.    టీఆర్‌ఎస్‌కు 71 నుంచి 85 వరకు సీట్లు వస్తాయని ఆరా సర్వేలో వచ్చింది. ఆరా అంచనా ప్రకారం బీజేపీకి 23 నుంచి 33 సీట్లు రానున్నాయి. ఎంఐఎంకు 36 నుంచి 46, కాంగ్రెస్ కు సున్నా నుంచి 4 సీట్లు వస్తాయని ఆరా సర్వే తెలిపింది. సీపీఎస్‌సర్వేలో టీఆర్‌ఎస్‌కు 82 నుంచి 96 సీట్లు రానుండగా.. బీజేపీకి 12-20  సీట్లు, ఎంఐఎంకు 32 నుంచి 38 సీట్లు వస్తాయని అంచనా వేసింది.  ఏకంగా 95 నుంచి 101 డివిజన్లులో కారు గెలుస్తుందని నాగన్న సర్వే వెల్లడించింది. నాగన్న సర్వేలో బీజేపీకి 5 నుంచి 12, ఎంఐఎంకు 35 నుంచి 38 డివిజన్లు రానున్నాయని తెలిపింది. ఎన్ఎఫ్వో సంస్థ టీఆర్ఎస్ 85-95, బీజేపీ 15-25 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆత్మసాక్షి సర్వేలో టీఆర్‌ఎస్‌కు భారీ సీట్లు 82 నుంచి 88 సీట్లు వస్తాయని తేలింది.   గ్రేటర్ ఎన్నికలపై ఇప్పటివరకు వెల్లడైన అన్ని సర్వేల్లోనూ టాప్‌గా కనిపిస్తోంది టీఆర్‌ఎస్‌. అధికార పార్టీకి కనిష్టంగా 68, గరిష్టంగా 101 సీట్లు వచ్చాయి. బీజేపీకి గరిష్టంగా 35, కనిష్టంగా ఐదు డివిజన్లు రానున్నాయి.ఎంఐఎంకి కనిష్టంగా 32, గరిష్టంగా46 సీట్లు వస్తాయని తేలింది. శాంతి భద్రతల అంశంలో టీఆర్‌ఎస్‌కు మార్కులు వచ్చాయని సర్వే సంస్థలు వెల్లడించాయి. మహిళలు, వృద్ధులు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. అయితే వరద సాయంలో విషయంలో మాత్రం  51% మంది టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీకి అనుకూలంగా యువత, నిరుద్యోగులు నిలిచారు. పాతబస్తీలో పట్టు కొనసాగించింది మజ్లిస్‌ పార్టీ. 12 నుంచి 14 సీట్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ ఉందని అంచనా వేశారు.

పెన్ను మార్క్ కూడా ఒకే.. ఎలక్షన్ కమిషన్ అర్ధరాత్రి సర్క్యులర్ పై హైకోర్టుకు బీజేపీ 

జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ మరి కొద్దీ సేపట్లో ప్రారంభం అవుతుందనగా నిన్న అర్ధరాత్రి తెలంగాణ ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. బ్యాలెట్ పేప‌ర్ల‌పై కేవలం స్వ‌స్తిక్ గుర్తు ఉన్న‌వే కాకుండా…పోలింగ్ కేంద్రాల సంఖ్య‌ను సూచించే ముద్ర‌లు వేసినా లేక మార్కర్‌ పెన్నుతో టిక్కు పెట్టినా ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవాలంటూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.   ఎన్నికల సంఘం తాజా ఆదేశాల పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ఆదేశాల పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ అధికారులకు మాత్రమే జారీ చేసిన ఆ సర్క్యులర్‌ వెనుక ఆంతర్యం ఏంటని అయన ఎస్‌ఈసీని నిలదీశారు. ప్రగతిభవన్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఎన్నికల కమిషనర్‌ ఈ సర్క్యులర్‌ జారీ చేశారని అయన ఆరోపించారు. తక్షణం ఈ సర్క్యులర్‌ను రద్దుచేయాలని, ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులైన అధికారులను సర్వీసు నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అవసరమైతే దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని అయన ప్రకటించారు. అయితే తాము కౌంటింగ్‌ను మాత్రం అడ్డుకోబోమన్నారు. ఈ సర్క్యులర్ విషయంలో ముఖ్యమంత్రికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు గుణపాఠం తప్పదన్నారు. అంతేకాకుండా ఎస్‌ఈసీని గ్యాంబ్లర్‌గా అభివర్ణించిన సంజయ్‌.. ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారని మండిపడ్డారు.   తెలంగాణ ఎన్నికల సంఘం తాజా ఆదేశాలపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నిక‌ల సంఘం నిర్ణయం పై విచారణ చేపట్టాలని కోరుతూ బీజేపీ నేత‌లు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మ‌రి కొద్దిసేప‌ట్లో ఈ అంశంపై కోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఎటు వెళుతుందో చూడాలి.

ఇద్దరు ముఖ్య నేతలపై నిఘా! జగన్ కు తిరుగుబాటు భయమా?  

రాజకీయాల్లో నమ్మకానికి చోటు ఉండదంటారు. పదవుల కోసం నాయకులు ఎంతకైనా తెగిస్తారు.. తమ అధినేతలనే ఎదురిస్తారు.. అవసరమైతే  దిగజారిపోతారు.  తమకు ఎప్పుడు సమయం దొరుకుంతుందా అన్నట్లుగా ఎదురు చూస్తుంటారు నేతలు. ఏ చిన్న అవకాశం వచ్చినా తిరుగుబాటుకు కూడా వెనుకాడరు.  గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అందుకే రాజకీయ నేతలు పూర్తిగా ఎవరిని నమ్మరని చెబుతారు.  ముఖ్య నేతలైతే తమ వెంట ఉండేవారిపైనా నిఘా పెడుతుంటారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో  కనిపిస్తోంది. వైసీపీలో కీలక నేతలుగా ఉన్న ఓ కుటుంబంపై ఇప్పుడు.. ఆ పార్టీ పెద్దల్లో అనుమాన బీజం మొదలైందని చెబుతున్నారు. ఆ కారణంగానే నేతలను  పక్కన పెడుతున్నారనే చర్చ జరుగుతోంది.     ఆ తండ్రి కొడుకులు ప్రస్తుతం ఏపీకి సంబంధించి కీలక పదవుల్లో ఉన్నారు. సీఎం వైఎస్‍ జగన్‍ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆ తండ్రి కొడుకులపై  జగన్‍రెడ్డి గతంలో ఎంతో నమ్మకం చూపించేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు,  అధికారంలోకి వచ్చాక  కూడా ఆ ఇద్దరికి  అత్యంత విలువ ఇచ్చేవారు. కాని ఇప్పుడు మాత్రం సీన్ మారిందంటున్నారు.  ఆ తండ్రి కొడుకులపై సిఎం జగన్‍ రెడ్డికి అనుమానాలు వచ్చాయంటున్నారు. మీడియాతో పాటు సోషల్‍ మీడియాలో వస్తున్న కథనాలతో అవి మరింత బలపడ్డాయని చెబుతున్నారు. దీంతో గతంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ఆ ఇద్దరు నేతలను ఇప్పుడు జగన్ ఎక్కువగా పట్టించుకోవడం లేదనే చర్చ వైసీపీ నేతల్లో జరుగుతోంది. ఆ మంత్రి కుమారుడు  తాడేపల్లి నివాసానికి ఎప్పుడు వచ్చినా రెడ్‍ కార్పెట్‍ పరిచేవారు. ఆ ఎంపీ మాత్రమే  జగన్‍ రెడ్డిని ఏ సమయంలోనైనా కలిసే వ్యక్తిగా పేరుంది. అలాంటి నేత ఇప్పుడు అనుమానపు చూపులతో తాడేపల్లి రావడమే మానేశారని తెలుస్తోంది.    వైసీపీ పెద్దలకు అనుమానం వచ్చిన ఆ ఇద్దరు నేతలు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. మిధున్‍ రెడ్డి. తండ్రి పెద్ది రాంచంద్రారెడ్డి జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉండగా.. ఆయన తనయుడు మిథున్ రెడ్డి వైసీపీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. వారిద్దరిపై జగన్ కు అనుమానం రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి పదవే. ఇటీవల సీఎం జగన్ పై ఓ చర్చ జరుగుతోంది. కోర్టు తీర్పుల వలన జగన్  జైలుకు వెళ్లవచ్చని.. జగన్ జైలుకు పోతే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్నది ఆ చర్చ సారాంశం. జగన్ భార్య భారతిని కానీ.. తల్లి విజయలక్ష్మీని కానీ ముఖ్యమంత్రిని అవుతారని కొందరు చెబుతున్నారు. ఇక్కడే అసలు  ట్విస్ట్ మొదలైంది. ముఖ్యమంత్రి రేసులో మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జగన్ జైలుకు పోతే  ముఖ్యమంత్రి కావాలని పెద్దిరెడ్డి ఆశ పడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఆయనకు 70 నుండి 80 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని.. అవసరమైతే ఆయన తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని కొన్ని మీడియా సంస్థలు కధనాలు ప్రచురించాయి. ఒకటి రెండు టివి ఛానెళ్లు ఆ మంత్రిని ఇంటర్యూ  కూడా చేశాయి.    ఇదే ఇప్పుడు ఆ తండ్రి కొడుకులకు సమస్యగా మారిందంటున్నారు. తనకు అలాంటి ఆలోచన లేదని, సిఎం జగన్‍ రెడ్డి జైలుకు వెళ్లే ప్రసక్తే లేదని పెద్దిరెడ్డి చెబుతున్నారు. ఒకవేళ  ఏదైనా జరిగితే .. సిఎంగా జగన్‍  ఎవరిని సూచిస్తే వారినే అంగీకరిస్తామే తప్ప సిఎం పోస్టు కోరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయినా పెద్దిరెడ్డిపై జరుగుతున్న ప్రచారం ఆగడం లేదు.  దీంతో సీఎం జగన్ కూడా వారిని నమ్మడం లేదని చెబుతున్నారు.  మంత్రి రామచంద్రారెడ్డితో పాటు ఎంపీ మిధున్‍ రెడ్డి కదలికలపై  ముఖ్యమంత్రి నిఘా వేయించారని ప్రచారం జరుగుతోంది. ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం తమపై ఎలాంటి నిఘా లేదంటున్నారు. తాము జగన్‍  వీర విధేయులమని, తమపై కావాలనే లేనిపోని అనుమానాలను కొందరు సృష్టిస్తున్నారని వాపోతున్నారు. అయితే  మంత్రి రామచంద్రారెడ్డి తిరుగుబాటు చేస్తారని జరుగుతున్న ప్రచారం వెనుక వైసీపీ నేతలే ఉన్నారనే అనుమానాలు కూడా  వస్తున్నాయి. అయితే ఆ సూత్రదారులు, పాత్రదారులు ఎవరో బయట పడటం లేదు.. మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై జరుగుతున్న చర్చ మాత్రం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

నీకు సబ్జెక్ట్ తెలియదు.. అసెంబ్లీ ఏమన్నా మీ తాత జాగీరా?

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ ముమ్మాటికీ ఫేక్‌ ముఖ్యమంత్రేనని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే పెన్షన్లను భారీగా తొలగించారని ఆరోపించారు. సభల్లో జగన్ చెప్పేది ఓ లెక్క అయితే.. ప్రభుత్వ డేటాలో ఉండేది మరో లెక్కని అన్నారు. టీడీపీకి చెందిన వారికి పెన్షన్‌, రేషన్‌ కట్‌ చేశారని చెప్పారు. టీడీపీ హయాంలో 44.32 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం అబద్దం చెప్పిందన్నారు. టీడీపీ హయాంలో 50.29 లక్షల మందికి పెన్షన్‌ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. పెన్షన్ల విషయంలో వైసీపీ తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు.    అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదని విమర్శించారు. అసెంబ్లీని వైసీపీ నేతలు తప్పుదారి పట్టించారని ధ్వజమెత్తారు. టీడీపీ వాళ్లు అసెంబ్లీకి రాకూడదని అంటున్నారు.. అసెంబ్లీ ఏమన్నా మీ తాత జాగీరా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.     జగన్‌ ఒక జీరో సీఎం.. అవగాహన లేని ముఖ్యమంత్రి అని విమర్శించారు. దిశ చట్టం తెస్తున్నామని, అసెంబ్లీలో ప్రకటించిన నాడే జగన్ కు హితవు పలికానని అన్నారు. కొంచెం ఓపిక పట్టు, నీకు పెద్దగా విషయ పరిజ్ఞానం లేదు అని నచ్చచెప్పేందుకు యత్నించానని తెలిపారు. సబ్జెక్టు గురించి ఏం తెలుసు నీకు? కనీసం బిజినెస్ రూల్స్ అంటే తెలుసా? హెచ్ఓడీ రూల్స్ తెలుసా? సచివాలయ రూల్స్ తెలుసా? ఏమీ తెలియవు నీకు అని విమర్శించారు. చట్టం తెచ్చిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. ఇవేమీ చెయ్యకుండా చట్టాన్ని ఢిల్లీకి పంపించి ఇక్కడ పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు. బుద్ధి ఉన్నవాడెవడూ ఇలా చేయడు. మేం కట్టిన పోలీస్ స్టేషన్లకు రంగులేసుకుని రిబ్బన్ కట్ చేశారు. ఇలాంటి వాళ్లతో రాష్ట్రం పరువేం కావాలి! అతను అమాయకుడో, మనం అమాయకులమో అర్థం కావడంలేదు అని విరుచుకుపడ్డారు.

కరోనా టీకా ప్రభావాన్ని పరీక్షిస్తాం! ముగ్గురు అగ్రనేతల సాహసం 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో అమెరికాకు చెందిన ముగ్గురు మాజీ అగ్రనేతలు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు తామే ముందుగా కరోనా టీకాను తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్‌ లు దీనికి సంబంధించిన ప్రకటనలు చేశారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి పొందిన తర్వాత కరోనా వ్యాక్సిన్లను తీసుకునే వాలంటీర్లుగా ఉండేందుకు సిద్ధమని ముగ్గురు అగ్రనేతలు ప్రకటించారు.    అమెరికాలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది. వైరస్ ప్రభావం మొదలైన తొలినాళ్లలో యూఎస్ లో భారీ సంఖ్యలో కేసులు వచ్చాయి. మధ్యలో కొంచెం తగ్గాయి. గత కొన్ని రోజులుగా మళ్లీ వైరస్ కేసులు  పెరుగుతున్నాయి. అమెరికాలో కరోనా మరణాలు కూడా ప్రమాదకరంగానే ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే యూఎస్‌కు చెందిన ఫైజర్, మోడెర్నా ఔషధ కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్స్ ప్రభావంతంగా పని చేస్తున్నట్లు తేలింది. దీంతో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందిన వెంటనే ప్రజలకు ఈ వ్యాక్సిన్లను ఇచ్చేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. కాని అక్కడి ప్రజల్లో ఈ వ్యాక్సిన్ల భద్రత, ప్రభావంపై అనుమానం నెలకొంది. సుమారు 42 శాతం మంది ఈ టీకాలను తీసుకోవడానికి సుముఖంగా లేరని తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ తరుణంలో ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకు తాము స్వచ్ఛందంగా టీకా తీసుకుంటామని ప్రకటించారు.    ప్రజల్లో టీకా భద్రత, ప్రభావంపై విశ్వాసాన్ని పెంపొందిచేందుకు తాను కెమెరా సాక్షిగా వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధమని ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో  ఒబామా ప్రకటించారు. మరో మాజీ అధ్యక్షుడు జార్జీ బుష్ కూడా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫ్రెడ్డీ ఫోర్డ్  చెప్పారు. అలాగే వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించి, ప్రోత్సహించడానికి బహిరంగంగా టీకాను తీసుకోవడానికి బిల్ క్లింటన్‌ కూడా రెడీగా ఉన్నారని ఆయన ప్రెస్ సెక్రటరీ ఏంజెల్ యురేనా వెల్లడించారు.

జనవరిలో పార్టీ పెడతానన్న రజనీ! ఈసారైనా ఖాయమేనా?    

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీపై సాగదీత దోరణి కొనసాగిస్తూనే ఉన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్.  మూడేళ్లుగా పెండింగులో ఉన్న పార్టీ ఏర్పాటుకు సంబంధించి తాజాగా ట్వీట్ చేసినా .. అందులోనూ పూర్తి స్పష్టత ఇవ్వలేదు . త్వరలోనే తాను పార్టీ పెట్టబోతున్నానని గతంలో చెప్పినట్లే మళ్లీ చెప్పారు తలైవా. డిసెంబర్ 31 తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఆ సస్పెన్స్ ను కొనసాగించారు. వచ్చే  మేలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా పార్టీ ఏర్పాటుపై సాగదీయడంపై విమర్శలు వస్తున్నాయి. అసలు రజనీకాంత్ కు పార్టీ పెట్టే ఆలోచన ఉందా? పార్టీ పెట్టినా సీరియస్ గా ముందుకు పోతారా లేక నామ్ కే వాస్తాగా మారుస్తారా ? అన్న ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీపై మూడేళ్లుగా నాన్చడం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.   మూడేళ్ల క్రితం రాజకీయ పార్టీపై ప్రకటన చేసినా అది  ప్రచారంగానే మిగిలిపోవడం.. మరో ఐదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రజనీకాంత్ పార్టీ ఉండకపోవచ్చని దాదాపుగా అందరూ నిర్ణయానికి వచ్చారు. ఇంతలో సడెన్ గా మేల్కొన్న రజనీకాంత్.. నవంబర్ 30న  రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో  అత్వవసరంగా సమావేశమయ్యారు. చెన్నైలో జరిగిన ఈ భేటీకి తమిళనాడులోని అన్ని జిల్లాల నుంచి ఆర్ఎంఎం బాధ్యులు, అభిమానులు వచ్చారు. సమావేశం తర్వాత పార్టీపై రజనీకాంత్ ప్రకటన చేస్తారని భావించారు. కాని అప్పుడు కూడా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. రాజకీయ రంగ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు.  ఆర్ఎంఎం సభ్యులతో సమావేశం తర్వాత చెప్పినట్లే రాజకీయ పార్టీపై రజనీకాంత్ ప్రకటన చేసినా.. అది క్లారిటీగా లేకపోవడం  అభిమానులను నిరాశ పరిచింది.     2017 డిసెంబర్‌ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. రజనీ రాజకీయాలకు వస్తారన్న ప్రకటనతో ఆయన ఫ్యాన్స్  ఆనందంలో మునిగిపోయారు. అయితే పార్టీ పెడతానని ప్రకటించి మూడేళ్లు అయినా... పార్టీ ఏర్పాటుపై పురోగతి కన్పించలేదు.  రజనీ మక్కల్‌ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదుతో సరిపెట్టారు రజనీకాంత్. త్వరలోనే పార్టీ అనే ప్రకటనలతోనే మూడేళ్లు గడిచిపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల కోసం  రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూ హాలకు పదును పెడుతుండగా.. తమ హీరో  స్పష్టత ఇవ్వకపోవడంతో రజనీకాంత్ అభిమానులు అయోమయంలో పడిపోయారు.     రజనీకాంత్ మౌనంతో ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటుపై వెనక్కి తగ్గారనే ప్రచారం జరిగింది. ఇంతలోనే కొద్ది రోజుల క్రితం రజనీ కాంత్ పేరిట సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం మరింత గందరగోళానికి దారి తీసింది  అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం లేదన్నది ఆ ప్రచార సారాంశం. వైద్యుల సలహా మేరకు రాజకీయాల నుంచి రజనీకాంత్ తప్పుకుంటున్నారని అందులో ఉంది.  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన రజనీకాంత్..  అది తన ప్రకటన కాదంటూనే  అందులో పేర్కొన్న ఆరోగ్యపరమైన సమస్యలను  పరోక్షంగానే అంగీకరించారు. మండ్రం నిర్వాహకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. దీంతో తమిళనాట రజనీ పార్టీ ఉండకపోవచ్చనే అంతా భావించారు.    మరోవైపు రజనీకాంత్ రాజకీయ పార్టీపై పూర్తి స్పష్టత లేకపోయినా.. ఆయన అభిమానులు మాత్రం న్యూ ఇయర్ గిఫ్ట్ గా కొత్త పార్టీ వస్తుందని ధీమాగా చెబుతున్నారు. రజనీకాంత్ తాజా ప్రకటనతో తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. పలు జిల్లాల్లో మిఠాయిలు పంచుకుంటూ క్రాకర్స్ కాల్చుతున్నారు.  రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడితో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారతాయని పరిశీలకుల అంచనా.  రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడితే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్లస్ , డీఎంకే మైనస్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పెట్టిన కమల్‌ హాసన్ పెద్దగా ప్రభావం చూపలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రజనీకాంత్ రాజకీయ గమనం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.

ఏపీలో ఉన్నది ఫేక్ సర్కారే! దిశ చట్టంపై మోసం చేశారన్న వర్ల

దిశ చట్టాన్ని మరోసారి అసెంబ్లీ ప్రవేశపెట్టడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించారు. దిశ చట్టం రాకముందే తాము అమలు చేస్తున్నామని జగన్ సర్కార్ ప్రచారం చేసుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రపతి దిశ బిల్లును తిప్పి పంపిన నిజం దాచి రాష్ట్ర ప్రజలను మోసగించిందని ఆరోపించారు. చట్టం అమలులోకి రాకముందే దిశ పోలీస్ స్టేషన్లు నిర్మించి జగన్ సర్కార్ భంగపడిందన్నారు వర్ల రామయ్య.  చట్టం రాకముందే వచ్చినట్టుగా మోసగించిన ఈ ప్రభుత్వాన్ని ఫేక్ అనకూడదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. దిశ చట్టం విషయంలో  వైసీపీ  ప్రభుత్వం మొదటి నుంచి తప్పటడుగులు వేసిందని వర్ల రామయ్య విమర్శించారు.

గ్రేటర్ పోలింగ్ పై గందరగోళం! ఎస్ఈసీ తీరుపై విపక్షాల అనుమానం 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ పై విపక్షాల అనుమానాలు తీరడం లేదు. ఎస్ఈసీ ఇచ్చిన క్లారిటీ లేని లెక్కలు.. పొంతన లేని వివరాలతో పోలింగ్ ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ పై ఎన్నికల సంఘం నుంచే భిన్న లెక్కలు వచ్చాయి. ఫైనల్ ఓటింగ్ ఫిగర్ మూడు సార్లు మారింది.  పోలింగ్ శాతంపై నెలకొన్న గందరగోళంతో.. చివరి గంట పోలింగ్ లో ఏదో జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. పోలింగ్ సరళిని బట్టి ఓటమి భయంలో  అధికార పార్టీ  గ్రేటర్ ఎన్నికల్లో దొడ్డి దారిలో గెలిచేందుకు కుట్రలు చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నారు.   గ్రేటర్ ఎన్నికల్లో చివరి గంటలో 10 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం మిస్టరీగానే మిగిలింది.పాతబస్తిలో అయితే దాదాపు 15 శాతం పోలింగ్ చివరి గంటలోనే జరిగింది.చార్మినార్ , చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో తొలి 9 గంటల్లో 20 శాతం పోలింగ్ జరిగితే.. చివరి రెండు గంటల్లోనే మరో 25 శాతం పోలింగ్ జరగడం అనుమానాలకు తావిస్తోంది.  పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఏ పోలింగ్ కేంద్రంలోనూ   ఓటర్లు పెద్దగా కనిపించ లేదు.  పోలింగ్ కోసం అదనపు సమయం తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు ఎక్కడా ప్రకటించలేదు. అయినా చివరి గంటలో ఏకంగా 12శాతం పోలింగ్ పెరగడం అర్ధం కాకుండా పోయింది. ఓల్ట్ సిటీలో ఓ పార్టీ చివరి గంటల్లో రిగ్గింగ్ చేసిందనే అనుమానాలు వస్తున్నాయి. పోలింగ్ మొదలైన తర్వాత ప్రతి గంట గంటకు ఓట్ల శాతం వివరాలు ప్రకటించిన ఎన్నికల సంఘం.. సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని ప్రకటించడం నిలిపివేసింది. కారణాలను మాత్రం తెలుపలేదు. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.    హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 74లక్షల ఓట్లలో 35లక్షల ఓట్లకు గాను 46.68 శాతంగా పోలింగ్ నమోదైందని ఎస్ఈసీ అధికారికంగా ప్రకటించింది. నిజానికి గతంలో పోలింగ్ ముగిసిన నాలుగైదు గంటల్లోనూ ఓట్లశాతంపై పూర్తి క్లారిటీ వచ్చేది. కాని ఈసారి మాత్రం పోలింగ్ ముగిసిన దాదాపు 24 గంటల తర్వాత అధికారికంగా ఫైనల్ లెక్క వచ్చింది. అది కూడా గందరగోళంగానే ఉంది. ఓల్డ్ సిటీలో పోలింగ్ పై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంచన్ బాగ్ లో అత్యధికంగా 90 శాతం మంది మహిళలు ఓటేశారని ముందుగా ప్రకటించింది ఎన్నికల సంఘం. ఆ తర్వాత సవరించిన జాబితాలో అది  45% అని పేర్కొంది. మొత్తంగా ఈ డివిజన్ లో 47.98 % పోలింగ్ నమోదైతే, అంతకు ముందు వెల్లడించిన వివరాల ప్రకారం 70 % ఉండటం ఎన్నికల సంఘం పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.    గ్రేటర్ పోలింగ్ ఉదయం నుంచి మందకొడిగానే సాగింది. కొన్ని డివిజన్లలో మధ్యాహ్నం 1 గంట వరకు ఐదు శాతం కూడా పోలింగ్ జరగలేదు. సాయంత్రం 5గంటల వరకు 36.73శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వైపు చూడని ఓటర్లు ఒక్కసారిగా కేంద్రాల్లోకి ఎలా పోటెత్తారన్నది చర్చగా మారింది. 10 గంటల పాటు పోలింగ్ కేంద్రాలకు రాని ఓటర్లు చివరి గంటలో ఎలా వచ్చారు… ఎక్కడి నుంచి వచ్చారో తెలియడం లేదని విపక్షాల వాదన. ఎన్నికల సంఘం సహకారంతో అధికార టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు  రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని బీజేపీ ఆరోపిస్తోంది. విచ్చలవిడిగా రిగ్గింగ్, దొంగ ఓట్లు వేశారని ఆ పార్టీ నేతలు రామచంద్రరావు, ఆంటోనిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.  చివరి గంటలో అకస్మాత్తుగా పోలింగ్‌ ఎలా పెరిగిందో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పాతబస్తిలోని ఘాన్సీబజార్‌ డివిజన్ లో పోలింగ్‌ స్టేషన్‌ 1 నుంచి 19 వరకు, పురానాపూల్‌ డివిజన్ లో పోలింగ్‌ స్టేషన్‌ 3,4,5,38 నుంచి 45 వరకు ఉన్న బూత్‌లలో 94 శాతం పోలింగ్‌ జరిగిందని.. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పోలింగ్ బూత్ లలోకి వెళ్లి రిగ్గింగ్ చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు రాంచంద్రరావు. రిగ్గింగ్ చేసుకోవాలనే బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారని ఆయన ఆరోపించారు. ఆ రెండు డివిజన్లలో రీపోలింగ్‌ జరపాలని కోరారు. అయితే  బీజేపీ నేతల ఫిర్యాదుపై స్పందించ లేదు రాష్ట్ర ఎన్నికల సంఘం.    గ్రేటర్ ఎన్నికల పోలింగ్ పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎక్కడా మాట్లాడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు అప్పటి ఎస్ఈసీలు ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి పోలింగ్ వివరాలు చెప్పేవారంటున్నారు. పార్థసారథి మాత్రం ఓటేసిన తర్వాత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ఒక్క మాట చెప్పి మళ్లీ కనిపించకుండా పోయారు. పోలింగ్ ముగిసిన తర్వాత  కూడా ఆయన మీడియా ముందుకు రాలేదు. ఎన్నికల సంఘం వెబ్ సైట్ లోనూ గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ వివరాలు  అప్ డేట్ చేయలేదు. అంతేకాదు చివరి గంటలో 10 శాతానికి పైగా పోలింగ్ ఎలా జరిగిందన్న ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోతోంది ఎస్ఈసీ. అత్యంత కీలకమైన ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అనుమానాలపై పార్థసారథి స్పందించకపోవడం సరికాదంటున్నారు రాజకీయ అనలిస్టులు.  రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  పార్థసారధి తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆయన పూర్తిగా లొంగిపోయారని మండిపడుతున్నాయి.    గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణలో నోటిఫికేషన్ నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు అంతా వివాదంగానే మారింది. అధికార పార్టీకి కలిసొచ్చేలా హడావుడిగా షెడ్యూల్  ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చేలా పోలింగ్ డేట్ ఫిక్స్ చేయడం కూడా టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ లో భాగంగానే జరిగిందనే విమర్శలు వచ్చాయి. పోలింగ్ శాతం అనుకున్నతంగా జరగకపోవడానికి ఇది కూడా ఒక కారణమంటున్నారు. గ్రేటర్ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. ఉన్నవారికే రెండు,మూడు ఓట్లు ఉండగా... ఓటేసేందుకు ఆసక్తి ఉన్నవారి ఓట్లు మాత్రం గల్లంతయ్యాయి. పోల్ స్లిప్పులు పంచడంలో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని ఓటర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోల్ స్లిప్పులు రాకపోవడంతో కొందరు ఓటర్లు ఓటేసేందుకు రాలేదని చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర అరకొర వసతులు.. మైనర్లతో విధులు.. ట్రైనింగ్ లేని వారికి డ్యూటీలు... ఇలా అన్ని విషయాల్లోనూ రాష్ట్ర ఎన్నికల సంఘం అపవాదులను మూటగట్టుకుంది. టీచర్లు లేకుండా పోలింగ్ జరగడం కూడా ఇదే తొలి సారంటున్నారు. మొత్తంగా ఎస్ఈసీ పార్థసారథి వ్యవహారంతో గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదనే అభిప్రాయమే జనాల నుంచి వస్తోంది. అధికార పార్టీకి సహకరిస్తూ.. ఎన్నికల నిర్వహణ విషయంలో ఆయన రాజ్యాంగ స్పూర్తిని మంటకలిపారనే విమర్శలు వస్తున్నాయి.

అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు జగన్! జనసేన ఎమ్మెల్యే ప్రశంసలు 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన స్వర్ణయుగంలా ఉండేదని.. ఇప్పుడు వైఎస్ దారిలోనే జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలో మాట్లాడిన రాపాక.. వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పేదల అవసరాలకు అనుగుణంగా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. పేదల ఇంటి కల సాకారం చేసింది అప్పట్లో వైఎస్ఆర్.. ఇప్పుడు వైఎస్ జగనేనన్నారు. జగన్ లాంటి నాయకుడు ఉండటం మన అదృష్టమన్నారు వర ప్రసాద్. సీఎం లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారని కొనియాడారు జనసేన ఎమ్మెల్యే.

