మమత డ్రామాలో మరో డ్రామా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిగ్రామ్ లో పర్యటిస్తున్న మమతపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన ఆమె కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఎడమ కాలు, నడుము, భుజం, మెడ తదితర భాగాల్లో గాయాలైనట్టు వైద్యులు చెబుతున్నారు. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారనీ.. తనను నెట్టివేసి కారు డోరు బలంగా విసరడంతో గాయాలయ్యాయంటూ మమతా దీదీ ఆరోపించారు.
నిజానికి ముఖ్యమత్రి పై దాడి జరగడం అంటే అది మాములు విషయం కాదు. అందునా ఎన్నికల వేడి ఇంకా పూర్తిగా రాజుకోక ముందే ఏకంగా ముఖ్యమంత్రి పై దాడి జరిగిందంటే ఎనిమిది విడతల్లో సుదీర్ఘంగా సుమారు రెండు నెలల పాటు సాగే ఎన్నికల క్రతువులో ఇంకెన్ని నేరాలు ఘోరాలు జరుగుతాయో అన్న సామాన్యులలో ఆందోళన కలగడం సహజం.
ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్ధులు సహా ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్ధులు, ప్రచారంలో పాల్గొనే నాయకులకు రక్షణ కలిపించవలసిన బాధ్యత ఎన్నికల సంఘం పై ఉంటుంది. మమతా బెనర్జీ చేసిన ఫిర్యాదును బట్టి చూస్తే, ఆమెకు భద్రత కల్పించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని అనిపిస్తుంది. ఈ నేపధ్యంలోనే, ఇటు తృణమూల్ కాంగ్రెస్, అటు బీజేపీ కూడా ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ అయితే ఈ ఘటనకు సంబందించిన సీసీ కెమెరాల ఫూటేజిని విడుదలచేయాలని కోరడంతో పాటుగా, నిజానిజాలు అందరికీ తెలిసేలా విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అయితే ఏకంగా సిబిఐ విచారణ డిమాండ్ చేశారు.
మరో వంక తృణమూల్ నాయకులు కార్యకర్తలు, రాష్ట్రం అంతటా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ, బీపేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రైళ్లను అడ్డుకున్నారు . ఈమొత్తం వ్యవహారానికి కొసమెరుపు ఏంటంటే.. గాయపడిన దీదీని పరామర్శించడానికి బీజేపే నాయకులు అసుపత్రికి వెళ్లారు. అయితే, వైద్యులు అందుకు అనుమతించలేదు అనుకోండి.అయినా, వారు తమ విచారణ వ్యక్తం చేసి, ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతునికి ఓ అర్జీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
దీదీ పై దాడి, కొందరు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా తృణమూల్ ఆడిన డ్రామా అనుకుంటే, బీజేపీ నాయకులు ఇచ్చిన ట్విస్ట్..డ్రామాలో డ్రామా ..మరీ బాగుంది.