తిరుపతి బీజేపీ అభ్యర్థి అతనేనా?
posted on Mar 13, 2021 @ 12:20PM
తిరుపతి బరి నుంచి జనసేన తప్పుకుంది. బీజేపీ పోటీలో నిలిచింది. మరి, కమలం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఎవరు? ఇదే ఇప్పుడు ఆసక్తికరం. ఇన్నాళ్లూ జనసేనను ఒప్పించడంపైనే దృష్టి పెట్టగా.. ఇప్పుడిక కేండిడేట్ ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. జనసేన మద్దతుతో పోటీ చేస్తుండటంతో గెలుపుపై ఆశలు చిగురించాయి. తిరుపతి నుంచి గెలిచి ఏపీలో ఉనికి చాటుకోవాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. బలమైన అభ్యర్థి కోసం చర్చిస్తోంది.
రేసులో నలుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు రిటైర్డ్ అధికారులతో పాటు ఓ స్థానిక నేత పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. రిటైర్డు ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, దాసరి శ్రీనివాసులు, రిటైర్డు డీజీపీ కృష్ణప్రసాద్ లతో పాటు తిరుపతి బీజేపీ నేత మునిసుబ్రమణ్యంపై చర్చ జరుగుతోంది. విద్యా కేంద్రమైన తిరుపతిలో విద్యావంతులకు ప్రధాన్యం ఎక్కువ. తాజాగా బీజేపీ పరిశీలనలో ఉన్న నలుగురిలో ముగ్గురు రిటైర్డు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కావడం ఆసక్తికరం.
దాసరి శ్రీనివాసులు పేరు మొదటి నుంచీ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత రత్నప్రభ, కృష్ణప్రసాద్ పేర్లు తెరపైకి వచ్చాయి. రాజకీయాలకు కొత్త వాళ్లు కాకుండా.. స్థానికులకు సుపరిచితులైన వారిని ఎంపిక చేయాలనుకుంటే.. ఆ కోటాలో బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి ముని సుబ్రమణ్యం అందరికన్నా ముందున్నారు. మొత్తం 27మంది పేర్లను పరిశీలించగా.. చివరికి ఈ నలుగురు మిగిలారు. వీరిలో ఒకరు బీజేపీ ఎంపీ అభ్యర్థి కానున్నారు. మరి, ఈ నలుగురిలో ఆ ఒక్కరు ఎవరవుతారో?