మళ్ళీ ముంచుకొస్తున్న కరోనా... ఆరు రోజుల్లోనే లక్ష పాజిటివ్ కేసులు...
posted on Mar 13, 2021 @ 11:59AM
సరిగ్గా ఏడాది క్రితం కరోనా అంటే వణికే పరిస్థితి ఉండగా.. తాజాగా కరోనా అంటే దాందేముంది ఇలా వచ్చి అలా పోతుంది అన్నట్లుగా తయారైంది ప్రజల ధోరణి. అయితే తాజాగా నమోదవుతున్న కొత్త పాజిటివ్ కేసులతో ఈ మహమ్మారి దేశంలో మరోసారి విజృంభిస్తోంది. గడిచిన కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు ఒక్కసారిగా రోజుకు 25వేలకు దగ్గరగా నమోదవుతున్న పరిస్థితి మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల పెరుగుదలకు ప్రజల అజాగ్రత్తతోపాటు .. ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా ముఖ్య కారణమని నిపుణులు చెపుతున్నారు. గడచిన వారం రోజులుగా కరోనా వైరస్ కొత్త పాజిటివ్ కేసులు మళ్ళీ రికార్డు సంఖ్యలో నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 24,882 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,13,33,728కి పెరిగింది. ఇక కరోనా కారణంగా నిన్న 140 మంది కన్ను మూశారు. దీంతో మొత్తం మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,58,446 కు చేరింది . ఇక గతేడాది డిసెంబర్ 20వ తేదీన 26,624 కరోనా కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుతూ వచ్చాయి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఇదే హయ్యెస్ట్ పాజిటివ్ కేసుల రికార్డ్. తాజాగా కేసులు పెరుగుతుండటంతో దేశంలో యాక్టివ్ కేసులు కూడా మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ 2లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,02,022 యాక్టివ్ కేసులున్నాయి.
గడిచిన ఆరు రోజుల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కొత్త కేసులు లక్షకు చేరుకున్నాయి. అంతేకాకుండా ఈ కేసులు రోజురోజుకు పెరగటమే కానీ తగ్గని పరిస్థితి.నెలకొంది. అయితే దేశవ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికం కొన్ని రాష్ట్రాల్లోనే నమోదవడం గమనార్హం. తాజాగా దేశంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోనే కావడం గమనార్హం. నిన్న ఒక్కరోజులోనే మహారాష్ట్రలో 15,817 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే మహారాష్ట్రలో ఇంతలా కేసులు పెరగటానికి కారణం.. జనవరిలో జరిగిన పంచాయితీ ఎన్నికలు ఒక కారణం కాగా.. అక్కడ ఎన్నికల తరువాత జరిగిన విజయోత్సవ వేడుకలు.. ఈ తాజా దుస్థితికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కరోనా నిబంధనల్ని ఆ రాష్ట్ర ప్రజలు గాలికి వదిలి మాస్క్, సోషల్ డిస్టెన్స్ వదిలేయడంతో పరిష్టితులు మల్లె దారుణంగా తయారవుతున్నాయి. .
మరోపక్క ప్రజలు కనుక అప్రమత్తంగా వ్యవహరించకపోతే భోపాల్, ఇండోర్ లలో కూడా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సాంగ్ చౌహన్ హచ్చరించారు. ఇక తెలంగాణాలో ప్రతి రోజు తప్పనిసరిగా 50 వేల కరోనా టెస్టులు చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు.