స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్! పట్టభద్రుల ఓట్లు ఊరికే రావు..
posted on Mar 13, 2021 @ 11:40AM
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గంటల్లో కొచ్చింది.ఆదివారం పోలింగ్ జరుగుతుంది. అభ్యర్ధులు, పార్టీలు ఆఖరి ప్రయత్నాలలో మునిగి తేలుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు,ఎవరికి తోచిన రీతిలో వారు తమ శక్తి కొలది ఓటర్లను ‘సంతృప్తి’ పరిచే పనిలో పడ్డారు. ఓటర్లు అందరూ పట్టభద్రులే, అభ్యర్ధులు అందరూ పెద్దలే..పెద్దల సభ సభ్యులుగా గౌరవం కోరుకుంటున్న వారే.. అయినా లెక్క లెక్కే అన్నట్లుగా చేతులు చాస్తున్నారు.
ఓట్లు ఉరికే రావు,అనే మాట ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఘనంగానే వినిపిస్తోంది.అభ్యర్ధుల ఆర్థిక స్తోమతను బట్టి ఓటర్లు రేటు ఫిక్స్ చేస్తునట్లు అభ్యర్ధుల తరపున ‘పని’ కానిస్తున్నవారు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ‘అన్ని కోట్లున్నాయి, ఇంకా అన్ని కోట్లు సంపాదించుకుంటారు, ఈ చిల్లర బేరాలేంటి, మా ఓటు కావాలంటే మేము అడిగిన మొత్తం ఇవ్వాలిసిందే, అంతకు తగ్గిదే కుదరదు’ అని కుండబద్దలు కొడుతున్నారు. అవీ ఇవని కాదు ,ఒక్కొక్క ఇంట్లో ఓట్ల సంఖ్యను బట్టి సెల్ ఫోన్లు,స్మార్ట్ ఫోన్లు చివరికి లాప్ టాప్ ‘లు కూడా ఓటర్లు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు.
రెండు నియోజక వర్గాల్లోనో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది . సాధారణ బ్యాలెట్ పేపర్’లో పట్టనంత మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. అందుకే న్యూస్ పేపర్ సైజు బ్యాలెట్ పేపర్లను ముద్రించారు . హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గంలో 5.05 లక్షల మంది ఓటర్లున్నారు. ఏకంగా 71 మంది అభ్యర్ధులు తమ లక్ టెస్ట్ చేసుకుంటున్నారు. ఖమ్మం,వరంగల్ ,నల్గొండ నియోజక వర్గంలో ఓటర్లు 5.31 లక్షలుంటే, అభ్యర్ధులు వందకు ఒకింత తక్కువగా 93మంది ఉన్నారు. ఓటర్లు, అభ్యర్ధుల సంఖ్యపెరగడంతో ప్రతి ఓటు కీలకంగా మారింది. అభ్యర్ధులు ప్రతి ఓటరును ముఖ్యంగా ,ముందుగానే ఆన్లైన్ పేమెంట్ జరిగిపోయిన ఓటర్లను పోలింగ్ బూత్ వచ్చి ఓటు వేసే వరకు నీడలా వెంటాడేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ బృందాలు, తమకు అప్పగించిన ప్రతి ఓటరు ఓటు వేసేవరకు ఫోన్ మీద టచ్’లో ఉంటారు అవసరం అయితే ఫిజికల్’గా ... ఏర్పాట్లు చేసుకున్నారు.
అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు పోలింగ్’కు ముందే ఫలితాల లెక్కలు వేసుకుంటున్నాయి. ఏది ఏమైనా ఈ ఎన్నికలలో గెలిచి తీరాలని ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అధికార పార్టీ బాధ్యులు , చివరి నిముషం వ్యూహాలకు పదును పెడుతున్నారు. హైదరాబాద్ నియోజక వర్గంలో కొత్తగా నమోదైన ఓటర్లలో సుమారు 2 లక్షల మంది, తెరాస నాయకులు, కార్యకర్తల కుటుంబ సభ్యులే ఉన్నారు. మా ఓట్లు మేము తెచ్చుకున్నా, మా అభ్యర్ధి వాణీ దేవి సునాయాసంగా విజయం సాధింస్తారని, తెరాస కీలక నేత ఒకరు చెప్పారు. అలాగే ఖమ్మలో కూడా కొత్తగా నమోదైన ఓట్లలో ఎక్కువ తెరాస కుటుంబ ఓట్లే, సో.. రెండు నియోజక వర్గాలలోను తెరాస విజయం సాధిస్తుందని ఆ నేత ధీమా వ్యక్తం చేశారు. మరో వంక బీజీపీ హైదరాబాద్ సిట్టింగ్ సీటును నిలుపుకోవడంతో పాటుగా,ఖమ్మం సీటును కైవసం చేసుకుంటామని ధీమాగాఉంది.అయితే, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా అన్నిటికీ మోడీ మంత్రాన్నే నమ్ముకున్న కమల దళం ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడవలసి వుంది. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు గట్టెక్కిస్తుందిని ఆశతో వుంది.
మరో వైపు మొదటి ప్రాధాన్యత ఓటు మీ ఇష్టం రెండవ ప్రాధాన్యత ఓటు నా కివ్వండి’ అంటూ హైదరాబాద్’లో ప్రొఫెసర్ నాగేశ్వర, ఖమ్మంలో కోదండరామ్,సాగించిన వినూత్న ప్రచార వ్యూహం ఫలిస్తుందా అనేది కూడా ఆసక్తిని కలిగోస్తోంది. అదే విధంగా ప్రజలలో ‘ఎదిరించే గొంతుక’ గా పేరొందిన తీన్మార్ మల్లన్న సాగించిన సుదీర్గ ప్రచారం, ముఖ్యంగా పదవులతో పని లేకుండా మీడియా ద్వారా ప్రజల గొంతు వినిపిస్తూ, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వైనం ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఓటు తనకు అండగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. మొత్తానికి ఎవరికి వారు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఎవరి ఆశలు ఫలిస్తాయో, ఎవరిఆశలు అడియాసలు అవుతాయో ..17 న తేలిపోతుంది .