టీడీపీ ఫేక్ పార్టీ.. బాబు గాలి నాయకుడు! అసెంబ్లీలో కొడాలి మాటల రచ్చ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాలుగో రోజు రచ్చ జరిగింది. అధికార వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎవరో ఒకరి పొత్తు లేకుండా పోటీచేయలేని వ్యక్తి చంద్రబాబని విమర్శించారు. పారిపోయే వారు ఎవరో ప్రజలకు తెలుసన్నారు నాని. 1983లో ఓడిపోయినప్పుడు కాంగ్రెస్‌ను వదిలి చంద్రబాబు పారిపోయారని, అప్పుడు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ వదిలి పారిపోయారు.. కరోనా రాగానే కాల్వ గట్టు వదిలి పారిపోయారన్నారు. చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రతిపక్ష నాయకుడు. టీడీపీ ఫేక్ పార్టీ. చంద్రబాబు నాయుడే గాలి ముఖ్యమంత్రి. బాబే గాలి నాయకుడు. పారిపోయేవాళ్లెవరో ప్రజలందరికీ తెలుసు’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.    జగన్ ప్రభుత్వం ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తోందని చెప్పారు కొడాలి నాని. వైఎస్ఆర్ భరోసా పథకం ద్వారా అర్హులందరికీ పింఛన్లు అందిస్తున్నాం.. ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు పింఛన్లు ఇవ్వనున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.3000 పెన్షన్ ఇస్తామన్నారు..? .. అది ఏమైందని   ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు నిమ్మలకు కౌంటరిచ్చి న కొడాలి ..  టీడీపీ, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. టీడీపీ హయాంలో మీరు ఎంతిచ్చారో మాకు తెలుసు. మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి. చంద్రబాబు 9ఏళ్ల పాలనలో పెన్షన్‌లో రూపాయి పెంచలేదు. బాబు హయాంలో ఉన్న వాళ్లు ఎవరైనా చనిపోతేనే కొత్త పింఛన్ ఇచ్చేవాళ్లు. వైఎస్సార్ భరోసా పథకం కింద అర్హులకు పెన్షన్లు అందిస్తున్నాం. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి అన్నారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై సభలో టీడీపీ నిరసన వ్యక్తం చేశారు.

జగన్ సర్కార్ ప్రయత్నాలకు హైకోర్టులో ఎదురు దెబ్బ..  

ఏపీలో వాయిదా పడ్డ స్థానిక ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ ఆలోచనకు వ్యతిరేకంగా స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా తగ్గనందున.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. అంతేకాకుండా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమైందని దాఖలైన ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. కరోనాతో ఇప్పటికే అనేక మంది మరణించారని ఈ పిటిషన్ లో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. వైద్య ఆరోగ్య శాఖతో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలను తమ ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది.

క్లాస్ రూమ్ లో టీనేజ్ ప్రేమికుల పెళ్లి కలకలం.. టీసీ ఇచ్చి పంపిన ప్రిన్సిపాల్

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చోటు చేసుకున్న పెళ్లి ఘటన కలకలం సృష్టించింది. ఒక పక్క కాలేజీ నడుస్తున్న సమయంలో ఏకంగా క్లాస్ రూమ్‎లోనే ఇద్దరు మైనర్లు పెళ్లి చేసుకున్నారు. క్లాస్ రూమ్ లోనే అమ్మాయికి పసుపుతాడు కట్టి, నుదిటిపై బొట్టు పెట్టాడు ఆ యువకుడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మైనర్ల వివాహం పోయిన నెల నవంబర్ 17న జరిగినట్లుగా వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో జూనియర్ కాలేజీలో జరిగిన ఈ పెళ్లి వీడియోలు తాజాగా వైరల్ ‎గా మారాయి. ఈ వైరల్ వీడియో, ఫోటోలు కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి వెళ్లడంతో.. విషయం తెలుసుకున్న అయన ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇచ్చాడు. అంతేకాక వీరితోపాటు వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపించివేశారు.   అయితే, తామేమీ నిజమైన పెళ్లి చేసుకోలేదని, కేవలం వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వచ్చే లైక్స్ కోసమే తాము ఈ పని చేశామని వారిద్దరూ చెప్పడం గమనార్హం. ఈ విషయంలో వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చామని కాలేజీ యాజమాన్యం చెపుతుండగా,మరోపక్క తమ పిల్లలు చేసిన పనికి పరువు పోయిందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ వీడియోను తీసింది మరో ఇంటర్ చదివే మరో బాలిక అని తెలుస్తోంది. మధ్యమధ్యలో వాళ్ళిద్దరికీ ఆమె సలహాలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జగన్, దిగ్విజయ్, కేసీఆర్ నా నాయకులు! పువ్వాడపై నారాయణ విసుర్లు 

తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీపీఐ జాతీయ నేత నారాయణ మధ్య వివాదం మరింత ముదురుతోంది. తనపై మంత్రి అజయ్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటరిచ్చారు నారాయణ. దయచేసి పువ్వాడ నాగ్వేశ్వర్‌రావు, సీపీఐ పేరును ప్రస్తావించవద్దని కోరుతూ ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఒకప్పుడు తమకు జగన్‌మోహన్‌రెడ్డి, తర్వాత దిగ్విజయ్‌సింగ్, తాజాగా కేసీఆర్ నాయకులంటూ అజయ్ ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు నారాయణ. ఇంత పరకాయ ప్రవేశం చేసిన వారు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్మేపని చేయవద్దని హితవు పలికారు. తనపై మంత్రి చేసిన విమర్శలపై సమాధానం చెప్పాల్సి అవసరం లేదన్నారు నారాయణ.    "కేసీఆర్ వదిలిపెట్టిన చెవితెగుద్ది" అనడం ద్వారా కేసీఆర్ కన్నా తానే గొప్పవాడని అని బరితెగించి చెప్పుకున్నారని... దానిని కేసీఆర్ పరిశీలించుకోవాల్సిందే అని అజయ్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు కామ్రెడ్ నారాయణ. తనపై బీజేపీ హత్యాప్రయత్నం చేసిందని స్వయంగా మంత్రే చెప్పారని...ఇది రాజకీయాలకు అతీతంగా తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని చెప్పారు నారాయణ.  ‘‘యువకుడుగా ఆర్టీసకీ మంత్రివయ్యావు , హిట్ అండ్ రన్ యాక్ట్ తీవ్రతను గురించి తెలిసుకోవాలసిన కనీస బాద్యత నీకుంది. నేను విద్యార్థి దశ నుండి సీపీఐలోనే ఉన్నాను. మీరెక్కడ నుండి బయలుదేరారో, ఇప్పుడెక్కడ ఉన్నారో,  రేపెక్కడికిపోతారో చెప్పగలరా? సూర్యుడిపై ఎంగి ఊస్తే ఏమవుతుందో నన్నంటే అదే అవుతుందని అజయ్ బాబు గుర్తుంచుకోవడం మంచిది’అంటూ సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు.    తాను ఉమ్మడి ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శిగా ఉన్నా ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు నారాయణ. పువ్వాడ నాగేశ్వర్‌రావు ఆనాడు తమ పార్టినాయకులని... ఈనాడు కూడా పార్టి వెంటనే ఉంటారని స్పష్టం చేశారు. ఖమ్మం పార్లమెంటుకు అభ్యర్థిగా పువ్వాడనే పోటీచేయమని అభ్యర్థించామని చెప్పారు. ఖమ్మం జిల్లా పార్టీ అనుమతిలేకుండా , రాష్ట్ర కార్యదర్శివర్గం తీర్మానం లేకుండా , కేంద్రపార్టీ అనుమతిలేకుండా తాను పొటీ చేయగలనా అని నారాయణ  నిలదీశారు. విజ్ఞతతో ఆలోచించమని ప్రజలను ముఖ్యంగా ఖమ్మం ప్రజలను కోరుతున్నానని చెప్పారు. తనకు అవినీతిని అంటగట్టాలనే ప్రయత్నం ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు నారాయణ. అవినీతికి పాల్పడి ఉంటే కేంద్ర కార్యదర్శి వర్గ స్థాయికి ఎదగగలనా అని ప్రశ్నించారు.

సాగర్ కమలానికి సవాలే! అక్కడ గెలిస్తే తిరుగులేనట్టే? 

తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరగబోనుంది. ఎమ్మెల్యే సీటు ఖాళీ అయిన ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుంది. ఈ లెక్కన మార్చి తర్వాత ఎప్పుడైన నాగార్జున సాగర్ ఎన్నిక రావొచ్చు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికపైనా అప్పుడే చర్చ మొదలైంది. అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు కూడా  కొన్ని పార్టీలు ప్రారంభించాయని ప్రచారం జరుగుతోంది. దుబ్బాక విజయం, గ్రేటర్ ఎన్నికల్లో దూకుడుతో ఊపు మీదున్న బీజేపీ.. నాగార్జున సాగర్ పైనా  ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు.   దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీకి షాకిచ్చి... అదే జోష్ తో జీహెచ్ఎంసీ పోరులో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించిన బీజేపీకి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మాత్రం సవాల్ గా మారనుందనే చర్చ జరుగుతోంది. దుబ్బాకతో పోలిస్తే నాగార్జున సాగర్ పూర్తిగా భిన్నం. ఇక్కడ బీజేపీ బలం అంతంతమాత్రమే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బీజేపీ ఇంత వరకు అసెంబ్లీ సీటు గెలవలేదు. లోక్ సభ ఎన్నికల్లోనూ అంతే. నల్గొండ జిల్లాలోని మిగితా ప్రాంతాల కంటే నాగార్జున సాగర్ సెగ్మెంట్ లోనే  బీజేపీ పూర్ గా ఉందని చెబుతున్నారు. హాలియా పట్టణంతో పాటు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లోనే కొంత బీజేపీ బలంగా ఉంది. దుబ్బాకలో అయితే బీజేపీకి కేడర్ ఉంది. గతంలో మెదక్ నుంచి బీజేపీ ఎంపీ సీటు కూడా గెలిచింది. ఈ లెక్కన దుబ్బాకతో పోలిస్తే నాగార్జున సాగర్ లో బీజేపీ చాలా వీక్ అని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ లో బీజేపీ ఎలాంటి పోటీ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.    2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కంకణాల నివేదితా రెడ్డి పోటీ చేశారు. ఆమెకు కేవలం ఒక్క శాతం ఓట్లే పోలయ్యాయి. 2018  అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ లో బీజేపీ కంటే సమాజ్ వాదీ బ్యాక్ వర్డ్ పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎస్పీ అభ్యర్థికి 9 వేల 819 ఓట్లు రాగా నివేదిత కేవలం 2 వేల 675 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. బీజేపీ నుంచి పోటీ చేసిన నివేదిత రెడ్డి భర్త శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం బీజేపీ బలపడిందని చెబుతున్నారు. అయితే గెలిచేంత స్థాయికి మాత్రం రాలేదంటున్నారు.     నాగార్జున సాగర్  గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. తొమ్మిది సార్లు ఈ నియోజకవర్గం నుంచి జానారెడ్డి పోటీ చేయగా ఏడు సార్లు గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నాగార్జునసాగర్‌ స్థానానికి తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో జానారెడ్డి గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీపీఎం నుంచి టీఆర్‌ఎస్ లో చేరిన నోముల నర్సింహయ్య 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసినా జానారెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నోముల నర్సింహయ్య 7,771 ఓట్ల మెజారిటీతో జానారెడ్డిపై సంచలన విజయం సాధించారు.     నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రెడ్డి, యాదవుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు వర్గాల వారే ఎన్నికల్లో ఎక్కువగా పోటీ చేస్తుంటారు. బీజేపీ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులను బట్టి నిర్ణయం తీసుకునే ఉంది.  నాగార్జున సాగర్ కు ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా జానారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలో నిలవడం ఖాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో దిగితే మాత్రం టీఆర్ఎస్, బీజేపీలకు గట్టి పోటీనే ఉంటుంది. జానారెడ్డి తప్పుకుని ఆయన కొడుకుతో పోటీ చేయిస్తారనే చర్చ కూడా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. చివరికి జానారెడ్డే పోటీ చేశారు. మరోవైపు జానారెడ్డి కొడుకుతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా దుబ్బాకలో అద్భుత విజయం సాధించిన బీజేపీ.. తమకు ఇప్పటివరకు ఏ మాత్రం పట్టులేని నాగార్జున సాగర్ లోనూ గెలిస్తే.. తెలంగాణలో ఆ పార్టీకి ఇక తిరుగు ఉండదని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు.

అవును... ఆడు మగాడ్రా బుజ్జీ!

