షర్మిలకు విజయమ్మ ఆల్ ది బెస్ట్
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పటి నుంచి ఆయన సతీమణి విజయమ్మ అనివార్యంగానే కావచ్చు, రాజకీయాలలో కీలక భూమికనే పోషిస్తూ వచ్చారు. పులివెందుల ఎమ్మెల్యేగా, ఆ తర్వాత జగన్ జైలుకు పోయిన సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, అత్యంత క్లిష్ట సమయంలో వైఎస్సార్ పార్టీని బతికించడంలో కీలక భూమికను పోషించారు. 2014 ఎన్నికలలో విశాఖ నుంచి పార్లమెంట్ కు పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా, పార్టీకి అధికారం దక్కకపోయినా ఆమె,ఆమెతో పాటుగా కుమార్తె షర్మిలా, జగన్’కు అండగా నిలిచారు.
2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయన వెంటే ఉన్నారు. ఇక ఆ తర్వాత, ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పినట్లుగా, ఇక తన అవసరం లేదని,రాజకీయ వేదిక నుంచి తప్పుకున్నారు. ఆతర్వాత ఆమె, ‘నాలో ... నాతో ...వైఎసార్’ పేరిట వైఎస్సార్ జీవిత చరిత్రని రాశారు. అనేక విషయాలను చెప్పారు. అందులో ప్రధానంగా ఆమె తమ ఇద్దరు పిల్లలు జగన్, షర్మిలలో వైఎస్సార్’కు షర్మిల అంటే కొంచెం ఎక్కువ ఇష్టమని, చెప్పారు. అలాగే, వైఎస్ మరణం తర్వాత జగన్ జైలుకు వెళ్ళిన సమయంలో కుటుంబ రాజకీయ వారసత్వాన్ని,పార్టీ మనుగడను నిలుపుకునేందుకు షర్మిలను పాదయాత్రకు పంపక తప్పలేదని బాధను వ్యక్తం చేశారు.
ఇక ప్రస్తుతానికి వస్తే షర్మిల అన్న జగన్ అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణలో పార్టీ పెట్టేందుకు, మరో పాద యాత్రకు సిద్దమవుతున్న సమయంలో విజయమ్మ ఎటు మొగ్గు చూపుతారు?షర్మిల రాజకీయ ప్రస్థానాన్ని ఏ మేరకు ఆమోదిస్తారు,ఎంతవరకు సహకరిస్తారు అన్నది, వైఎస్సార్ అభిమానుల్లో ఆసక్తిగా మారింది. జగన్ వేసిన ప్రతి అడుగులో ఆయనకు అన్ని విధాల సహకరించిన విజయమ్మ,షర్మిలకు అదే తరహ సహకారం,ఆశీస్సులు అందిస్తారా? అన్న ప్రశ్న చాలామందిలో వుంది.
షర్మిల నిర్వహిస్తున్న సమావేశాలు, జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో నివహిస్తున్నసమ్మేళనాలలో ప్రధాన భూమిక పోషిస్తున్న కొండ రాఘవ రెడ్డి మంగళవారం, వైఎస్ విజయమ్మను లోటస్ పాండ్ లో కలిశారు. సుమారు గంటన్నర సేపు ఆమెతో సమావేశమయ్యారు. విజయమ్మను మర్యాదపూర్వకంగానే కలిసానని రాఘవ రెడ్డి చెప్పారు. అయితే మర్యాదపూర్వక భేటీలో ఏమేమి మాట్లాడుకున్నారో ఏమో గానీ, దేవుడు అంతా మంచే చేస్తాడని ఆమె ఆశీర్వదించారని, రాఘవ రెడ్డి చెప్పారు. ఇంతకీ ఏమిటా మంచి? ఎవరికి మంఛి? ఏమో ..