ఏపీ అసెంబ్లీలో రచ్చ.. చంద్రబాబుపై స్పీకర్ ఫైర్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈరోజు సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై రగడ చోటుచేసుకుంది. టిడ్కో ఇళ్లకు సంబంధించిన అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో తాము మాట్లాడేందుకు స్పీకర్ సమయం ఇవ్వకపోవడంపై మండిపడుతూ.. స్పీకర్ వైపు వేలెత్తి చూపుతూ చంద్రబాబు మాట్లాడారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. మాట్లాడే విధానం ఇది కాదని, సభాధ్యక్షుడినే బెదిరిస్తారా? అని ఫైర్ అయ్యారు. మీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని, పదేపదే సభా కార్యక్రమాలకు అడ్డు పడొద్దని చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు.

వాస్తవాలు ఆధారాలతో బయట పెడుతున్నందునే సస్పెండ్

ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలనందరిని సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారం.. ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని సస్పెండ్ చేశారు.    ఈ నేపథ్యంలో రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఆ విషయాన్ని డాక్యుమెంట్ తో సహా వెల్లడించామని, వాస్తవాలు ఆధారాలతో బయట పెడుతున్నందునే తనను సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు.   ఇన్సూరెన్స్ పై టీడీపీ నిలదీసిన తర్వాత నిన్న రాత్రి హడావిడిగా ఇన్స్యూరెన్స్ ప్రీమియం జీఓ ఇచ్చారన్నారు. రైతులు నష్టపోయాక ఇప్పుడు ప్రీమియం కడితే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తికి, చనిపోయాక రూ.100 కోట్లు ప్రీమియం చేయిస్తే ఉపయోగం ఉంటుందా అని నిలదీశారు. ఇది అసెంబ్లీని, రైతులను తప్పు దోవ పట్టించడమే అని మండిపడ్డారు. దీనిపై సభా హక్కుల నోటీస్ ఇస్తామని రామానాయుడు తెలిపారు.   అరకొరగా ప్రీమియంలు కట్టడం వల్ల 2019లో ఒక్క  క్లైమ్ కూడా రాలేదని చెప్పారు. టీడీపీ హయాంలో ప్రతి రైతుకు బీమా అందిందని తెలిపారు. తమపై ఎన్ని సస్పెన్షన్లను విధించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రామానాయుడు స్పష్టం చేశారు.

భారత్‌ లో రైతుల నిరసనలపై కెనడా ప్రధాని కామెంట్

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీలు రైతులకు తమ మద్దతును ప్రకటించాయి. అయితే, ఈ నిరసనల హోరు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు చేరడంతో ఆయన కూడా రైతులకు అనుకూలంగా మాట్లాడారు. శాంతియుతంగా నిరసనలు తెలిపేవారికి కెనడా ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపారు.    భారత్‌ లో రైతుల నిరసనలకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి చింతిస్తున్నాము. నిరసన కార్యక్రమాలను చేపడుతున్న వారి కుటుంబాలు, స్నేహితుల గురించి ఆందోళనగా ఉందని అన్నారు. శాంతియుతంగా హక్కుల కోసం పోరాడే వారి పక్షాన కెనడా ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నానని చెప్పారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. ఇదే విషయాన్ని భారత అధికారుల దృష్టికి తాము తీసుకెళ్లామని తెలిపారు. మనందరం ఒక్కతాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించేందుకు అనువైన సమయం ఇదే అని వ్యాఖ్యానించారు.   గురునానక్ 551 జయంతి సందర్భంగా ఒక ఆన్ లైన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వీడియోను కెనడాలోని సిక్కు సంఘాలు విడుదల చేశాయి. కాగా, భారత రైతులు చేపడుతున్న నిరసనలపై స్పందించిన తొలి విదేశీ నేత ట్రూడోనే కావడం గమనార్హం.

ఆలయ అర్చకులపై చెర్నాకోలతో వైసీపీ నేతల దాడి 

ఆలయ నిబంధనలను గుర్తు చేసిన పాపానికి ఆలయంలో పూజలు చేసుకునే అర్చకులను వైసీపీ నాయకులు చావబాదారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు అర్చకులు గాయపడ్డారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి ఒక వైపు భక్తుల దర్శనం కొనసాగుతోంది. అయితే రాత్రి 7.30 గంటల సమయంలో భక్తులకు టికెట్లు ఇవ్వొద్దని అటెండర్‌ ఈశ్వరయ్యకు అర్చకులు తెలిపారు. ఈ విషయం పై వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఈశ్వరయ్యను అర్చకుడు చక్రపాణి పక్కకు తోశారు. దీంతో తనపై అర్చకులు దాడి చేశారంటూ ఈశ్వరయ్య చైర్మన్‌ ప్రతాపరెడ్డి, ఈవో మోహన్‌లకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ప్రతాపరెడ్డి, అతని సోదరుడు రామకృష్ణారెడ్డి, అటెండర్‌ ఈశ్వరయ్య, నాగరాజు, రామకృష్ణ అక్కడికి చేరుకుని అర్చకులు సుధాకర శర్మ, మృగఫణిపై దాడి చేశారు.   అర్చకులను చెర్నాకోల, కర్రలతో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ విచక్షణా రహితంగా ఏకంగా ఆలయంలోనే దాడి చేశారు. దీంతో సుధాకరశర్మ ముఖంపైన, మృగఫణి శర్మ వీపుపైనా గాయాలయ్యాయి. అర్చకుల ఫిర్యాదు మేరకు చైర్మన్‌ ప్రతాపరెడ్డి, ఆలయ సిబ్బంది ఈశ్వరయ్య, నాగరాజులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు. ఇది ఇలా ఉండగా అర్చకుల పై దాడి చేసిన ప్రతాపరెడ్డి అతని అనుచరులు పై తక్షణమే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని భక్తులు, ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేసారు. అర్చకులను చితకబాదిన ప్రతా్‌పరెడ్డిని చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని అర్చక సమాఖ్య ప్రతినిధులు ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు డిమాండ్‌ చేశారు.