జర్నలిస్టు సంఘాలు లేకుండా కొత్త అక్రెడిటేషన్లు   తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త అధ్యాయం   ఇక మిగిలింది ఎల్‌ఏ యాడ్స్ ప్రక్షాళనే   భూసేకరణ యాడ్స్‌నూ సమాచార శాఖ పరిథిలోకి తీసుకోవాలి   చేయాలన్న సంకల్పం... చేసే దమ్ము.. చేయగల ధైర్యం  ఉండాలే గానీ,  అనుకున్నది పూర్తి చేయడానికి ఏదీ అడ్డుకాదు. రాదు!  ఏపీలో జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ల మంజూరుపై సమాచార శాఖ కమిషనర్ తమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయయం చూస్తే అది అవుననిపించకమానదు. ఇంతకాలం అక్రెడిటేషన్ల సంఘాల  చూరుపట్టుకుని వేళ్లాడుతున్న,  జర్నలిస్టు సంఘ గబ్బిలాల కస్తూరి వాసనలు లేకుండానే.. ఈసారి జర్నలిస్టులకు కొత్త కార్డులివ్వాలన్న నిర్ణయం సాహోపేతమే కాదు. విప్లవాత్మకం కూడా! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క సమాచార శాఖ కమిషనర్ తీసుకోలేని, దమ్మున్న నిర్ణయం తీసుకున్న విజయ్‌కుమార్ మొనగాడి కిందే లెక్క.   కొత్త ఏడాదికి కొత్త  కార్డులపై ఇప్పటివరకూ జరుగుతున్న తర్జనభర్జన-మీనమేషాలకు ఏపీ సమాచార శాఖ కమిషర్ విజయకుమార్‌రెడ్డి తన సంచలన నిర్ణయంతో తెరదింపి, జర్నలిస్టులకు కొత్త కార్డుల పంపిణీకి లైన్‌క్లియర్ చేయడం స్వాగతించదగ్గదే. ఇప్పటివరకూ ఈ విషయంలో అడ్డగోడగా నిలిచిన జర్నలిస్టు సంఘాల పంచాయితీని పక్కకు పెట్టి... సారీ... పక్కన పారేసి,  కొత్త కార్డుల ప్రక్రియకు పచ్చజెండా ఊపిన కమిషనర్‌ను,  అభినందించడం  ప్రతి జర్నలిసు నైతిక బాధ్యత.   అసలు అక్రెడిటేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలు ఎందుకు? అందులో ఆ నాయకమ్మన్యులు ఉండి ఉద్ధరించేది, ఊడబొడిచేదీ ఏమిటి? జర్నలిస్టులకు యాజమాన్యాల నుంచి జీతాలిప్పించే దమ్ము లేని సంఘాలు, ప్రభుత్వ శాఖలపై స్వారీ చేయడం ఏమిటి? కమిషనర్లను మొహమాటపెట్టి, తమ యూనియన్ల సభ్యులకు అదనంగా కార్డులు ఇప్పించుకోవడమే కదా ఈ నేతల మెహర్బానీ? చిన్నా చితకా సంఘాలు కూడా,  అక్రెడిటేషన్ కమిటీ సభ్యులమని ఫోజులు కొట్టడానికే తప్ప, ఈ కమిటీలో జర్నలిస్టులు ఎందుకు పనికివస్తారు? పోనీ ఈ కమిటీ ఏమైనా ఏడాది పొడవునా పనిచేస్తుందా? లేదు. ఒక్కటంటే ఒకేసారి!  మరి దేనికీ బిల్డప్పులు? కొత్త కార్డుల మంజూరుకు ఈ సంఘాల మోకాలడ్డు, ప్రతిబంధకాలూ ఎందుకు?  ఇవీ... కొన్ని దశాబ్దాల నుంచీ జర్నలిస్టుల మస్తిష్కాలలో నాటుకుపోయిన ప్రశ్నలు. ఉమ్మడి రాష్ట్రం నుంచీ ఇప్పటివరకూ ఇవే ప్రశ్నలు, జర్నలిస్టు  మెదళ్లను తొలిచేస్తున్నాయి. కానీ, అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే... ఈ కమిటీలో జర్నలిస్టులను సిఫార్సు చేసేది,  ఇంకా పెద్ద జర్నలిస్టు ‘మహానేతలు’ కాబట్టి.   ఇప్పుడిక ఆ పితలాటకం లేదు. మా సంఘాలే ఉండాలి. అప్పటివరకూ ఎవరికీ కార్డులివ్వకూడదు. పాతవే కొనసాగించాలన్న పంచాయితీ అసలే లేదు. ఎందుకంటే.. అసలు జర్నలిస్టు సంఘాల లొల్లి లేకుండానే, జర్నలిస్టులకు కొత్త కార్డులివ్వాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి! అంత సాహసం చేసిన కమిషనర్ నిజంగా చరిత్ర సృష్టించారనే చెప్పాలి. ఎందుకంటే... సమైక్య రాష్ట్రం నుంచి ఇప్పటివరకూ, జర్నలిస్టు సంఘాలను పక్కనపెట్టిన కమిషనర్లు ఎవరూ లేరు కాబట్టి. ఏ కమిషనరయినా జర్నలిస్టు సంఘాలకు భయపడాల్సిందే. లేకపోతే సీఎంల దాకా పంచాయతీ వెళ్లేది. అలాంటిది..  ఒక కమిషనర్ జర్నలిస్టు సంఘాలతో సంబంధం లేకుండానే.. అక్రెడిటేషన్ కమిటీని అధికారులతోనే వేసి, కొత్త కార్డులివ్వాలని నిర్ణయించడం మామూలు విషయం కాదు కదా? దానికి బోలెడంత దమ్మ కావద్దూ..? భవిష్యత్తులో కూడా ఇదే విధానం అనుసరించడం మంచిది.  అందుకే... ఆడు మగాడ్రా బుజ్జీ!   నిజానికి కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న అనేక దమ్మున్న నిర్ణయాల్లో ఇది ఒకటి మాత్రమే. సమాచార శాఖలో ప్రకటనలన్నీ యాడ్ ఏజెన్సీల నుంచే ఇచ్చే  విధానం  ఉమ్మడి రాష్ట్రంలో  మొదలయి, గత ఏడాదిన్నర వరకూ కొనసాగింది. అంటే ఏదైనా పత్రిక లేదా చానెల్‌కు యాడ్స్ ఇవ్వాలంటే, మధ్యలో ఏజెన్సీ పాత్ర ఉండాల్సిందే. ప్రభుత్వంలో ఎవరుంటే, వారిని పట్టేసి.. ఎవరికి కావలసినవి వారికి సమర్పించుకుని ఏజెన్సీలు హవా సాగించేవి. పత్రికా ప్రకటనల నుంచి హోర్డింగ్సు వరకూ ఇదే వరస.  అందుకు సమాచార శాఖ సదరు ఏజెన్సీలకు 15 శాతం కమిషన్లు ఇచ్చేది. పోనీ, ఆ అంత కమిషన్లు తీసుకునే సదరు ఏజెన్సీలు,  పత్రికలకు సకాలంలో డబ్బులిస్తాయా అంటే అదీ లేదు. గత సర్కారు ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి, ఏజెన్సీలు ఇప్పటిదాకా పత్రికలకు బకాయిలు చెల్లించిన దాఖలాలు లేవు. కొత్త కమిషనర్ విజయకుమార్  ఈ సంప్రదాయానికి తెరదించారు.అంటే..అసలు సమాచార శాఖలో యాడ్ ఏజెన్సీల వ్యవస్థకే మంగళం పాడారు.  ఎలాగంటే.. ఏజెన్సీలకు పత్రికలు ఇచ్చే ఆ 15 శాతం కమిషను, ఇప్పుడు ప్రభుత్వమే తీసుకుని, వాటిని ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తోంది. మంచిదే కదా!   అదొక్క నిర్ణయమే కాదు. కొత్త కమిషనర్ తీసుకున్న మరొక సాహసోపేత నిర్ణయం.... పత్రికల  యాడ్స్ టారిఫ్‌ను గణనీయంగా తగ్గించడం. ఇప్పటివరకూ ఈనాడు, సాక్షి, డెక్కన్‌క్రానికల్ వంటి పత్రికలే ఎక్కువ ప్రకటనల రేటు ఉండేవి. వాటి మొదటి పేజీ ప్రకటన ఖరీదు లక్షల నుంచి కోటికి పైమాటే. ప్రభుత్వం ఇచ్చే ఒక ప్రకటన  బడ్జెట్‌లో,  సింహభాగం ఈ పత్రికలకే సరిపోయేవి. టీడీపీ హయాంలో అయితే.. సింహభాగం బడ్జెట్ అంతా ఈనాడు-ఆంధ్రజ్యోతి ఖాతాకే వెళ్లేవి. ఇక టెండరు లేకుండానే అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్- గవర్నమెంట్ అఫిషియల్ మీడియా హక్కుల  తాలూకు నిధులన్నీ,  ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌కే వెళ్లేవి. ఇక వాటికి పోగా మిగిలిన బడ్జెట్‌ను, మిగిలిన పత్రికలకు సర్దుబాటు చేసేవారు.   అయితే సర్క్యులేషన్ పరంగా కూడా అవి పెద్దవే. కానీ.. సమాచార శాఖ బడ్జెట్ తగ్గిపోయింది.  ఆ భారం తగ్గించుకునే వ్యూహంలో భాగంగా.. కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, సమాచారశాఖ నిర్దేశించిన రేట్లను అంగీకరిస్తేనే, ప్రకటనలిస్తామని షర తు విధించారు. దానితో గత్యంతరం లేని పెద్ద పత్రికలు,  కొన్ని వేల మెట్లు దిగివచ్చి, కమిషనర్ ప్రతిపాదనను అంగీకరించడం అనివార్యమయింది. ఫలితంగా గత సర్కారు హయాంలో కోటిరూపాయల ఫుల్‌పేజీ ఉన్న ఒక యాడ్.. ఇప్పుడు 30 వేలకు ముద్రించాల్సి వస్తోంది. మరి ఇది శుభపరిణామమే కదా?   ఇంకొన్ని తెలుగు పత్రికల ప్రాణం చాలా బలహీనమయినా... వాటి ప్రకటనల రేట్లు మాత్రం ఈనాడు, క్రానికల్‌కు మించే ఉండేవి. అంటే దశాబ్దాలపాటు ఆ తరహా పత్రికలు యాడ్స్ రూపంలో ఎంత సంపాదించాయో,  ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కమిషనర్ తీసుకున్న కొత్త తరహా విధానం వారికి వాతపెట్టినట్టే. అది వేరే విషయం. అలా... ప్రభుత్వాలను కొన్ని దశాబ్దాల పాటు శాసించి, శ్వాసించిన పెద్ద పత్రికలను సైతం నేలమీదకు తీసుకురావడానికి, నిజంగా దమ్ము-ధైర్యమే కాదు. సంకల్పం కావాలి. అది తనకు ఉందని నిరూపించిన కమిషనర్ విజయకుమార్‌రెడ్డిని అభినందించాల్సిందే. ఆయన తీసుకున్న ఈ సాహోసోపేత నిర్ణయం వల్ల, ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదా అయినట్లే కదా?   ఇన్ని విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్న కమిషనర్... భూసేకరణ ప్రకటనల్లో జరుగుతున్న కోట్లాదిరూపాయల కుంభకోణంపైనా దృష్టి పెడితే మంచిది. జిల్లాల్లో పత్రికలకు ఇస్తున్న భూసేకరణ ప్రకటనలు,  స్పెషల్ కలెక్టరు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల  దయాధర్మంపై వస్తున్నాయి. అతె్తసరు కాపీలు ముద్రించే చాలా పత్రికలు.. ఫిఫ్టీ-ఫిఫ్టీ నిష్పత్తిలో కోట్లాదిరూపాయల యాడ్సు సంపాదిస్తున్నాయి. దీనివల్ల ఖజానాకు వందల కోట్లు నష్టం వస్తోంది. చంద్రబాబు సర్కారులో ఇదొక మాఫియాగా మారిందన్న ఆరోపణలుండేవి. ప్రకాశం, విజయనగరం, నెల్లూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో అయితే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, భూసేకరణ యాడ్స్ పుణ్యాన కోట్లకు పడగలెత్తారన్న ఆరోపణలుండేవి. ఇప్పుడు క్యాబినెట్‌లో ఓ పెద్ద స్థాయిలో ఉన్న.. ఓ ‘మంత్రిగారి వియ్యంకుడి’కి చెందిన పత్రిక, గత మూడేళ్లలో  కేవలం భూసేకరణ యాడ్సులోనే కోట్లాది రూపాయలు  సంపాదించింది. అయినా అడిగే దిక్కులేదు.   అయితే.. భూసేకరణ యాడ్స్ అంశం సమాచారశాఖ పరిథిలో లేకపోవడం, రెవిన్యూ శాఖ పరిథిలో ఉండటంతో సమాచార శాఖ అధికారులు ప్రేక్షకపాత్ర పోషించాల్సి వస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు,  తమ ప్రకటనలన్నీ సమాచార శాఖ ద్వారానే ఇవ్వాలన్న ఆదేశాలు ఉన్నాయి. కానీ భూసేకరణ ప్రకటనలు మాత్రం మినహాయించడమే, కొన్ని పత్రికలకు కల్పతరువులా మారింది. ఆ అంశాన్ని కూడా సమాచారశాఖ పరిథిలో తీసుకువస్తే ప్రభుత్వం కొన్నివందల కోట్లు ఆదా చేసినట్టవుతుంది. పెద్ద పత్రికలను దారికి తెచ్చి, కోట్లాదిరూపాయలు ఆదా చేసిన కమిషనర్... నిజాయితీగా నడుపుతున్న చిన్న పత్రికలను కూడా ప్రోత్సహిస్తే మంచిది.  -మార్తి సుబ్రహ్మణ్యం  

