సెలబ్రేట్ చేసుకోవాల్సిన వేళ రెండుగా చీలిన జనసైనికులు..

ప్రభుత్వాలను ప్రశ్నించడానికే పాలిటిక్స్ లోకి వస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రేపటికి ఏడేళ్లు పూర్తవుతాయి. ఈ అకేషన్ ను ఘనంగా జరుపుకోవడానికి ఒకపక్క జనసైనికులు సిద్ధమయ్యారు. ఈలోగా తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపుతుందని ఆ పార్టీ నుండి ఒక ప్రకటన వచ్చింది. దీనికి సంబంధించి ఎపి బీజేపీ నేతలు పవన కళ్యాణ్ తో సుదీర్ఘంగా చర్చించి ఆయనను కూడా ఒప్పించారు. దీంతో తిరుపతి లోక్ సభ సీటుకు జరుగుతున్న ఉప ఎన్నికలలో బీజేపీకి మద్దతు ప్రకటిస్తూ జనసేన పోటీ నుండి తప్పుకుంది.      జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతి విషయంలో తీసుకున్న తాజా నిర్ణయంతో పార్టీలో మెజారిటీ కార్యకర్తలు ఒక్కసారిగా  హార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే తన తాజా   నిర్ణయంపై పవన్ కళ్యాణ్ వివరణ ఇస్తూ.. దేశ, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక సుదీర్ఘమైన లేఖను విడుదల చేశారు. అయితే పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయంతో జనసైనికులు సోషల్ మీడియా సాక్షిగా రెండుగా చీలిపోయారు. ఏ రకంగా చూసుకున్నా బీజేపీ కంటే అత్యధిక ఓటు షేర్ కలిగిన జనసేన... తిరుపతి ఎన్నికల నుండి తప్పుకొని, నోటాతో పోటీ పడుతున్న బీజేపీకి మద్దతు ఇవ్వడం ఏమిటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. అటు సామాజిక సమీకరణాల పరంగా కూడా ఎంతో బలంగా ఉన్న చోట కూడా జనసేన పోటీ చేయకపోవడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలలోను బీజేపీ ఇలాగే చేసింది..ఇపుడు మళ్ళీ తిరుపతిలో కూడా  అదే పార్టీ పోటీ చేస్తే ఇక మన పార్టీ ఉన్నట్లా లేనట్లా అంటూ జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలపడే అవకాశం ఉన్న ఈ సమయంలో ఇటువంటి నిర్ణయం పార్టీ భవిష్యత్తును దెబ్బ తీస్తుందని వారు వాపోతున్నారు. అంతేకాకుండా మన పార్టీ బలంగా ఉండి కూడా ప్రతిసారి వేరే పార్టీకి ఓటు వేయడానికా జనసైనికులు ఉంది అంటూ.. నేరుగా పవన్ కళ్యాణ్ ని అడుగుతున్నారు. ఇలా అయితే జనసేన కోసం సొంత డబ్బులు ఖర్చు చేసి ప్రచారం చేయడం దండగ అంటున్నారు. మరోపక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కారణంగా రాష్ట్రంలో బీజేపీ పట్ల పూర్తి వ్యతిరేకత వచ్చిందని, అసలు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన జనసేన కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని.. కనుక బీజేపీతో కూటమి నుండి పార్టీ బయటికి రావాలని జనసైనికులు కోరుతున్నారు. ప్రస్తుతం రెండుగా చీలిన జనసేన కార్యకర్తలలో కొందరు పార్టీ అధినేత నిర్ణయాన్ని  తీవ్రంగా విమర్శిస్తుండగా.. మరి  కొందరు మాత్రం పవన్ ని సమర్దిస్తున్నారు. పార్టీ అథినేత నిర్ణయాన్ని గౌరవించని వారు అసలు నిజమైన జన సైనికులు కాదని వారు అంటున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నిర్ణయం వెనుక పెద్ద వ్యూహం ఉండి ఉంటుందని.. ఇపుడు ఒక సీటు కోల్పోతే రేపు పది సీట్లు తెచ్చుకొనే ప్లాన్ పాన్ వద్ద ఉండవచ్చని కొందరు సమర్థిస్తున్నారు. ఈ విధంగా పవన్ అభిమానులు సోషల్ మీడియాలో  రెండుగా చీలిపోయి అయన నిర్ణయాన్ని సమర్ధించే వారు ఒక వైపు, వ్యతిరేకించే వారు మరో వైపు విడిపోయి వాదులాడుకుంటున్నారు. మరి కొంతమందైతే అసలు వచ్చే ఎన్నికలలో పవన్ సీఎం కాండిడేట్ కూడా కాదని... బీజేపీ వాళ్లే ఎదో ఒక రీజన్ చెప్పి..  సీఎం పోస్ట్ కూడా వారే తీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలా అన్నింటిని వదులుకుంటూ పొతే ఇక జనసేన ఉనికికే ప్రమాదం ఏర్పడుతోందని జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క తిరుపతి ఉప ఎన్నికలో జనసేన కార్యకర్తలు అంతా కలిసి నోటాకి ఓటు వేయాలని చెపుతుంటే.. మరి కొందరు అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వారికీ సర్ది చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ విషయంపై పార్టీ కార్యకర్తలలో వచ్చిన ఈ చీలిక పవన్ కళ్యాణ్ కి పెద్ద తలనొప్పిగా తయారైంది .. రేపు జనసేన  ఆవిర్భావ దినోత్సవం కావడంతో వీరికి పవన్ ఏ విధంగా సర్ది చెపుతారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.  