అసెంబ్లీలో టీడీపీ దాడి ఎఫెక్ట్.. రాత్రికి రాత్రే పంట‌ల బీమా సొమ్ము క‌ట్టిన ఏపీ స‌ర్కార్ 

అసెంబ్లీ మొదటి రోజు సమావేశంలోనే రైతుల పంటల బీమా విష‌యంలో వైసీపీ స‌ర్కార్ దారుణం గా దొరికిపోయింది. దీంతో తన తప్పు దిద్దుకునేందుకు ప్రభుత్వం రాత్రికి రాత్రి ప్ర‌య‌త్నం చేసింది. దీంతో ప్ర‌భుత్వం చెల్లించాల్సిన బీమా మొత్తం 590 కోట్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తూ ఆర్థిక శాఖ నుంచి రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మొత్తాన్ని వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన పథకం కింద చెల్లించారు.   నిన్న అసెంబ్లీలో రైతుల స‌మ‌స్య‌లు, బీమాపై టీడీపీ వైసిపి ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకు పడింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల్ని దారుణంగా ముంచేసిందని టీడీపీ మండిపడింది. ఈ విషయంలో రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా సాక్షాత్తు ప్రతిపక్ష నేత చంద్ర‌బాబు స్పీక‌ర్ పోడియం ముందు నేల‌పై కూర్చొని నిర‌స‌న తెల‌పడంతో.. తోటి టీడీపీ ఎమ్మెల్యేలతో సహా ఆయనను స‌ర్కార్ స‌స్పెండ్ చేసింది. అయితే తాము ఇన్సూరెన్స్ కట్టామ‌ని ప్ర‌భుత్వం మొదట వాదించ‌గా… ఆర్టీఐ ద్వారా తాము దీనిపై స‌మాచారం సేక‌రించామ‌ని టీడీపీ చెప్ప‌టంతో వైసీపీ ప్రభుత్వం వెంటనే మాట మార్చి.. డిసెంబ‌ర్ 15వ‌ర‌కు చెల్లిస్తామంటూ ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు రాత్రికి రాత్రే 590కోట్ల‌ను పంటల భీమా కోసం విడుదల చేసింది.   వైసిపి ప్ర‌భుత్వం చేసిన ఈ ఆల‌స్యం కార‌ణంగా… ఈ ఏడాదిలో గడచిన ఏడు నెల‌లుగా పంటలు నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ అందే అవ‌కాశం లేదు. అయితే ఇప్పటి నుండి ఎదైనా న‌ష్టం జ‌రిగితే మాత్రం పంటల భీమా వ‌ర్తిస్తుంది. మరి ఇప్పటివరకు జ‌రిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. ప్ర‌భుత్వమే స్వయంగా ఇన్సూరెన్స్ ప్రీమియం క‌డ‌తామ‌ని చెప్ప‌టంతో రైతులు కట్టలేదు. ప్రభుత్వం కూడా.. ఇవాళ.. రేపు అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చింది. చివరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఇన్సూరెన్స్ క‌ట్ట‌ని రైతుల‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఒక పార్టీ గుర్తుకు బదులు మరో పార్టీ గుర్తు.. ఓల్డ్ మలక్ పేటలో నిలిచిన పోలింగ్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అసలే ఓటింగ్ శాతం మందకొడిగా నమోదవుతున్న వేళ.. అధికారులు చేసిన తప్పిదానికి ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది.   ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో సీపీఐ ఎన్నికల గుర్తు అయినటువంటి కంకి కొడవలికి బదులుగా, సీపీఎం ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి బ్యాలెట్ పేపర్ పై ముద్రితమైంది. సీపీఐ తరఫున ఈ డివిజన్ నుంచి పోటీ పడుతున్న ఫాతిమా.. తన పేరు పక్కన సీపీఎం గుర్తును చూసి అవాక్కై ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరపాల్సిందేనని ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నేతలు పట్టుబట్టినా, ఎన్నికల సంఘం మాత్రం డివిజన్ మొత్తం పోలింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వీలైతే రేపే ఇక్కడ రీపోలింగ్ ను జరిపిస్తామని స్పష్టం చేసింది. కాగా, పార్టీ గుర్తులు మారిపోయిన విషయం దాదాపు 5 శాతం పోలింగ్ జరిగిన తరువాత వెలుగులోకి రావడం గమనార్హం. 

మొదలైన "కోవాగ్జిన్" మూడో దశ ట్రయల్స్... వ్యాక్సిన్ కోసం వాలంటీర్లుగా బడా బాబుల క్యూ..

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తాజాగా బడాబాబులు క్యూ కడుతున్నారు. ఖరీదైన కార్లలో వస్తున్నబ్యూరోక్రాట్లతో పాటు బడా వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు నేరుగా ఆస్పత్రికి వెళ్లి "కోవాగ్జిన్" వ్యాక్సిన్ వలంటీర్లుగా తమ పేరు నమోదు చేయించుకుంటున్నారు. ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ ల సహకారంతో భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ ను తయారు చేయగా, గుంటూరులో గత గురువారం నుండి ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్ మొదలయ్యాయి. ఈ ట్రయల్స్మొ లో భాగంగా మొత్తం 1000 మందికి వ్యాక్సిన్ ను ఇవ్వాలని నిర్ణయించగా, తొలి మూడు రోజుల్లోనే 150 మంది వలంటీర్లుగా నమోదు చేయించుకుని వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వారిలో ఎక్కువగా ఐఏఎస్‌, అత్యున్నత స్థాయి అధికారులు, ప్రైవేట్‌ డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది, వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఉన్నట్లుగా సమాచారం. ఒకపక్క ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ గురించిన వార్తలు వస్తుండడంతో పాటు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని ఎక్కువ మంది ప్రజలు భావిస్తుండడంతో.. వ్యాక్సిన్ ట్రయల్స్ కు భారీ స్పందన వస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా నమోదు చేసుకున్న ప్రతి వలంటీర్ ‌కు 0.5 ఎంఎల్‌ వ్యాక్సిన్‌ నరాలకు ఇస్తారు. తరువాత 28వ రోజున రెండో డోసు వ్యాక్సిన్ వేసిన తరువాత 60వ రోజున వీరిలో కరోనా యాంటీబాడీలు, ఇమ్యునోగ్లోబులిన్‌ స్థాయిలను నిపుణులు పరిశీలిస్తారు. ఇవి నిర్దేశిత ప్రమాణంలో ఉంటే వ్యాక్సిన్‌ సమర్థంగా పని చేస్తున్నట్లుగా నిర్ధారిస్తారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత.. కేసీఆర్ దిగ్భ్రాంతి

కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నేతగా నోముల నిలిచిపోతారన్నారు. నోముల మరణం టీఆర్ఎస్‌కు, నాగార్జున సాగర్ ప్రజలకు తీరని లోటని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 1999, 2004లో సీపీఎం తరపున నాగార్జున సాగర్ నుండి విజయం సాధించిన ఆయన 2013లో టీఆర్ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికలలో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి జానారెడ్డిపై నర్సింహయ్య ఘన విజయం సాధించారు.

ఆఖరి నిమిషంలో తలకిందులవుతున్న సమీకరణాలు.. నోటా లేదా టీఆరెఎస్ కు జై కొడుతున్న జనసేన

జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం ముగిసి మరో కొన్ని గంటలలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక పక్క తమ సపోర్ట్ తో ఏపీలో అధికారం చేపట్టిన జగన్ నాయకత్వంలోని వైసిపి హైదరాబాద్ లో చివరి నిమిషంలో టిఆర్ఎస్ కు జై కొట్టాలని పిలుపిచ్చినట్లుగా వైసిపి గ్రూపులలో కొన్ని వాట్స్ ఆప్ మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి.   ఇది ఇలా ఉండగా హైదరాబాద్ మహానగర ఎన్నికలలో బిజేపీ కి మద్దతుగా జనసేన పార్టీ తరుఫున నామినేషన్ వేసిన అభ్యర్థులను కూడా చివరి నిమిషంలో ఉపసంహరించుకుని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం జనసేన కేడర్ కూడా బీజేపీకి బైబై చెప్పడానికి రెడీ అయిందని తెలుస్తోంది. ఈ ఎన్నికలలో తాము కూడా పోటీ చేయాలని మొదట భావించిన జనసేన నాయకులు నామినేషన్లు వేసిన తరువాత పవన్ ప్రకటనతో ఉసూరుమంటూ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మరోపక్క దుబ్బాక ఎన్నికలలో గెలుపుతో మంచి జోష్ మీదున్న బీజేపీ రాష్ట్ర నాయకులు తమ నిర్లక్ష్య వైఖరితో జనసేన కేడర్ మద్దతు కూడగట్టడంలో మాత్రం వైఫల్యం చెందారని తెలుస్తోంది. ఇది బీజేపీ అవకాశాల పై ప్రభావం చూపే అవకాశం ఉంది.   దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో బిజెపి కార్యకర్తలతో పాటు జనసైనికుల సపోర్ట్ ఎక్కువగా కనిపించింది. అయితే ఒకసారి దుబ్బాకలో నెగ్గిన తర్వాత బండి సంజయ్ జనసేన పార్టీని తక్కువ చేసి మాట్లాడిన తీరు జనసేన కు కోపం తెప్పించింది. మరోపక్క జనసేన పార్టీ కూడా జిహెచ్ఎంసి లోని 18 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టడం జరిగింది. అయితే కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్ వంటి అగ్ర నేతలు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయి జనసేన అభ్యర్థులు ను పోటీ నుండి విరమించుకునేలా చేశారు. అయితే రెండు పార్టీల మధ్య హైదరాబాదులో పూర్తీ స్థాయి మిత్రత్వం కనిపించలేదు. నిన్న జరిగిన అమిత్ షా రోడ్ షో సందర్భంగా బిజెపి జెండాలతో పాటు జనసేన జెండా లు కూడా ఎగురుతున్న సమయంలో జనసైనికులు తమ జెండాలను తీసివేయమని బండి సంజయ్ గదమాయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అయింది.   ఇదే సమయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో.. జనసేన ని పోటీ నుండి విరమించుకోమని బీజేపీ కోర లేదని, పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా తానే విరమించుకున్నారని వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ జనసేన నాయకులు తీవ్రంగా స్పందిస్తూ.. బిజెపి తరఫున కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు పవన్ తో భేటీ అయ్యారో చెప్పాలి అంటూ ఆయనని అటు బహిరంగంగాను ఇటు సోషల్ మీడియా వేదికగాను ప్రశ్నించారు. దీంతో ఎట్టకేలకు ఆయన జనసైనికులు మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రోడ్ షో చివరిలో వ్యాఖ్యానించారు. అయితే గత మూడు నాలుగు రోజుల్లో ఆయన జనసేనను చులకన చేస్తూ చేసిన రకరకాల వ్యాఖ్యలకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.   మరోపక్క జనసేన పార్టీ అభిమానులకు టిఆర్ఎస్ పట్ల కొంత వ్యతిరేకత ఉన్న సంగతి తెల్సిందే. 2019 లో ఎపి ఎన్నికల సందర్భంలో తమ పార్టీలో చేర్చుకున్న ముఖ్యనేతలను టిఆర్ఎస్ పార్టీ బెదిరించింది అని, మీరు జనసేన లో చేరితే హైదరాబాదులో ఉన్న మీ ఆస్తులకు భద్రత ఉండదు అని భయపెట్టింది అని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా వైసిపికి టిఆర్ఎస్ అన్ని రకాలుగా మద్దతు ఇస్తోందని, ఇలా రక రకాల కారణాలతో జన సైనికులకు టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. అయితే టిఆర్ఎస్ పట్ల వారిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని క్యాష్ చేసుకుని జనసేన కేడర్ ను బీజేపీ వైపు మలుచుకోవడంలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తమ మొండి వైఖరి తో విఫలమయ్యారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో పూర్తిగా సఖ్యత తో మెలిగితే, ఎన్నికల్లో గెలిచాక మళ్ళీ ఎక్కడ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందో అని సందేహించి వారిని దూరం పెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   అంతేకూండా పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి తమ పార్టీ అభ్యర్థులను బిజెపి పోటీ నుండి తప్పించింది అన్న భావన జనసైనికుల లో బలంగా ఉంది. పైగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి నేతలు తమను ఇంతగా రెచ్చగొడుతున్నా ఆ పార్టీకి , ఎందుకు ఓటు వెయ్యాలి అన్న భావన వారిలో బాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీలయితే టిఆర్ఎస్ కు లేదంటే నోటా కి కానీ వేయడం బెటర్ అన్న భావనలోకి జనసైనికులు వచ్చినట్లుగా సమాచారం. దీంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో జనసైనికుల ప్రభావం తప్పకుండ పడే అవకాశం ఉంది. అది ఒక అభ్యర్థిని గెలిపించే అంత ప్రభావం వీరు చూపక పోవచ్చు కానీ, ఓట్లు చీల్చడం ద్వారా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో అయితే చాలా ప్రాంతాలలో ఉన్నట్లు గా తెలుస్తుంది. ఇదే సమయంలో దుబ్బాకలో అత్యంత క్లిష్టమైన పోటీలో వెయ్యి ఓట్లు, అంటే కేవలం ఒక శాతం కంటే తక్కువ మెజార్టీతో సీటు దక్కించుకున్న బీజేపీకి, ప్రతి ఒక్క ఓటు విలువ బాగానే తెలిసి ఉండాలి. మొత్తానికి రేపటి జిహెచ్ఎంసి ఎన్నికలలో జన సైనికులు బిజెపికి ఎంత వరకు ఓట్లు వేస్తారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.

ఏపీ అసెంబ్లీలో తొలి రోజే రచ్చ! 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్ 

శీతాకాల సమావేశాల్లో తొలి రోజే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. తుపాను పంట నష్టంపై సభలో అధికార, విపక్షాల మధ్య రగడ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలకు సీఎం జగన్ సమాధానం ఇచ్చారు. అయితే సీఎం జగన్ సమాధానంపై మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించగా.. చంద్రబాబు ఎలా మాట్లాడుతారంటూ అధికార పక్షం అడ్డుకుంది. దీంతో అధికార పక్షం తీరుకు నిరసనగా చంద్రబాబు పోడియం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా 12 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయస్వామి, రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, భవానీ, గద్దె రామ్మోహన్‌, జోగేశ్వరరావు, సత్యప్రసాద్‌, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవానీ, పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్‌ సస్పెండ్ అయ్యారు. దీంతో అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన చంద్రబాబు, ఎమ్మెల్యేలు.. రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.    అసెంబ్లీ ఫ్లోర్‌పై కూర్చున్న ప్రతిపక్షనేత చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. సభలో రౌడీయిజం చేస్తున్నారని, మళ్లీ ఆయనకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు చంద్రబాబు తీరు ఉందన్నారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ నెలాఖరునాటికి ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని సీఎం చెప్పారు. చంద్రబాబు కావాలనే పోడియం ఎదుట బైఠాయించారని, గతంలో ఏ ప్రతిపక్ష నేత ఇలా వ్యవహరించలేదని జగన్మోహన్ రెడ్ది అన్నారు.వయస్సుకు తగ్గట్టు చంద్రబాబు వ్యవహరించాలని సీఎం అన్నారు.   శాసనమండలిలోనూ తుపాను నష్టంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అసలు వ్యవసాయమే దండగని చంద్రబాబు అన్నారని మంత్రి బొత్ససత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై నారా లోకష్ సీరియస్ అయ్యారు. ఎప్పుడు, ఎక్కడ చెప్పారో నిరూపించాలని, ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. లేదంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సభ్యతకాదని మంత్రికి సూచించారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని మంత్రి బొత్సపై నారా లోకేశ్ మండిపడ్డారు.   నారా లోకేశ్ కు ఏ పంట ఎక్కడ పండుతుందో తెలుసా అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. తన ప్రశ్నకు లోకేశ్ సరైన జవాబు చెబితే తాను తల దించుకుని కూర్చుంటానని బొత్స సవాల్ చేశారు. ట్రాక్టర్ ఎక్కి ఫొటోలకు పోజులివ్వడం కాదు... ట్రాక్టర్ ను బురదగుంటలోకి పోనివ్వడం తప్ప ఏం తెలుసు?.. చివరికి ఆ ట్రాక్టర్ ను రైతులతో బయటికి తీయించారు అంటూ లోకేశ్ పై విరుచుకుపడ్డారు. బొత్స వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు కూడా దీటుగా స్పందించారు.  మంత్రి బొత్స వ్యాఖ్యల పట్ల ఆందోళనకు దిగడంతో మండలిలో గందరగోళం ఏర్పడింది. అటు వైసీపీ సభ్యులు కూడా చైర్మన్ పోడియం వద్దకు దూసుకువచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శాసనమండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ షరీఫ్ ప్రకటించారు.

‘గ్రేటర్’ఎన్నికల్లో...  ‘కమలం’ చెవిలో వైసీపీ పువ్వులు?

‘కారు’కే జైకొట్టాలని సోషల్ మీడియాలో వైసీపీ పిలుపు   బీజేపీకి తెలియకుండా జాగ్రత్తగా ఉండాలని హితవు   హల్‌చల్ చేస్తున్న రెండు వాట్సాప్  క్లిప్పింగులు   గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. వైఎస్సార్‌సీపీ, ఏపీలో తనకు దన్నుగా నిలిచిన ‘కమలం’ పార్టీ చెవిలో పువ్వులు పెడుతోంది. అర్ధం కాలేదా?.. గ్రేటర్ ఎన్నికల్లో నగరంలోని వైఎస్-జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలంతా టీఆర్‌ఎస్ కారు గుర్తుకే వేసేలా చూడాలని నిర్ణయించారట. యస్.. వైసీపీకి చెందిన రెండు సోషల్‌మీడియా గ్రూపులు, ఈపాటికే తన విధానాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా సర్క్యులేట్ చేస్తున్నాయి.   గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కే వైసీపీ కార్యకర్తలు-అభిమానులంతా ఓటు వేయాలంటూ.. ఆ పార్టీకి చెందిన రెండు సోషల్‌మీడియా గ్రూపులు, వాట్సాప్ ద్వారా పంపిస్తున్న సందేశాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ మేరకు ఆ గ్రూపు సభ్యుల చాటింగ్, వారి సందేహాలకు వైసీపీ సోషల్‌మీడియా యాక్టివిస్టుల సమాధానాలు చర్చనీయాంశమయ్యాయి.   ఆ ప్రకారంగా... నగరంలోని వైసీపీ-జగన్ అభిమానులు, కార్యకర్తలు ఇప్పటివరకూ బీజేపీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, తాజాగా ‘పైనుంచి’ వచ్చిన ఆదేశాల ప్రకారం.. వారంతా టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని నిర్ణయించినట్లు, ఆ చాటింగ్ సారాంశం స్పష్టం చేస్తోంది. జనసేనకు హైప్ రాకూడదని, కేసీఆర్ వైసీపీ గెలుపునకు సహకరించారని అందులో వివరించారు. అయితే వైసీపీ, టీఆర్‌ఎస్‌కు సపోర్టు చేసినందువల్ల మనకేమి లాభం అని ఓ వైసీపీ కార్యకర్త ప్రశ్నించారు.   అందుకు... బీజేపీ తర్వాత టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అని, జనసేన తోడు ఉంటే తమ పార్టీ మీద ఇప్పుడున్న వ్యతిరేకతకు రాబోవు ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని మరొక పెద్దారెడ్డిగారు, అసలు విషయం వివరించారు. అందుకే టీఆర్‌ఎస్‌కు సపోర్టు ఇవ్వాలన్నారు.  ఆంధ్రాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, ప్రచారంతో పార్టీని ఎక్కువకాలం నిలపలేమని హితబోధ చేశారు. ఇది ఒక వాట్సాప్ గ్రూపు నుంచి వచ్చిన సందేశం.   మరొక వాట్సాప్ గ్రూపులో.. నవీన్ గారూ, జగన్‌గారి ఆదేశాల మేరకు మనవాళ్లందరినీ టీఆర్‌ఎస్‌కు సపోర్టు చేయమని చెప్పండని సూచించారు. అయితే.. ఇప్పటికే మనవాళ్లంతా బీజేపీకి సపోర్టు చేయాలని నిర్ణయించుకున్నారని, అటువైపు నుంచి సందేశం ఉంది. ఆంధ్రావాళ్లున్న డివిజన్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవలసిన అవసరం ఉందన్నారు. అయితే, మనవాళ్లందరినీ బీజేపీకి సపోరు చేస్తున్నామని చెబుతూనే, టీఆర్‌ఎస్ గెలుపు కోసం పనిచేయాలని చెప్పాలని సూచించారు. రేపు మార్నింగ్ మీటింగుకు మన కోఆర్డినేటర్లను పదిన్నరకల్లా అటెండ్ అవ్వాలని చెప్పమన్నారు. ఇప్పటికే మనవాళ్లంతా బీజేపీకి సపోర్టు చేస్తున్నందున, వారికి ఇకపై టీఆర్‌ఎస్‌కు పనిచేయమని చెబుతామని హామీ ఇచ్చారు. అయితే.. మనవాళ్లంతా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు, బయట ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తగా పనిచేయండని ఆ నాయకుడు.. తమ కార్యకర్తలను హెచ్చరించడం ఆ చాటింగ్‌లో స్పష్టంగా కనిపించింది.   కాగా...గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైసీపీ అభిమానులు తొలుత, బీజేపీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. కానీ.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, దివంగత మహానేత వైఎస్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలతో.. వారంతా టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని  నిర్ణయించుకున్నారు.    అయితే.. వారి తాజా సందేశాలను పరిశీలిస్తే, బీజేపీపై ఏపీ కన్నేయడం ఖాయం ఖాయమన్న నిర్ణయానికి, వైసీపీ వర్గాలు వచ్చినట్లు స్పష్టమవుతోంది. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే, దాని దూకుడు హైదరాబాద్‌తోనే ఆగిపోతుందన్న భావన-అంచనా ఆ సందేశాల్లో పరోక్షంగా కనిపించింది. అదీకాకుండా, వైసీపీ సోషల్‌మీడియా వర్గాలు, పవన్ కల్యాణ్ జనసేనకు ఎక్కువగా భయపడుతున్నట్లు వారి చాటింగ్ సారాంశం చెబుతోంది.   ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గ్రేటర్‌లో వైసీపీ టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తున్న విషయాన్ని రహస్యంగా ఉంచాలని, బీజేపీకి ఏమాత్రం అనుమానం రాకుండా చూసుకోవాలని జాగ్రత్త పడాలని హెచ్చరించారు దీన్నిబట్టి... ఒకవైపు వైసీపీకి, టీఆర్‌ఎస్‌పై ప్రేమ ఉన్నప్పటికీ, మరోవైపు బీజేపీపై భయం ఉన్నట్లు స్పష్టమవుతోంది. సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆ రెండు గ్రూపుల చాటింగ్ నిజమో-అబద్ధమో ఎవరికీ తెలియదు. కానీ, అందులోని వ్యక్తుల సంభాషణ చూస్తే మాత్రం, వారంతా కరుడుగట్టిన వైసీపీ మద్దతుదారులుగానే అనిపిస్తోంది. ఏదేమైనా.. ఇది టీఆర్‌ఎస్‌కు శుభవార్తనే! -మార్తి సుబ్రహ్మణ్యం

ఆన్ లైన్ సర్వేల్లో కమలం వికాసం! గ్రేటర్ లో దుబ్బాక సీన్ రిపీట్ కానుందా? 

హైదరాబాద్ యూత్ మార్పు కోరుకుంటుందా? ఉద్యోగులు, విద్యావంతులు టీఆర్ఎస్ సర్కార్ పై అసంతృప్తిగా ఉన్నారా? కేసీఆర్ సర్కార్ కు షాకివ్వాలని నగరవాసులు  డిసైడయ్యారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఆన్ లైన్ సంస్ఠలు నిర్వహిస్తున్న పోల్ సర్వేలో ఇదే స్పష్టమవుతోంది. ఆన్ లైన్ పోల్ సర్వేల్లో గ్రేటర్ పీఠం బీజేపీకి దక్కడం ఖాయమని తేలుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. గ్రేటర్ ఎన్నికలపై నిర్వహిస్తున్న ఆన్ లైన్ పోల్ కు భారీ స్పందన వస్తుండగా.. దాదాపు అన్ని సర్వేల్లోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ పై వ్యతిరేకతే కనిపిస్తోంది.     ఉద్యోగులు, విద్యావంతులు, ప్రొఫెషనల్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో  యాక్టివ్ గా ఉంటారు.  ఆన్ లైన్ సర్వేల్లో ఎక్కువగా వారే పాల్గొంటారు.  విద్యావంతుల అభిప్రాయం తెలిసే  వేదికగా భావించే అన్ లైన్ పోల్ సర్వేల్లో జీహెచ్ఎంసీలో కమలం స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.  తెలుగు మీడియాలో టాప్ ఆన్ లైన్ సంస్థ తెలుగువన్ నిర్వహించిన ఆన్ లైన్  పోల్ లోనూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమల వికాసం ఖాయమని తేలింది. తెలుగు వన్  ఆన్ లైన్ పోల్ లో దాదాపు 50 వేల మంది పాల్గొని తమ అభిప్రాయం పంచుకున్నారు. ఇందులో దాదాపు 60 శాతం అంటే 30 వేల మంది బీజేపీనే జీహెచ్ఎంసీలో గెలుస్తుందని చెప్పారు. అధికార టీఆర్ఎస్ మళ్లీ విజయం సాధిస్తుందని కేవలం 26 శాతం మందే ఓటేశారు. తెలుగువన్ సర్వేలో ఏడు శాతం మంది టీడీపీకి, మూడు శాతం మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.     కేసీఆర్ సర్కార్ పనితీరుపై యువత అసంతృప్తిగా ఉన్నారనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం, గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం వంటి అంశాలపై యువతి, యువకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు కూడా టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారు. పీఆర్సీ  ప్రకటించకపోవడం, ప్రమోషన్లు, బదిలీల్లో నిర్లక్ష్యంపై వారు బహిరంగంగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పెండింగ్ సమస్యలతో పాటు కరోనా సమయంలో జీతాల్లో కోతలు పెట్టడంపైనా ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ప్రొఫెషనల్స్ కూడా గులాబీ పార్టీ పనితీరుపై హ్యాపీగా లేరని చెబుతున్నారు. ఈ అంశాలే తెలుగు వన్ ఆన్ లైన్ పోల్ సర్వేల్లోనూ స్పష్టమైంది. నెటిజన్ల తీరులానే సామాన్యుల తీర్పు కూడా ఉంటే గ్రేటర్ లో కారుకు భారీ కుదుపు ఖాయమనే చర్చ జరుగుతోంది.       తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన  దుబ్బాక ఉప ఎన్నికపై  తెలుగు వన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ సర్వే  నిజమైంది. దుబ్బాకలో అధికార పార్టీనే గెలుస్తుందని ఎక్కువ మంది భావించారు. మెజార్టీ సర్వేలు కూడా అదే చెప్పాయి. కాని తెలుగు వన్ సర్వేలో మాత్రం బీజేపీకి గెలవబోతుందని వచ్చింది. తెలుగు వన్ సర్వేపై అప్పుడు కొందరు విమర్శలు కూడా చేశారు. కాని ఎన్నికల ఫలితాల్లో మాత్రం తెలుగు వన్ చెప్పిందే నిజమైంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. ఇప్పుడు  జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తెలుగు వన్ ఆన్ లైన్ పోల్ నిజం కాబోతుందని, బీజేపీ గెలవబోతుందనే చర్చ జరుగుతోంది.     నిజానికి ఈసారి గ్రేటర్ ఎన్నికల పోరు అత్యంత హోరాహోరీగా సాగింది.  ప్రచారంలో గతంలో ఎప్పుడు లేనంతగా పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. స్థానిక అంశాలు కాకుండా రోహింగ్యాలు, పాకిస్తాన్, సర్జికల్ స్ట్రైక్ వంటి అంశాలే గ్రేటర్ ప్రచారంలో కీలకంగా మారాయి. వివిధ పార్టీ నేతల రెచ్చగొట్టే ప్రసంగాలతో  ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. హైదారాబాద్ లో అల్లర్లకు కుట్రలు జరుగుతున్నాయని , నగరాన్ని కాపాడుకోవాల్సి ఉందంటూ  గ్రేటర్ ఓటర్లలో సెంటిమెంట్  రగిలించే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్. ఈ నేపథ్యంలో హైదరాబాదీలు ముఖ్యంగా విద్యావంతులు, ఉద్యోగులు , ప్రొఫెషనల్స్ తమకు అండగా ఉంటారని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే తెలుగు వన్ సర్వేలో మాత్రం నెటిజన్లు బీజేపీకే జై కొట్టడంతో  ఇప్పుడు కారు పార్టీలు నేతలు కలవరపడుతున్నట్లు చెబుతున్నారు.

ధరణితో తెలంగాణ దద్దరిల్లేనా 

గ్రేటరు హైదరాబాద్ ఎన్నికల తర్వాత అధికార తెరాస పూర్తిగా ధరణి మీదనే కేంద్రీకరించనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, హైదరాబాద్ నగరపాలిక ఎన్నికల తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భుముల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పైనే ఆధారపడనున్నట్జ్లు తెలుస్తోంది.    నగరపాలిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కూడా, అధికార యంత్రాంగం మాత్రం ధరణి పోర్టల్ పైనే పూర్తిగా కేంద్రీకృతమైందనే విషయంలో సందేహం అవసరంలేదు. స్వయంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్సే దీనిపై ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తున్నారంటే ప్రభుత్వం ధరణి కి ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్ధమైపోతుంది. గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు పూర్తిగా తలమునకలైనా సమయంలోకూడా, ప్రస్తుతం సెక్రటేరియట్ గా పిలవబడే బిఆర్క భవన్ లో స్వయంగా ప్రధాన కార్యదర్శి రాత్రి పొద్దు పోయే వరకు ధరణి ఫై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.    దీనికి ప్రధాన కారణం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పుల పాలయింది. కోవిడ్ కారణంగా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. గ్రేటర్ ఎన్నికల వల్ల హైదరాబాద్ నగరంలో ఎన్నికల కోడ్ వుండడంతో ఆదాయం మరింతగా తగ్గిపావడమే కాకుండా, ప్రభుత్వానికి ఖర్చుకూడా పెరిగిపోయింది. అంతే కాకుండా, గత మూడు నెలల నుండి భూముల రిజిస్ట్రేషన్లు లేకపోవదంతో అటువైపు నుండి వచ్చే ఆదాయం పూర్తిగా లేకుండా పోయింది. వీటన్నికి తోడు, కొన్ని బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ చిన్న చితక కంపెనీలు లేకుండా చూడాలని ప్రభుత్వంపైనా విపరీతమైన వత్తిడి తెస్తున్నాయని కూడా అక్కడక్కడా వినిపిస్తోంది.    దీంతో, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ధరణి ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధార పడడమే కాకుండా, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సహకరించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇదంతా గమనిస్తే, రాబోయే రోజుల్లో ప్రభుత్వం పూర్తిగా భూములపైనా వచ్చే ఆదాయంపైన్నే ఆధారపడనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.    ఇక, గ్రేటర్ ఎన్నికల్లో తెరాస గెలిస్తే ల్యాండ్ రేగులేషన్ స్కీమని, బిల్డింగ్ రేగులేషన్ స్కీమాని తెచ్చి 100 గజాల పైన ఇల్లు కట్టుకున్న ప్రతివాని పైనా ఏదో విధంగా పన్నులరూపంలో గుంజాలని ప్రయత్నిస్తోందని అధికారులే స్వయంగా అంగీకరిస్తున్నారు. అంటే, ఎంత వాత, భూముల పైన వచ్చే ఆదాయం పైన మాత్రమే ఇక నుండి ప్రతువం నడవనుందనేది స్పస్తమవుతుంది. 

పాతబస్తిలో పతంగికి ఎదురుగాలి! గ్రేటర్ ఛేంజ్ కానుందా?

తెలంగాణ రాజకీయాలనే కాదు దేశ వ్యాప్తంగా చర్చగా మారిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అద్బుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఓల్ట్ సిటీలో తమకు తిరుగులేదని భావిస్తున్న ఎంఐఎం పార్టీకి ఊహించని ఫలితాలు రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. పాతబస్తిలో పతంగి పార్టీకి ఎదురు గాలి వీస్తోందని, ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్ల కంటే చాలా వరకు తగ్గుతాయని చెబుతున్నారు. ఎంఐఎంకి గట్టి పట్టున్న ప్రాంతాల్లోనూ ప్రజల్లో మార్పు కనిపిస్తుందని, గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీకి షాక్ తప్పదని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మేధావులే బల్ల గుద్ది చెబుతున్నారంటే పరిస్థితి ఎలా అర్ధం చేసుకోవచ్చు.    2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 61 డివిజన్లలో పోటీ చేసిన ఎంఐఎం 44 డివిజన్లు గెలిచింది. ఇందులో జాంబాగ్ లో కేవలం ఐదు ఓట్ల మెజార్టీతో  గెలవగా.. మరికొన్ని డివిజన్లలోనూ వందల ఓట్ల తేడాతోనే పతంగి పార్టీ గట్టెక్కింది. ఈసారి కేవలం 51 డివిజన్లకే పరిమితమైన ఎంఐఎం.. 47 సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో గతంలో ఓడిపోయిన డివిజన్లతో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్దంపై అసద్, అక్భర్ ఎక్కువ ఫోకస్ చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులను చూస్తే అక్భర్ సొంత నియోజకవర్గం చాంద్రాయణ గుట్టలోనే ఎంఐఎంకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారు. గ్రేటర్ లో ఈసారి గతంలో వచ్చిన వాటి కంటే 10 సీట్ల వరకు ఎంఐఎంకు తగ్గవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంఐఎం ఎంతగా కష్టపడినా.. ఆ పార్టీకి ఈసారి గ్రేటర్ లో 35 సీట్లకు మించవని ఖచ్చితంగా చెబుతున్నారు.    పాతబస్తిలో  కొన్ని రోజులుగా ఎంఐఎంపై ముస్లింల్లోనే బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఎంఐఎం ప్రజా ప్రతినిధులు ప్రజలను పట్టించుకోవడం లేదని, స్థానిక సమస్యలను పరిష్కరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారని, తర్వాత ఎవరూ అందుబాటులో ఉండనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఇటీవల వచ్చిన వరదల సమయంలో ఎంఐఎం నేతల తీరుపై ముస్లింలు తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. నాలుగైదు రోజుల పాటు మోకాళ్ల లోతు నీటిలోనే ఉండి నరకం చూస్తున్నా.. ఎవరూ స్పందించలేదనే ఆరోపణలున్నాయి. వరదల సమయంలో ఎంఐఎంకి వ్యతిరేకంగా ఓల్ట్ సిటీలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళన చేయడం, అసద్ కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు స్లోగన్ చేయడం అందరిని అశ్చర్యపరిచింది. వరద సాయం పంపిణిలో జరిగిన అవకతవకలు ఎంఐఎం పార్టీపై ప్రజల్లో మరింత వ్యతిరేకంగా పెంచాయి.    గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎంకు ప్రజా గ్రహం స్పష్టంగా కనిపించింది. గతంలో ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడాలంటేనే పాతబస్తీలో భయపడేవారు. ఒవైసీల గురించి అయితే అసలు చెప్పనవరసం లేదు. అలాంటి సీన్ పూర్తిగా రివర్సైంది. ఏకంగా ఒవైసీ బ్రదర్స్ నే నిలదీశారు ఓల్ట్ సిటీ ఓటర్లు. జాంబాగ్ ఎంఐఎం అభ్యర్థి రవీందర్‌ తరుఫున ప్రచారానికి వెళ్లిన ఎంపీ అసదుద్దీన్‌ను స్థానిక ముస్లిం మహిళలు అడ్డుకున్నారు. వరద సాయంపై వారు అసద్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. మహిళల నిరసనతో అసదుద్దీన్ షాక్ తిన్నారు. ముషిరాబాద్ లో అక్భరుద్దీన్ కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల సభలో  అక్భర్ మాట్లాడుతుండగా ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు వరద సాయం అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో అసహనానికి గురైన అక్భరుద్దీన్  ప్రసంగించడం ఆపేసి వేదిక దిగి వెళ్లిపోయారు.    పాతబస్తిలోని చాలా డివిజన్లలో ఇదే పరిస్థితి కనిపించింది. కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను స్థానిక సమస్యలపై ఓటర్లు ఎక్కడికక్కడ నిలదీశారు.  పాతబస్తీలో వచ్చిన మార్పులతో ఈసారి ఎంఐఎంకు షాకిచ్చే ఫలితాలు వస్తాయని అంతా భావిస్తున్నారు. అయితే ఓల్డ్ సిటీలో పతంగి పార్టీపై ప్రజల్లో ఆగ్రహం ఉన్నా.. దాన్ని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోవడంలో ప్రత్యర్థి పార్టీలు సక్సెస్ కాలేదనే మరో చర్చ కూడా జరుగుతోంది. బలహీన అభ్యర్థులను పెట్టడం, ముఖ్య నేతలు ప్రచారం చేయకపోవడంతో ఎంఐఎంకి కొంత కలిసి వచ్చిందంటున్నారు. బీజేపీ ఓల్డ్ సిటీపై మరింత ఫోకస్ చేస్తే ఎంఐఎంకి గతంలో కంటే సగానికి పైగా సీట్లు తగ్గేవని చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు సీరియస్ ఎఫర్ట్ పెట్టకోపోయినప్పటికి ఈసారి గ్రేటర్ లో ఎంఐఎం సీట్లు తగ్గడం ఖాయమంటున్నారు.  బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎంపీ అర్వింద్ తో పాటు గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నేతల ప్రసంగాలు కూడా కొంత ప్రభావం చూపించాయని అంటున్నారు. ఎంఐఎంపై కోపంగా ఉన్నా.. బీజేపీ నేతల మాటల వల్ల కొందరు ఓటర్లు విధిలేని పరిస్థితుల్లో అయిష్టంగానే పతంగి పార్టీకి సపోర్ట్ చేస్తున్నారనే చర్చ కూడా వస్తోంది.

పండుగల సీజన్ నేపథ్యంలో ముంచుకొస్తున్న కరోనా ముప్పు

అమెరికాలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు కరోనా ఉధృతి కొంత తగ్గినట్లుగా కనిపించినప్పటికీ ప్రస్తుతం ప్రతి రోజు లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో త్వరలో క్రిస్మస్‌, న్యూఇయర్ వేడుకలు నేపథ్యంలో అమెరికాలో ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ చేయడంతో పాటు బంధువులు, మిత్రులను కలిసే అవకాశం ఉంది. దీంతో ఈ సీజన్‌లో కరోనా విజృంభణ మరింత పెరిగే అవకాశం ఉంది.   దీనిపై అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోని ఫౌచీ అందోళన వ్యక్తం చేసారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో సమావేశాలు, ప్రయాణాలు పెరుగుతాయని దీంతో కేసులు భారీ స్థాయిలో పెరుగుతాయని అయన అన్నారు. అయితే తాను ఈ విషయం ఎవరినో భయపెట్టడానికి చెప్పడం లేదని, కేవలం దేశ ప్రజల్ని అప్రమత్తం చేయడానికే చెబుతున్నానని అయన అన్నారు.   కరోనాను మొదట్లో సమర్థంగా ఎదుర్కొన్న దేశాల్లోనూ వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోందని, ప్రజలు నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని అయన అన్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోపు కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని అప్పటివరకు ప్రజలు మాస్క్ ధరించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలని అయన తెలిపారు. క్రిస్మస్ తర్వాత కరోనా విజృంభణ ఏకంగా పదింతలు పెరిగే అవకాశం ఉందని, దీంతో ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉందని అంటువ్యాధుల నిపుణురాలు డెబోరా బిర్‌క్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.

తాపీ దాడి.. కోడి కత్తి సేమ్ టు సేమ్ ! నిజాలు వెలికి తీయాలన్న వర్ల 

ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖా మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడి ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. టీడీపీ సానుభూతి పరుడే మంత్రిపై దాడికి ప్రయత్నించాడని ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత సహా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది తెలుగు దేశం పార్టీ. రవాణా మంత్రి పేర్ని నానిపై తాపి దాడికి సంబంధించి టీడీపీ నేత వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి దాడి ఘటనతో పేర్ని నాని ఘటనను పోల్చుతూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు. ‘ఆనాటి కోడి కత్తి దాడికి, ఈనాటి తాపీ దాడికి సారూప్యమున్నట్లుగా కనిపిస్తున్నది. ఆనాటి బాధితుడు ముఖ్యమంత్రి, ఈనాడు రవాణా మంత్రి. ఆనాడు కోడికత్తితో చంపాలనుకుంటే, ఈనాడు తాపీతో చంపాలనుకున్నాడు. ఈ ఆయుధాలతో కదలకుండా పడుకున్న మనిషిని మాత్రమే చంపగలం. దర్యాప్తు చేసి నిజాలు వెలికి తీస్తారా?’ అంటూ వర్లరామయ్య ట్వీట్ చేశారు.

కేంద్రంతో చర్చల ప్రసక్తే లేదు.. ఆ బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందే: తేల్చి చెప్పిన రైతులు

ఎన్డీయే సారధ్యం లోని కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు తీవ్ర నష్టం చేసేలా ఉన్నాయంటూ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది రైతులు దేశ రాజధాని ఢిల్లీ ని చుట్టుముట్టి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని షరతులతో కేంద్ర ప్రభుత్వం చేసిన చర్చల ప్రతిపాదనను ఆందోళన చేస్తున్న రైతులు తిరస్కరించారు. రైతు నాయకులను చర్చల కోసం బురారీ మైదానానికి రావాలని కేంద్రం కోరగా.. నిరసన చేస్తున్న రైతులందరికి డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన తెలిపే అవకాశాన్ని ఇచ్చేవరకు ఆందోళనను కొనసాగిస్తామని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. దీంతో ఇరువురి మధ్య ప్రతిష్టంభన నెలకొంది.   దీంతో రైతుల నిరసన, అలాగే ప్రభుత్వ చర్చల ప్రతిపాదనను రైతులు తిరస్కరించిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో నిన్న అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, వ్యవసాయ మంత్రి తోమర్ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాజాగా ఢిల్లీని అన్ని వైపుల నుండి దిగ్బంధిస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాకుండా హర్యానా సీఎం ఖట్టర్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా కేంద్ర మంత్రుల మధ్య చర్చకు వచ్చాయి. దీంతో పాటు నిరసన తెలుపుతున్న రైతుల విషయంలో తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలను తీవ్రం గా నిరసిస్తూ ఉద్యమించిన ఉత్తర భారతానికి చెందిన రైతులు వరుసగా నాలుగో రోజూ ఢిల్లీ పొలిమేరల్లోనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్‌, హరియాణ, యూపీ, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ల నుంచి వేలాది మంది రైతులు వణికే చలిని కూడా లెక్క చేయకుండా తమ నిరసన కొనసాగిస్తున్నారు.

కరోనాతో బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి

దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఉత్తరాదిలో కరోనా సేకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కరోనా పాటిజివ్ కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి మరో  ఎమ్మెల్యేను బలి తీసుకుంది. రాజస్థాన్ బీజేపీ మహిళా ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  చనిపోయారు. చనిపోయిన మహిళా ఎమ్మెల్యే  వయసు 59 ఏండ్లు. రాజ్‌సమండ్ నియోజకవర్గం నుంచి కిరణ్ మహేశ్వరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కరోనా సోకడంతో ఆమె గత కొన్ని రోజుల నుంచి గురుగ్రాంలోని మెదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. మహేశ్వరి మృతిపట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, బీజేపీ రాజస్థాన్  అధ్యక్షుడు సతీష్ పూనియా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు సంతాపం తెలిపారు.

హైదరాబాద్‌ అభివృద్ధి కోసం టీడీపీకి ఓటేయండి: చంద్రబాబు ట్వీట్ 

హైదరాబాద్ కు పూర్వ వైభవం రావాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని .. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కోరారు.    బిల్‌గేట్స్‌, బిల్‌ క్లింటన్‌లను నగరానికి తీసుకువచ్చి ఐటీ కంపెనీలను స్థాపించిన ఘనత తమదేనని టీడీపీదేనని చెప్పారు, నగరం సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే టీడీపీ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని గ్రేటర్ ఓటర్లను ఆయన  ట్విటర్‌లో కోరారు. ప్రజాశ్రేయస్సు పట్ల తమకున్న ఆకాంక్షల ఫలితమే సైబరాబాద్‌ అన్నారు చంద్రబాబు. హైటెక్‌సిటీ, ఔటర్‌ రింగ్‌రోడ్‌, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, జినోమ్‌ వ్యాలీ.. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తమ హయాంలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. ఉపాధి కల్పన, సంపదసృష్టి, సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగి ఎన్నో కుటుంబాల్లో వెలుగునింపామన్నారు చంద్రబాబు. మళ్లీ హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం రావాలంటే ప్రజలు సైకిల్‌ గుర్తుకు ఓటేసి, టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ట్విటర్‌లో కోరారు.