చెప్పిచ్చుక్కొడతా అంటూ టీడీపీ ఎమ్మెల్సీల పైకి దూసుకెళ్లిన సీనియర్ మంత్రి 

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. నిన్న శాసనమండలిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. "చెప్పిచ్చుక్కొడతా.." అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, బుద్దా నాగజగదీశ్వరరావు గురించి చేసిన వ్యాఖ్యలు శాననమండలిలో పెను దుమారం రేపాయి. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదమే జరిగింది. ఒకదశలో ఇరుపక్షాల సభ్యులు ఒకరిపై మరొకరు చేయి చేసుకుంటారేమోనన్న పరిస్థితి నెలకొంది. బుధవారం శాసనమండలి ప్రారంభ సమయంలో వాయిదా తీర్మానాలు తిరస్కరించిన తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ దేవదాయ శాఖ మంత్రి తనను ఉద్దేశించి సభలో మంగళవారం చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఎవరు, ఏం మాట్లాడారో రికార్డులు పరిశీలించాలన్నారు. అంగవైకల్యాన్ని ఎత్తిచూపడం చట్టవ్యతిరేకమని, మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మరోపక్క యనమల రామకృష్ణుడు అన్నారు. మండలి చైర్మన్‌ షరీఫ్‌ దీనిపై స్పందిస్తూ.. రికార్డులు పరిశీలించి తన నిర్ణయం చెపుతానన్నారు.   అయితే ఆయన రికార్డులు పరిశీలించడానికి వెళ్తుండగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి లేచి.. కొందరు మంత్రులు సభలో వీధి రౌడీలకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారన్నారు. దీంతో మంత్రి బొత్స లేచి.. మంత్రులను వీధి రౌడీలు అంటావా? చెప్పిచ్చుక్కొడతా... అంటూ దీపక్‌రెడ్డి వైపు వేలు చూపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు కలుగజేసుకోవడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.   అయితే కొద్దిసేపు వాగ్వాదం తరువాత మంత్రి బొత్స, దీపక్‌రెడ్డి, నాగజగదీశ్వరరావు వైపు దూసుకొచ్చారు. దీంతో నాగజగదీశ్వరరావు జోక్యం చేసుకుంటూ.. ‘‘నోర్ముయ్‌.. చెప్పుచ్చుకుని కొడితే కొట్టించుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరిక్కడ’’ అని మంత్రికి కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా "రా చూసుకుందాం.. " అంటూ దీపక్‌రెడ్డి, నాగజగదీశ్వరరావు కూడా బొత్స వైపు దూసుకెళ్లారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే బొత్సను మరో మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఆపే ప్రయత్నం చేశారు. మరోపక్క నాగజగదీశ్వరరావును టీడీపీ ఎమ్మెల్సీలు జనార్దన్‌ తదితరులు అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

జగన్ సర్కార్ కు బీజేపీ ఎంపీ షాక్.. ఆ విషయంపై కేంద్రానికి లేఖ 

ఏపీలోని జగన్ ప్రభుత్వం పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు ఒక లేఖ రాసారు. రాష్ట్ర ప్రభుత్వం FRBM పరిధిని దాటి అప్పులు చేస్తోందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో అయన పేర్కోన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. నిబంధనలకు విరుద్ధంగా లోన్లు తీసుకుని.. వచ్చిన నిధులను ఉచిత పథకాల కోసం విచ్చల విడిగా ఖర్చు పెడుతున్నారని.. ఇది చాలా ఆందోళనకరమని సురేష్ ప్రభు తన లేఖలో పేర్కొన్నారు. అందుకే కార్పొరేషన్లకు ఇచ్చే రుణాలకు రెండు వందల శాతం ల్యాండ్ గ్యారంటీ తీసుకునేలా.. మార్టిగేజ్ చేసుకునేలా చూడాలని.. అలాగే రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి చాల ఆందోళనకరంగా మారిందని అయన వ్యాఖ్యానించారు.   ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేయిదాటక ముందే సరైన చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ ‌ను సురేష్ ప్రభు కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు కూడా ఎంపీ సురేష్ ప్రభు లేఖలు రాశారు. అయితే గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన సురేష్ ప్రభు.. ఈ విధంగా లేఖ రాయడంతో దీనిపై కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందో అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన సురేష్ ప్రభు ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

కేంద్రం నిధులిస్తే వైఎస్ విగ్రహం పెడతారా?- చంద్రబాబు ఫైర్

జగన్ అవినీతిపరుడు కాబట్టి అందరిపై అవినీతి ముద్ర వేసేందుకు యత్నిస్తున్నారని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పోలవరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నవారు... దాన్ని ఎందుకు నిరూపించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రానికి నష్టం చేశారని విమర్శించారు. గతంలో తాము వేసిన అంచనాలను తప్పుపట్టారని... ఇప్పుడు అవే అంచనాలను కరెక్ట్ అంచనాలని చెప్పుకుంటున్నారని టీడీపీ చీఫ్ మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని వైసీపీ సర్కార్ ను  ప్రశ్నించారు చంద్రబాబు.   పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటూ జగన్ పై  చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం ప్రాజెక్టును కడుతూ, అక్కడ వైయస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా? అని ధ్వజమెత్తారు. వైయస్ విగ్రహం పెడితే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. వైయస్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనతో పోలవరంకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని చెప్పారు.గోదావరి నీళ్లను తెలంగాణ మీదుగా శ్రీశైలానికి తెస్తామని జగన్ చెప్పినప్పుడు అది కుదిరే పని కాదని తాను చెప్పానని... తాను చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ ప్రశ్నలు అడిగితే తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.