కలెక్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే చిందులు

ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే.. ఇంకేం బరి తెగించారు.. జిల్లా కలెక్టర్ పై విరుచుకుపడ్డారు. వ్యక్తిగతంగా దూషించారు. అతి చేస్తున్నాడంటూ చిందులేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడుపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  కలెక్టర్‌ చంద్రుడు ఇగోయిస్టు అంటూ ధ్వజమెత్తారు. గంధం చంద్రుడు ఇవాళ ఉండి రేపు పోతాడని, ఎవడిని నాశనం చేయడానికి గంధం చంద్రుడు పుట్టాడంటూ చిందులేశారు.  పత్రికల్లో హనీట్రాప్ రాకపోతే ఎప్పుడో పోయేవాడని చెప్పారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. కలెక్టర్‌ కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జిల్లా మేజిస్ట్రేట్ అయితే చంపేస్తావా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలం గాడిదలు కాయడానికి ఉన్నామా?.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్‌ లెక్కచేయట్లేదని విమర్శించారు. సీఎంవో, మంత్రులకు కలెక్టర్‌ రాంగ్‌ ఫీడింగ్‌ ఇస్తున్నారని, కలెక్టర్ చేసిన పనికిమాలిన పనులు చెప్పాలంటే పేజీలు చాలవని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లెలో కాటకోటేశ్వరస్వామి ఉత్సవాలను ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తారు. అయితే కడప జిల్లా పులివెందుల మండలం అంకేపల్లి, చిల్లవారిపల్లె గ్రామాల మధ్య ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో వివాదం చోటుచేసుకుంది. ఊరేగింపు విషయం రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించండం మంచిది కాదని, ఉత్సవ విగ్రహాలు ఊరిగించవద్దని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలిచ్చారు. అయినా  గ్రామంలో కాటకోటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మొదలు పెట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్వామి ఊరేగింపు చేయరాదంటూ అడ్డుకున్నారు. గ్రామంలోని ఆలయానికి తలుపులు వేయాలంటూ ఆదేశాలు ఇవ్వటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఊరేగింపు సమయానికి అక్కడికి చేరుకున్న డీసీఎంఎస్‌ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, మండల నాయకులు అశ్వత్థ, భాస్కర్‌రెడ్డి.. గ్రామస్థులకు నచ్చజెప్పి  పంపారు. గుడి తలుపులు మూయటంతో మనస్తాపం చెందిన ఆలయ పూజారి సోదరుడు రామేశ్వరరెడ్డి, ధర్మకర్త సోదరుడు బాలిరెడ్డి పురుగుల మందు తాగారు. తమ గ్రామంలో ప్రశాంతంగా ఊరేగింపు నిర్వహిస్తుంటే ఎందుకు అడ్డుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల మందు తాగిన వారిని మొదట నార్పలకు, అక్కడి నుంచి అనంతపురం వైద్యశాలకు తరలించారు.   

  దేశం కోసమే పవన్ యూ టర్న్?

రాజకీయాలలో ఏదైనా జరగవచ్చును..ఎవరు ఎవరితో అయినా,ఎప్పుడైనా కలవవచ్చును. కలిసిన చేతులు విడిపోవచ్చును.విడి పోయిన చేతులు మళ్ళీ కలవ వచ్చును.ఆంధ్ర ప్రదేశ్’లో అలా పాత మిత్రులు మళ్ళీ ఒకటయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయా,అంటే,అవుననే  సంకేతాలే కనిపిస్తున్నాయనే మాట రాజకీయ, మీడియా వర్గాలలో వినవస్తోంది.  తిరుపతి లోక్ సభ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో మేమంటే మేము పోటీ చేస్తామని, కాషాయ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు, బీజేపీ, జనసేన ఒక దానితో ఒకటి   పోటీ పడ్డాయి.విషయం,వివాదం ఢిల్లీ వరకు వెళ్ళింది.బీజేపీ అదిష్టానం జనసేనకు ఓకే చెప్పిందని ఆపార్టీ వర్గాలే ప్రచారంలో  పెట్టాయి.  అయితే,ఇంతలోనే ఏమైందో ఏమోకానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హటాత్తుగా మనసు మార్చుకున్నారు.బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో చర్చలు జరిపిన అనతరం, పవన్ కళ్యాణ్ తిరుపతిలో కూటమి తరపున బీజేపీ అభ్యర్ధి పోటీ చేస్తారని ప్రకటించారు. పవన్ కళ్యాణ్’కు ఇలా యూ టర్న్ తీసుకోవడం కొత్త కాదు. అది ఆయనకు అలవాటైన విషయమే అయినా,తిరుపతి ఉపసంహరణ వెనక పాత మిత్రుల మద్య కొత్తగా మొగ్గ తొడిగిన స్నేహ బంధమే కారణమని రాజకీయ, మీడియా వర్గాల్లో వినవస్తోంది. గత ఎన్నికల్లో ఓడి పోయినప్పటికి తిరుపతి నియోజక వర్గం,తెలుగు దేశం పార్టీకి మంచి పట్టున్న నియోజక వర్గం. ఇందులో మరో అభిప్రాయానికి తావు లేదు.బీజేపీ గతంలో ఒకసారి ఈ స్థానం  నుంచి గెలిచి నప్పటికీ,ఇప్పుడు, కమల దళం , గెలిచే పరిస్థితి ఎంత మాత్రం లేదు. ఇది కూడా ఎవరూ కాదనలేని నిజం .  అదే సమయంలో కాపు సామాజిక వర్గానికి  చెందిన కాపు, బలిజ,వంటరి కులాల  జనాభా ఎక్కువగా ఉన్న ఈ నియోజక వర్గంలో  బీజేపీ కూటమి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్  పార్టీ అభ్యర్ధిని నిలబెడితే, టీడీపీ విజయావకాశాలను దెబ్బతీస్తుంది. పవన్ కళ్యాణ్ అదే సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం, గతంలో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పవన్ సోదరుడు చిరంజీవి గెలిచి ఉడడంతో, జనసేన అభ్యర్ధిని నిలబెడితే అది పరోక్షంగా వైసీపీ కి మేలు చేస్తుంది.అందుకే శత్రువు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకుని పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకున్నట్లు సమాచారం.   ఈ ఏర్పాటుకు బీజేపీ అదిష్టానం ఆమోదం కూడా అన్నట్లు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీని పక్కకు తప్పించి , మెల్లగా ఆ స్థానాన్ని ఆక్రమించాలని కమల నాధులు కన్న కలలు మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్లలుగా తేలిపోయాయి. వైసీపీ , టీడీపీ మధ్యనే పోటీ అన్న విషయం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు తేల్చి చెప్పాయి.ఈ పరిస్థితిలో బీజేపీ  రాష్ట్రంలో ఉనికిని నిలుపుకుని మనుగడ సాగించాలంటే తెలుగు దేశంతో పూర్వ బంధాన్ని పునరుద్దరించుకోవడం ఒక్కటే మార్గమని కమల దళం కొద్దిగా ఆలస్యంగానే అయినా  గుర్తించిందని,అందుకే  పవన్ కళ్యాణ్ పౌరోహిత్యంలో తెలుగు దేశంతో మళ్ళీ చేతులు కలిపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు. మరో వంక సార్వత్రిక ఎన్నికలకు ముందు, బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం ‘చారిత్రక’ తప్పిదం కంటే పెద్ద తప్పిదమని టీడీపీ ఎప్పుడోనే గ్రహించింది. బీజేపీ తో మళ్ళీ చేతులు కలిపేందుకు సంసిద్ధతను వివిధ రూపాల్లో వ్యక్తం చేసింది. అయినా,అప్పట్లో బీజేపీలోని ఒక వర్గం పడనీయ లేదు. ఇప్పుడు డిల్లీ పెద్దలే పచ్చ జెండా ఊపారు అంటున్నారు కాబట్టి , బీజేపీ,టీడీపీ,జనసేన ముక్కోణ కూటమి తెరకెక్కేందుకు ఎక్కువ సమయం పట్టదని అంటున్నారు. రాజకీయాలలో శాశ్వత  మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు .. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి.

