జగన్ ఆర్థిక ఉగ్రవాది.. వైసీపీ నేతలు సారా అమ్ముతున్నారు..
posted on Mar 13, 2021 @ 11:43AM
ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక ఉగ్రవాది. జిల్లాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా రాజ్యమేలుతోంది. వైసీపీ నేతలు సారా అమ్ముతున్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపుతున్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
భారతదేశాన్ని అమ్మడమే మోదీ సిద్దాంతమని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైసీపీ ప్రభుత్వానికి ముందే తెలుసని గోరంట్ల అన్నారు. మాటలగారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని..రబీకి ముందస్తు ప్రణాళిక రూపొందించటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఏప్రిల్ 15 వరకు రబీకి ఉభయ గోదావరి జిల్లాలకు సాగు నీరు సరపరా చేయాలని డిమాండ్ చేశారు.