కలెక్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే చిందులు
posted on Mar 13, 2021 @ 6:33PM
ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే.. ఇంకేం బరి తెగించారు.. జిల్లా కలెక్టర్ పై విరుచుకుపడ్డారు. వ్యక్తిగతంగా దూషించారు. అతి చేస్తున్నాడంటూ చిందులేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ చంద్రుడు ఇగోయిస్టు అంటూ ధ్వజమెత్తారు. గంధం చంద్రుడు ఇవాళ ఉండి రేపు పోతాడని, ఎవడిని నాశనం చేయడానికి గంధం చంద్రుడు పుట్టాడంటూ చిందులేశారు.
పత్రికల్లో హనీట్రాప్ రాకపోతే ఎప్పుడో పోయేవాడని చెప్పారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. కలెక్టర్ కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జిల్లా మేజిస్ట్రేట్ అయితే చంపేస్తావా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలం గాడిదలు కాయడానికి ఉన్నామా?.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్ లెక్కచేయట్లేదని విమర్శించారు. సీఎంవో, మంత్రులకు కలెక్టర్ రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారని, కలెక్టర్ చేసిన పనికిమాలిన పనులు చెప్పాలంటే పేజీలు చాలవని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు.
తాడిమర్రి మండలం చిల్లవారిపల్లెలో కాటకోటేశ్వరస్వామి ఉత్సవాలను ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తారు. అయితే కడప జిల్లా పులివెందుల మండలం అంకేపల్లి, చిల్లవారిపల్లె గ్రామాల మధ్య ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో వివాదం చోటుచేసుకుంది. ఊరేగింపు విషయం రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించండం మంచిది కాదని, ఉత్సవ విగ్రహాలు ఊరిగించవద్దని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలిచ్చారు. అయినా
గ్రామంలో కాటకోటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మొదలు పెట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్వామి ఊరేగింపు చేయరాదంటూ అడ్డుకున్నారు. గ్రామంలోని ఆలయానికి తలుపులు వేయాలంటూ ఆదేశాలు ఇవ్వటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఊరేగింపు సమయానికి అక్కడికి చేరుకున్న డీసీఎంఎస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, మండల నాయకులు అశ్వత్థ, భాస్కర్‌రెడ్డి.. గ్రామస్థులకు నచ్చజెప్పి పంపారు. గుడి తలుపులు మూయటంతో మనస్తాపం చెందిన ఆలయ పూజారి సోదరుడు రామేశ్వరరెడ్డి, ధర్మకర్త సోదరుడు బాలిరెడ్డి పురుగుల మందు తాగారు. తమ గ్రామంలో ప్రశాంతంగా ఊరేగింపు నిర్వహిస్తుంటే ఎందుకు అడ్డుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల మందు తాగిన వారిని మొదట నార్పలకు, అక్కడి నుంచి అనంతపురం వైద్యశాలకు తరలించారు.