దీదీ సాహసం పై బీజేపీ మాజీ నేత సంచలన కామెంట్స్

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని  దగ్గర నుండి చూసిన వారు శివంగితో పోలుస్తారు  అంటారు. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన బిజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా దీదీ సాహసం గురించి వివరించారు. 1999లో ఖాట్మండు నుండి  ఢిల్లీకి వస్తున్న విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, ముందుగా కరాచీకి తీసుకెళ్లి.. అక్కడి నుండి కాందహార్ కు తరలిస్తున్న సమయంలో.. విమానంలో బందీలుగా ఉన్న భారతీయులను వదిలి పెట్టాలని, వారికి బదులుగా తనను బందీగా తీసుకోవాలని అప్పట్లో కేంద్ర మంత్రిగా కూడా ఉన్న మమత అన్నారని తెలిపారు . అంతేకాకుండా మొట్టమొదటి నుండి కూడా ఆమె పోరాట యోధురాలేనని యశ్వంత్ సిన్హా అన్నారు. వాజ్ పేయి సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మమతతో కలిసి తాను పని చేశానని అయన చెప్పారు. ఆ విమానం హైజాక్ జరిగిన సమయంలో కేంద్ర కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగిందని... ఆ సమయంలో తాను బందీగా వెళ్లేందుకు మమత సిద్ధమయ్యారని అయన తెలిపారు. మమతా గొప్ప త్యాగశీలి అని యశ్వంత్ సిన్హా ఈ సందర్భంగా కొనియాడారు. 1999 డిసెంబర్ లో ఖాట్మండు నుండి  ఢిల్లీకి వస్తున్న విమానం హైజాక్ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. జైల్లో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయకపోతే విమానంలోని ప్రయాణికులందరినీ చంపేస్తామని హైజాకర్లు బెదిరించారు. దీంతో కరడుగట్టిన ఉగ్రవాదులు మసూద్ అజహర్, ముస్తాక్ అహ్మద్ జర్గార్, అహ్మద్ ఉమర్ సయీద్ షేక్  లను భారత ప్రభుత్వం విడుదల చేసింది.  

ముసలోడి లై*గిక వేధింపులు.. కుర్చీలో కట్టేసి.. సీసీటీవీ ఫుటేజ్..

ఆ భార్యభర్తలు విడిపోయారు. విడాకులూ తీసుకున్నారు. ఆమె రెండో పెళ్లి చేసుకుంది. అతను సింగిల్. అయితేనేం, మాజీ భార్యపై మోజు పోలేదు. లై*గిక వేధింపులు ఆపలేదు. తనకు అది కావాలంటూ తరుచూ టార్చర్ చేసేవాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ మాజీ మొగుడి వయసు 65ఏళ్లు. మొదటి భర్త నుంచి లై*గిక వేధింపులు పెరగడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అతడిని కుర్చీలో కట్టేసి గొంతు కోసి చంపేసింది. తనను లై*గికంగా వేధించినందుకు ప్రతీకారంగా ఆ హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే నిజమేనని తేలింది. నిందితురాలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నాగ్‌పూర్‌లో జరిగింది.

తెలుగుజాతి ఆత్మ గౌరవంపై దాడి

నేటి విశాఖ ఉక్కు పోరాటం రేపటి వెలుగుకు నాంది కావాలన్నారు హీరో నారా రోహిత్. ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుసుతూ.. ఫేస్‌బుక్‌లో ఆసక్తికర పోస్టు పెట్టారు. "నేటి ఉద్యమస్పూర్తి రేపటి ప్రగతికి బాట వేయాలి. విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ! ప్రస్తుత తరానికి, రాబోయే తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపి ఆకలి తీర్చే తల్లి. ఉక్కు పోరాటంలో నన్నూ భాగస్వామిని చేసిన కార్మిక లోకానికి వందనం. తెలుగోడి అస్థిత్వానికి ప్రతీకగా నిలిచిన ఉక్కు ఉద్యమానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు వెన్ను చూపడం నా నైజం కాదు . సాటి ఆంధ్రుడికి కష్టమెచ్చినప్పుడు అండగా నిలబడతా. తెలుగుజాతి ఆత్మ గౌరవంపై దాడి జరుగుతోంది. యువతా..మేలుకో. నీ పోరాట పటిమతో నవయుగ చైతన్యానికి నాంది పలుకు. త్యాగధనుల పోరాటఫలం పరాధీనమవ్వకుండా పిడికిలి బిగించు. తెలుగువారి స్వాభిమానం అపహాస్యమవ్వకుండా ఐక్య పోరాటానికి కదలిరా. త్వరలోనే విశాఖ వచ్చి ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతా." అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు నారా రోహిత్.

దేశం బాగు కోసమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. బీజేపీ నేత వివరణ

ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం తీవ్ర చిచ్చు రేపుతున్న సంగతి తెల్సిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్ర రూపు దాలుస్తోంది. నిన్న టాలీవుడ్  హీరో మంచు విష్ణు తన సినిమా ప్రమోషన్ కోసం విశాఖకు వెళ్లగా ఆయనను ఉక్కు కర్మాగార ఉద్యోగులు చుట్టుముట్టి తమ ఆందోళనకు మద్దతు తెలపాల్సిందిగా కోరారు. దీంతో విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రజలు, కార్మికులు చేస్తున్న ఉద్యమానికి తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ విషయంపై కార్మికులకు మద్దతు తెలపాలని కొందరు టాలీవుడ్ ప్రముఖులకు ఉన్నా.. కేవలం రాజకీయ కారణాల వల్ల సపోర్ట్‌ చేయలేకపోతున్నారని తెలిపిన సంగతి తెల్సిందే .      ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం పైవేటీకరణపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ స్పందిస్తూ.. దేశవ్యాప్త విధానంలో భాగంగా నష్టాలలో ఉన్న ప్రభుత్వరంగ కంపెనీలను ప్రైవేటీకరించాలని కేంద్రం ఒక నిర్ణయం  తీసుకుందని అందులో భాగంగానే ఇక్కడి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తున్నట్టు అయన తెలిపారు. అదే సమయంలో ప్లాంటు ఉద్యోగుల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని అయన చెప్పారు..ప్లాంటు  ప్రైవేటీకరణ గురించి సంస్థ ఉద్యోగులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయన అన్నారు. మరోపక్క విశాఖ ఉక్కు అంశాన్ని హైలైట్ చేస్తున్న వైసిపి సర్కార్ తెరవెనుక రాష్ట్రంలో మతమార్పిడులకు పాల్పడుతోందని ఆరోపించారు. విజయవాడలో ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో జరిగిన  సమావేశంలో మాట్లాడుతూ అయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా విశాఖ ఉక్కు, తిరుపతి ఉపఎన్నికపై నాయకులు చర్చించారు.  తిరుపతి ఎన్నికలలో మాజీ ఐఏఎస్ అధికారిని అభ్యర్థిగా దించే అంశంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సునీల్ దేవధర్ మాట్లాడుతూ, ఉపఎన్నికపై ప్రకటన వచ్చాక బీజేపీ జనసీన్ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. ఇదే సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. దీనిపై అవసరమైనప్పుడల్లా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కొన్ని పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని మాధవ్ విమర్శించారు  

తిరుపతికి విశాఖ సెగ! బీజేపీ, వైసీపీలో బెంగ 

తిరుపతి లోక్ సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగుతుంది. నిజానికి  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తో  పాటుగానే, తిరుపతి ఉపఎన్నిక నోటిఫికేషన్ కూడా వస్తుందని అనుకున్నారు.అయితే, తెలుగు రాష్ట్రాలలో పంచాయతీ, మున్సిపల్, మండలి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపధ్యంలో, తిరుపతి లోక్ సభతో పాటుగా , తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ను ప్రత్యేకంగా ప్రకటిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. ఇప్పుడు, ఉభయ తెలుగు రాష్టాలలో స్థానిక , మండల ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరిన నేపధ్యంలో , ఇక ఎప్పుడైనా తిరుపతి,సాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావచ్చని తెలుస్తోంది.   తిరుపతి విషయానికి వస్తే,ఇది వైసీపీ సిట్టింగ్ సీటు. పార్టీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.అయితే  అధికార పార్టీ దివంగత నేత కుటుంబ సభ్యులను కాదని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో సేవలు అందించిన  వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్, డాక్టర్ గురుమూర్తిని బరిలో దించే అలోచనలో ఉందని తెలుస్తోంది.  గురుమూర్తి కి టికెట్ ఇస్తారా లేదా అనేది ఇంకా తేలకపోయినా, దుర్గ పసాద్ కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదన్నది తేలిపోయింది.ఆయన కుమారుడు కళ్యాణ్ కు ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ని మండలికి నామినేట్ చేశారు.  గత ఎన్నికలలో పార్టీ తరపున పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికే తెలుగు దేశం పార్టీ మళ్ళీ టికెట్ ఇచ్చింది. ఆమె ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. అదలా ఉంటే గత ఎన్నికల్లో నాలుగో స్థానానికి పరిమితం అయిన బీజీపీ, ఈసారి జనసేనతో  జట్టు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగతున్నదేవాలయాలపై దాడులు, విగ్రహాలను  ద్వంసం చేయడం,రాష్ట్రంలో జోరుగా సాగుతున్న క్రైస్తవ మత ప్రచారం , మత మార్పిడులు వంటి పరిణామాల నేపధ్యంలో, ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిని హిందువుల సెంటిమెంట్ అస్త్రంతో జయించే ప్రణాళికను సిద్దం చేసుకున్నారు. అయితే ఇప్పుడ ఎన్నికలు దగ్గరకు వచ్చిన పరిస్థితులలో సీన్ రివర్స్ అయింది.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నకల్లో, ప్రజలు బీజేపీని అసలు పట్టించుకొనే లేదు. ఆటలో అరటి పండులా పక్కన పెట్టారు. ఇప్పుడు అందుకు తోడు, విశాఖ ఉక్కు, బీజేపీ చిరు ఆశలను కూడా  ఉక్కు పాదంతో తొక్కే సింది. దీంతో ఏమి సేతుర లింగా,అంటూ కమల దళం నేతలు తలలు పట్టుకున్నారు. ఇంతవరకు తిరుపతి నుంచి పోటీచేందుకు ఉత్సాహం చూపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ,జనసేన ముటమి నుంచి ఎవరు పోటీ చేసినా ఫలితం ఉండదని ముందుగానే గమనించి, గాలికి పోయే పేల పిండి రామర్పణం’అన్నట్లుగా తిరుపతిలో పోటీ చేసే అవకాశాన్ని ఉదారంగా బీజేపీకి ఇచ్చేశారు.  మరో వంక బీజేపీ నేతలు విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మింగలేక కక్కలేక బాధ పడుతున్నారు. ఈ నేపధ్యంలో శనివారం విజయవాడలో సమావేసమైన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో దేశవ్యాప్త విధానంలో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నామని పార్టీ  ఇంచార్జి  సునీల్‌ దేవ్‌ధర్‌’ విశాఖ ఉక్కు సమస్యను పలచనచేసే ప్రయత్నం చేశారు. అలాగే, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం విశాఖ ఉక్కు అంశాన్ని ముందు ఉంచి తెర వెనుక నిశ్శబ్దంగా  మతమార్పిడులు చేస్తోందని, అంటూ మళ్ళీ మత మార్పిడుల విషయాన్ని ముందుకు తెచ్చారు . అయితే విశాఖ ఉక్కు ఆందోళన విషయంలో ముందు నుంచి ముందున్న తెలుగు  దేశం పార్టీ. తిరుపతి ఉప ఎన్నికలో అదే ప్రధాన ఎన్నికల అంశం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్టుగానే  పార్లమెంట్ సాక్షిగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్రానిదే అయినా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే నిర్ణయం జరిగిందని తేలడంతో జోరు పెంచింది.వైసీపీ ని  ఉక్కు సంకెళ్ళతో బందించి తిరుపతి తీర్పుతో, విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా కాపాడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది . విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, శనివారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో,పార్టీలకతీతంగా అందరూ ఉద్యమించి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు అంశమే అజెండాగా స్వతంత్ర అభ్యర్ధిని బరిలో దించాలని సూచించారు.  మొత్తానికి తిరుపతి ఉప పోరుకు విశాఖ సెగ తప్పేలాలేదు.

కోవర్టులు.. కుట్రలు.. వేటు అందుకేనా? ఇంకా ఉన్నారా?

ప్రగతి భవన్ రహస్యాల నిలయం. సీఎం ఆఫీసూ, నివాసమూ కావడంతో బోలెడంత రాజకీయ హడావుడి. కీలక నిర్ణయాలు, వ్యూహాలు, వ్యవహారాలు.. అన్నిటికీ కేంద్రం. అందుకే, ఆ భవనం దాటి ముచ్చట బయటకు రానే రాదు. రాకూడదు. కానీ, అలా జరగడం లేదంటున్నారు. నమ్మినవారే కేసీఆర్ కు నమ్మకద్రోహం చేస్తున్నారట. పార్టీని చీల్చే ప్రయత్నాలు, అవినీతి మరకలు, రహస్యాలు లీక్ చేయడం.. ఇలా వరుస ఘటనలతో సీఎం కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని అంటున్నారు.  టిఆర్ఎస్ సీనియర్ నాయకుడొకరు సొంత కుంపటి పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ విషయం గులాబీ బాస్ కు తెలిసింది. అప్పటి నుంచి ఆ సీనియర్ ని చాలా దూరం పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఊసే లేకుండా చేశారు. ఆ నేతపై నిఘా పెట్టినప్పుడే.. ప్రగతి భవన్ లో ఇంటి దొంగల బండారం బయటపడినట్టు తెలుస్తోంది.  అందుకే, ఇటీవల ఓ ఉద్యోగిపై వేటు పడిందని చెబుతున్నారు. అసమ్మతి నాయకునితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఆ ఉద్యోగి కుట్ర చేశాడట.  సిఎంఓ నుంచి తీసేయబడిన ఉద్యోగి కొంతకాలంగా టీఆర్ఎస్ అసమ్మతి నాయకులతో టచ్‌లో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించారు. ప్రగతిభవన్‌లో జరుగుతున్న అంతర్గత చర్చలు, సమావేశాలు, నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఆ ఉద్యోగి అసమ్మతి నాయకుడికి చేరవేసేవాడట. ఆ ఇద్దరూ మరికొందరితో కలిసి పార్టీని చీల్చే కుట్ర చేశారని కేసీఆర్‌కు సమాచారం అందిందని.. అందుకే అతనిని సీఎంవో నుంచి తీసేశారని అంటున్నారు. సిఎంఓ మాజీ ఉద్యోగి పెద్ద ఎత్తున పైరవీలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలకు పాల్పడ్డాడని అధికారులు గుర్తించారని లీకులొస్తున్నాయి. బీనామీల పేరిట భారీగా ఆస్తులు కూడేశాడట. అతని రాసలీలల వ్యవహారాలపైనా సమాచారం ఉందట. ప్రగతిభవన్ లో దాగున్న మిగతా ద్రోహులనూ నిఘా నేత్రం వెంటాడుతోందని.. ఇప్పటికే ఫస్ట్ వికెట్ పడగా.. మరో ఇద్దరు, ముగ్గురు నెక్ట్స్ లిస్ట్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పనిలో పనిగా.. మంత్రి కేటీఆర్‌ టీమ్‌ పైనా సీఎం కేసీఆర్‌ నిఘా పెట్టినట్టు కొందరు అంటున్నారు. పార్టీలో, ప్రగతి భవన్ లో జరుగుతున్న కుట్రలు, కుతంత్రాల వల్లే కేటీఆర్ ను సీఎం చేసే ఆలోచనను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారని చెబుతున్నారు. ముందు ఇంటి దొంగల అంతు చూశాకే.. ఇక అంతా పర్‌ఫెక్ట్ అనుకున్నాకే.. చినబాస్ కు సీఎం కుర్సీపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. 

మరో వారసుడొచ్చాడు...  

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి,దివంగత కరుణానిధి, మనవడు ప్రస్తుత డిఎంకే అధ్యక్షడు, ప్రతిపక్ష నేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, తాత చెప్పుల్లో కాలుపెట్టారు. ఇప్పటికే సినిమా రంగంలో హీరోగా, నిర్మాతగా, రాజకీయంగా పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఉదయనిధి, తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు.ఇదేమీ అనూహ్యం కాదు, అలాని అనుకున్నదీ కాదు. కుటుంబ పార్టీలలో వారసులు వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం న్యాచురల్ అందులో విశేషం లేదు.  డిఎంకే పార్టీ  టికెట్ ఆశించేవారికి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తుంది.అలాగే,ఉదయనిధి కూడా ఇంటర్వ్యూకు హాజరయ్యారు.ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయ్యారని, ఇక ఆయనకు టికెట్ రాదని వార్తలొచ్చాయి. కానీ, తాజా కబర్’ ప్రకారం,ఆయనకు పార్టీ టికెట్ వచ్చింది. వడ్డించే వాడు మన వాడు అయితే  ఏ పంక్తిలో, ఏ మూలన కూర్చున్నా, లడ్డులూ, జిలేబీలు అడగకుండానే  నడుచుకుంటూ వచ్చేస్తాయి. పరీక్ష తప్పిన వారికీ కొలువులొచ్చేస్తాయి. అలాగే , ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయినా , దయానిధికి టికెట్ వచ్చింది.అది కూడా గతంలో పెద్దాయన, డిఎంకే అగ్రనేత  కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చంపాక్’ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అద్రుష్మ ఉదయనిథినిని వరించింది.  ఏప్రిల్ 6 న పోలింగ్ జరిగే రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా మరికిన్ని చిన్నా చితకా పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న డిఎంకే , పార్టీ పోటీ చేస్తున్న 173 నియోజక వర్గాల అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. అందులో ఉదయనిథి పేరుంది.దురై మురుగన్ వంటి కురు వృద్ధులు సహా  సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు 76 మందికి డిఎంకే టిక్కెట్లు ఇచ్చింది. కరుణానిధి చనిపోయిన తర్వాత , చంపక్ ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచిన  సిట్టింగ్ ఎమ్మెల్యే అంబజగన్, కరోనాతో కన్ను మూయడంతో, సునాయాసంగా గెలిచే చంపక్ సీటు ఉదయనిధికి దక్కింది.  తమిళనాడులో ఈసారి గెలిచేది డిఎంకేనే అని సర్వేలన్నీకోడై కూస్తున్నాయి. అదే జరిగి పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న డిఎంకే అధికార పగ్గాలు చేపడితే, కరుణానిధి మంత్రివర్గంలో స్టాలిన్, చంద్రబాబు కాబినెట్’లో లోకేష్ , కేసీఆర్ కాబినెట్’లో కేటీఆర్, ఉద్దవ్ మంత్రివర్గంలో ఆదిత్య థాక్రే ... లాగా స్టాలిన్ కాబినెట్’ ఉదయనిధి మంత్రి అవుతారు. ఆ తర్వాత అఖిలేష్ , ఒమర్ అబ్దుల్లా అదృష్టం  కలిసొస్తే ముఖ్యమంత్రి అవుతారు. కాదంటే కనీసం మాజీ మంత్రిగా అయిన మిగులుతారు. భవిష్యత్ ఊహాలను పక్కన పెట్టినా ప్రస్తుతానికి డిఎంకేకి వారసుడొచ్చాడు. అలా ఓపనైపోయింది

తిరుపతికి విశాఖ ఉక్కు సెగ?

ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉధ‌ృతంగా పోరాడుతున్నారు ప్రజలు. దర్నాలు, ర్యాలీలు, బంద్‌లతో హోరెత్తిస్తున్నారు. అయినా.. కేంద్రంలో కనీస స్పందన లేకపోగా.. వంద శాతం అమ్మి తీరుతామంటూ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఉద్యమకారులు రగిలిపోతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తమ సత్తా ఏంటో తెలిసొచ్చేలా చేయడానికి తిరుపతి ఎంపీ ఉప ఎన్నికను అస్త్రంగా మార్చుకునే ఆలోచనలో ఉన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటనతో ఆ విషయం వెల్లడైంది. తిరుపతి ఉపఎన్నికల్లో ఉద్యమం తరపున ఎంపీ అభ్యర్థిని నిలబెట్టే అంశంపై అఖిలపక్షంతో చర్చిస్తామని గంటా అనడం ఆసక్తికరంగా మారింది. అదే జరిగితే.. తిరుపతి బై పోల్ మరింత రంజుగా మారనుంది.  విశాఖ ఉక్కు కోసం రాజీనామాలు సంధించే సమయం ఆసన్నమందన్నారు గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు బాధ్యతను సీఎం జగన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ చొరవ తీసుకుంటే కలిసి నడుస్తానని చంద్రబాబు స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తే ఎలా పోరాడతాం అని వైసీపీ మంత్రులు అంటున్నారని...అయితే చివరి అస్త్రం రాజీనామాలు సంధించే సమయం ఆసన్నమైందని తెలిపారు.  పవన్ కల్యాణ్ ఉద్యమంలో నేరుగా పాల్గొంటే ఎక్కువ ప్రభావం ఉంటుందన్నారు గంటా. టీడీపీ, జనసేన, వామపక్షాలు అన్నీ విశాఖ ఉక్కు కోసం నిలబడ్డాయని చెప్పారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు అని,  అమ్మేస్తాం లేదా మూసేస్తాం అన్నట్లు కేంద్ర వైఖరి ఉందని మండిపడ్డారు.

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడంటే..

వస్తారా? రారా? ఇప్పుడే వస్తారా? భవిష్యత్‌లోనైనా వస్తారా? అసలు వస్తారా? జూనియర్ వస్తారా? రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తారా? చాలా ఏళ్లుగా అభిమానులను ఊరిస్తున్న ప్రశ్న ఇది. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ శ్రేణుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ కో్సం డిమాండ్ వినిపించింది. బాబు ర్యాలీలో.. ఎన్టీఆర్ ను మళ్లీ రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ నినాదాలు చేశారు తెలుగు తమ్ముళ్లు. అప్పటి నుంచీ జూనియర్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆ విషయంపై నేరుగా జూనియర్ నే ప్రశ్నించారు విలేకరులు. త్వరలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’కు ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండబోతున్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్. పొలిటికట్ ఎంట్రీ ఎప్పుడంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించగా ఎన్టీఆర్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. "ఈ ప్రశ్నను మీరు చాలా సందర్భాల్లో నన్ను అడిగారు. నేను చెప్పే సమాధానం ఏమిటో మీకు బాగా తెలుసు. ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు. తర్వాత తీరిగ్గా ఓరోజు కాఫీ తాగుతూ మనమే సరదాగా కబుర్లు చెప్పుకుందాం." అన్నారు ఎన్టీఆర్. పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నకు.. దాటవేసే ధోరణిలో సమాధానం చెప్పారు జూనియర్. అంతేకానీ, ఎక్కడా రాజకీయాల్లోకి రానని గానీ, తనకు ఆసక్తి లేదని గానీ అనలేదు. అలాగని.. వస్తానని కూడా చెప్పలేదు. సో, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావొచ్చు.. రాకపోవచ్చు.. ఏదైనా జరగొచ్చు అంటున్నారు అభిమానులు.

తిరుపతి బీజేపీ అభ్యర్థి అతనేనా?

తిరుపతి బరి నుంచి జనసేన తప్పుకుంది. బీజేపీ పోటీలో నిలిచింది. మరి, కమలం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఎవరు? ఇదే ఇప్పుడు ఆసక్తికరం. ఇన్నాళ్లూ జనసేనను ఒప్పించడంపైనే ద‌ృష్టి పెట్టగా.. ఇప్పుడిక కేండిడేట్ ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. జనసేన మద్దతుతో పోటీ చేస్తుండటంతో గెలుపుపై ఆశలు చిగురించాయి. తిరుపతి నుంచి గెలిచి ఏపీలో ఉనికి చాటుకోవాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. బలమైన అభ్యర్థి కోసం చర్చిస్తోంది. రేసులో నలుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు రిటైర్డ్ అధికారులతో పాటు ఓ స్థానిక నేత పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. రిటైర్డు ఐఏఎస్‌ అధికారులు రత్నప్రభ, దాసరి శ్రీనివాసులు, రిటైర్డు డీజీపీ కృష్ణప్రసాద్‌ లతో పాటు తిరుపతి బీజేపీ నేత మునిసుబ్రమణ్యంపై చర్చ జరుగుతోంది. విద్యా కేంద్రమైన తిరుపతిలో విద్యావంతులకు ప్రధాన్యం ఎక్కువ. తాజాగా బీజేపీ పరిశీలనలో ఉన్న నలుగురిలో ముగ్గురు రిటైర్డు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే కావడం ఆసక్తికరం.   దాసరి శ్రీనివాసులు పేరు మొదటి నుంచీ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత రత్నప్రభ, కృష్ణప్రసాద్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. రాజకీయాలకు కొత్త వాళ్లు కాకుండా.. స్థానికులకు సుపరిచితులైన వారిని ఎంపిక చేయాలనుకుంటే.. ఆ కోటాలో బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి ముని సుబ్రమణ్యం అందరికన్నా ముందున్నారు. మొత్తం 27మంది పేర్లను పరిశీలించగా.. చివరికి ఈ నలుగురు మిగిలారు. వీరిలో ఒకరు బీజేపీ ఎంపీ అభ్యర్థి కానున్నారు. మరి, ఈ నలుగురిలో ఆ ఒక్కరు ఎవరవుతారో?

మళ్ళీ ముంచుకొస్తున్న కరోనా... ఆరు రోజుల్లోనే లక్ష పాజిటివ్ కేసులు...

సరిగ్గా ఏడాది క్రితం కరోనా అంటే వణికే పరిస్థితి ఉండగా.. తాజాగా కరోనా అంటే దాందేముంది ఇలా వచ్చి అలా పోతుంది అన్నట్లుగా తయారైంది ప్రజల ధోరణి. అయితే తాజాగా నమోదవుతున్న కొత్త పాజిటివ్ కేసులతో ఈ మహమ్మారి దేశంలో మరోసారి విజృంభిస్తోంది. గడిచిన కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు ఒక్కసారిగా రోజుకు 25వేలకు దగ్గరగా నమోదవుతున్న పరిస్థితి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల పెరుగుదలకు ప్ర‌జ‌ల అజాగ్ర‌త్తతోపాటు ‌.. ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం కూడా ముఖ్య కారణమని నిపుణులు చెపుతున్నారు. గడచిన వారం రోజులుగా క‌రోనా వైర‌స్ కొత్త పాజిటివ్  కేసులు  మళ్ళీ రికార్డు సంఖ్యలో న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త‌గా 24,882 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య‌ 1,13,33,728కి పెరిగింది. ఇక క‌రోనా కార‌ణంగా నిన్న 140 మంది కన్ను మూశారు. దీంతో మొత్తం మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,58,446 కు చేరింది . ఇక గతేడాది డిసెంబర్ 20వ తేదీన‌ 26,624 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. ఆ త‌ర్వాత క్రమంగా కేసులు తగ్గుతూ వచ్చాయి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఇదే హయ్యెస్ట్ పాజిటివ్ కేసుల రికార్డ్. తాజాగా కేసులు పెరుగుతుండ‌టంతో దేశంలో యాక్టివ్ కేసులు కూడా మ‌ళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా  దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య‌ మళ్లీ 2లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,02,022 యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన ఆరు రోజుల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కొత్త కేసులు  లక్షకు చేరుకున్నాయి. అంతేకాకుండా ఈ కేసులు రోజురోజుకు పెరగటమే కానీ తగ్గని పరిస్థితి.నెలకొంది. అయితే దేశవ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికం కొన్ని రాష్ట్రాల్లోనే నమోదవడం గమనార్హం. తాజాగా దేశంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోనే కావడం గమనార్హం. నిన్న ఒక్కరోజులోనే మహారాష్ట్రలో 15,817 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే మహారాష్ట్రలో ఇంతలా కేసులు పెరగటానికి కారణం.. జనవరిలో జరిగిన పంచాయితీ ఎన్నికలు ఒక కారణం కాగా.. అక్కడ ఎన్నికల తరువాత జరిగిన  విజయోత్సవ వేడుకలు.. ఈ  తాజా దుస్థితికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కరోనా నిబంధనల్ని ఆ రాష్ట్ర ప్రజలు గాలికి వదిలి మాస్క్, సోషల్ డిస్టెన్స్ వదిలేయడంతో పరిష్టితులు మల్లె దారుణంగా తయారవుతున్నాయి. . మరోపక్క ప్రజలు కనుక అప్రమత్తంగా వ్యవహరించకపోతే భోపాల్, ఇండోర్ లలో కూడా  రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సాంగ్ చౌహన్ హచ్చరించారు.  ఇక తెలంగాణాలో ప్రతి రోజు తప్పనిసరిగా 50 వేల కరోనా టెస్టులు చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు.  

జగన్ ఆర్థిక ఉగ్రవాది.. వైసీపీ నేతలు సారా అమ్ముతున్నారు..

ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక ఉగ్రవాది. జిల్లాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా రాజ్యమేలుతోంది. వైసీపీ నేతలు సారా అమ్ముతున్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపుతున్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.  భారతదేశాన్ని అమ్మడమే మోదీ సిద్దాంతమని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైసీపీ ప్రభుత్వానికి ముందే తెలుసని గోరంట్ల అన్నారు. మాటలగారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని..రబీకి ముందస్తు ప్రణాళిక రూపొందించటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఏప్రిల్ 15 వరకు రబీకి ఉభయ గోదావరి జిల్లాలకు సాగు నీరు సరపరా చేయాలని డిమాండ్ చేశారు. 

స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్! పట్టభద్రుల ఓట్లు ఊరికే రావు..

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గంటల్లో కొచ్చింది.ఆదివారం పోలింగ్ జరుగుతుంది. అభ్యర్ధులు, పార్టీలు ఆఖరి ప్రయత్నాలలో మునిగి తేలుతున్నారు. ఓటర్లను  ప్రసన్నం చేసుకునేందుకు,ఎవరికి తోచిన రీతిలో వారు తమ శక్తి కొలది ఓటర్లను ‘సంతృప్తి’ పరిచే పనిలో పడ్డారు. ఓటర్లు అందరూ పట్టభద్రులే, అభ్యర్ధులు అందరూ పెద్దలే..పెద్దల సభ సభ్యులుగా గౌరవం కోరుకుంటున్న వారే..  అయినా లెక్క లెక్కే అన్నట్లుగా చేతులు చాస్తున్నారు. ఓట్లు ఉరికే రావు,అనే మాట ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఘనంగానే వినిపిస్తోంది.అభ్యర్ధుల ఆర్థిక స్తోమతను బట్టి ఓటర్లు రేటు ఫిక్స్ చేస్తునట్లు అభ్యర్ధుల తరపున ‘పని’ కానిస్తున్నవారు సైతం  ముక్కున వేలేసుకుంటున్నారు. ‘అన్ని కోట్లున్నాయి, ఇంకా అన్ని కోట్లు సంపాదించుకుంటారు, ఈ చిల్లర బేరాలేంటి, మా ఓటు కావాలంటే మేము అడిగిన మొత్తం ఇవ్వాలిసిందే, అంతకు తగ్గిదే కుదరదు’ అని కుండబద్దలు కొడుతున్నారు. అవీ ఇవని కాదు ,ఒక్కొక్క ఇంట్లో ఓట్ల సంఖ్యను బట్టి  సెల్ ఫోన్లు,స్మార్ట్ ఫోన్లు చివరికి లాప్ టాప్ ‘లు కూడా  ఓటర్లు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు.  రెండు నియోజక వర్గాల్లోనో ఓటర్ల సంఖ్య గణనీయంగా  పెరిగింది . సాధారణ బ్యాలెట్ పేపర్’లో పట్టనంత మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. అందుకే న్యూస్ పేపర్ సైజు బ్యాలెట్ పేపర్లను ముద్రించారు . హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గంలో 5.05 లక్షల మంది ఓటర్లున్నారు. ఏకంగా  71 మంది అభ్యర్ధులు తమ లక్ టెస్ట్ చేసుకుంటున్నారు. ఖమ్మం,వరంగల్ ,నల్గొండ  నియోజక వర్గంలో ఓటర్లు 5.31 లక్షలుంటే, అభ్యర్ధులు వందకు ఒకింత తక్కువగా 93మంది ఉన్నారు. ఓటర్లు, అభ్యర్ధుల సంఖ్యపెరగడంతో ప్రతి ఓటు కీలకంగా మారింది. అభ్యర్ధులు ప్రతి ఓటరును ముఖ్యంగా ,ముందుగానే ఆన్లైన్ పేమెంట్ జరిగిపోయిన ఓటర్లను పోలింగ్ బూత్ వచ్చి ఓటు వేసే వరకు నీడలా వెంటాడేందుకు   ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ బృందాలు, తమకు అప్పగించిన ప్రతి ఓటరు ఓటు వేసేవరకు ఫోన్ మీద టచ్’లో ఉంటారు అవసరం అయితే ఫిజికల్’గా ... ఏర్పాట్లు చేసుకున్నారు.  అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు పోలింగ్’కు ముందే ఫలితాల లెక్కలు వేసుకుంటున్నాయి. ఏది ఏమైనా ఈ ఎన్నికలలో గెలిచి తీరాలని ముఖ్యమంత్రి నుంచి  వచ్చిన ఆదేశాల మేరకు అధికార పార్టీ  బాధ్యులు , చివరి నిముషం వ్యూహాలకు పదును పెడుతున్నారు. హైదరాబాద్ నియోజక వర్గంలో  కొత్తగా నమోదైన ఓటర్లలో సుమారు 2 లక్షల మంది, తెరాస నాయకులు, కార్యకర్తల  కుటుంబ సభ్యులే ఉన్నారు. మా ఓట్లు మేము తెచ్చుకున్నా, మా అభ్యర్ధి వాణీ దేవి  సునాయాసంగా విజయం సాధింస్తారని,  తెరాస కీలక  నేత ఒకరు చెప్పారు. అలాగే ఖమ్మలో కూడా కొత్తగా నమోదైన ఓట్లలో ఎక్కువ తెరాస కుటుంబ ఓట్లే, సో.. రెండు నియోజక వర్గాలలోను తెరాస విజయం సాధిస్తుందని ఆ నేత ధీమా వ్యక్తం చేశారు. మరో వంక బీజీపీ హైదరాబాద్ సిట్టింగ్ సీటును నిలుపుకోవడంతో పాటుగా,ఖమ్మం సీటును కైవసం చేసుకుంటామని ధీమాగాఉంది.అయితే, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా అన్నిటికీ  మోడీ మంత్రాన్నే నమ్ముకున్న కమల దళం ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడవలసి వుంది. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు గట్టెక్కిస్తుందిని ఆశతో వుంది.  మరో వైపు  మొదటి ప్రాధాన్యత ఓటు మీ ఇష్టం రెండవ ప్రాధాన్యత ఓటు నా కివ్వండి’  అంటూ హైదరాబాద్’లో ప్రొఫెసర్ నాగేశ్వర, ఖమ్మంలో కోదండరామ్,సాగించిన వినూత్న ప్రచార వ్యూహం ఫలిస్తుందా అనేది కూడా ఆసక్తిని కలిగోస్తోంది. అదే విధంగా ప్రజలలో ‘ఎదిరించే గొంతుక’ గా పేరొందిన తీన్మార్ మల్లన్న సాగించిన సుదీర్గ ప్రచారం, ముఖ్యంగా పదవులతో పని లేకుండా  మీడియా ద్వారా ప్రజల గొంతు వినిపిస్తూ, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వైనం  ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఓటు తనకు అండగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. మొత్తానికి ఎవరికి వారు  ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఎవరి ఆశలు ఫలిస్తాయో, ఎవరిఆశలు అడియాసలు అవుతాయో ..17 న తేలిపోతుంది .  

హైదరాబాద్‌లో మళ్లీ రేవ్ పార్టీస్.. డ్రగ్స్..!

లాక్‌డౌన్ టైమ్ నుంచి సైలెంట్ అయిన రేవ్  పార్టీస్ మళ్లీ రెడీ అవుతున్నాయి. డ్రగ్స్ వాడకం కూడా పెరిగింది. ఇన్నాళ్లూ పబ్స్‌తో అడ్జస్ట్ అయిన జల్సారాయుళ్లు ఇప్పుడు రేవ్ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ శివారు రిసార్టుల్లో గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కొన్ని రేవ్ పార్టీల్లో డ్రగ్స్ యూజ్ చేస్తున్నట్టు తేల్చారు. ఇటీవల బయటపడిన సంస్థాన్‌ నారాయణపురం ఫాంహౌస్‌ రేవ్‌ పార్టీలో డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు వచ్చాయి. పబ్స్ నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ ఆర్డర్ చేశారు. శివారు ప్రాంతాల్లోని గెస్ట్‌హౌస్‌లు, రిస్టార్స్‌ టార్గెట్‌గా డ్రగ్స్‌ దందాకు పాల్పడినట్టు తెలుస్తోంది. గంజాయి, డ్రగ్స్ కోసం వాట్సాప్ గ్రూప్‌లలో చాటింగ్ చేసినట్టు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌లో పార్టీ వివరాలు పెడుతూ గ్యాంగ్‌లు ఆకర్షిస్తున్నారు. రేవ్ పార్టీ వ్యవహారం తర్వాత డ్రగ్స్ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు డ్రగ్స్ లింకులపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. నగరానికి ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి? ఎవరు, ఎలా తీసుకొస్తున్నారు? ఎవరెవరికి సప్లై చేస్తున్నారు? ఇలా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

విజయవాడ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్!

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. ఇది రొటీన్ న్యూస్. నౌ ప్లేస్ ఛేంజ్. విజయవాడ విమానాశ్రయంలో బంగారం పట్టివేత. ఇది లేటెస్ట్ న్యూస్. అవును, గోల్డ్ స్మగ్లర్లు రూటు మార్చినట్టున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు పెరగడం.. ఎంత జాగ్రత్తగా ఉన్నా దొరికిపోతుండటంతో కేటుగాళ్లు ఎయిర్ పోర్ట్ మార్చారు. తాజాగా, విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడినట్టు తెలుస్తోంది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిపై అనుమానంతో అతన్ని తనిఖీ చేయగా బంగారం దొరికినట్టు సమాచారం. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు పట్టుబడిన బంగారంపై ఆరా తీస్తున్నారట. పట్టుబడిన బంగారం ఎంత? ఎవరు, ఎవరి కోసం ఈ గోల్డ్ తీసుకొస్తున్నారు తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

వాలంటీర్ మర్డర్.. ఎందుకు చంపారంటే...

వాలంటీర్ శ్రీకాంత్ పొలం దగ్గర పడుకున్నాడు. అర్థరాత్రి గాఢ నిద్రలో ఉన్నాడు. సడెన్‌గా అతనిపై అటాక్ జరిగింది. గునపంతో పొడిచి దారుణంగా చంపేశారు దుండగులు. శ్రీకాంత్ స్పాట్‌లోనే చనిపోయాడు. వాలంటీర్ హత్య ఏపీలో కలకలం రేపింది. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జరిగిందీ మర్డర్. శివరాంపేటకు చెందిన వాలంటీర్ శ్రీకాంత్‌ను గుర్తు తెలియని వ్యక్తులు గునపంతో పొడిచి హత్య చేశారు. ఉదయం విషయం తెలీడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పొలంలో నిద్రిస్తున్నది శ్రీకాంత్ తండ్రి అనుకొని.. వాలంటీర్ శ్రీకాంత్ ను చంపారని అంటున్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది.