కోవర్టులు.. కుట్రలు.. వేటు అందుకేనా? ఇంకా ఉన్నారా?
posted on Mar 13, 2021 @ 2:38PM
ప్రగతి భవన్ రహస్యాల నిలయం. సీఎం ఆఫీసూ, నివాసమూ కావడంతో బోలెడంత రాజకీయ హడావుడి. కీలక నిర్ణయాలు, వ్యూహాలు, వ్యవహారాలు.. అన్నిటికీ కేంద్రం. అందుకే, ఆ భవనం దాటి ముచ్చట బయటకు రానే రాదు. రాకూడదు. కానీ, అలా జరగడం లేదంటున్నారు. నమ్మినవారే కేసీఆర్ కు నమ్మకద్రోహం చేస్తున్నారట. పార్టీని చీల్చే ప్రయత్నాలు, అవినీతి మరకలు, రహస్యాలు లీక్ చేయడం.. ఇలా వరుస ఘటనలతో సీఎం కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని అంటున్నారు.
టిఆర్ఎస్ సీనియర్ నాయకుడొకరు సొంత కుంపటి పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ విషయం గులాబీ బాస్ కు తెలిసింది. అప్పటి నుంచి ఆ సీనియర్ ని చాలా దూరం పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఊసే లేకుండా చేశారు. ఆ నేతపై నిఘా పెట్టినప్పుడే.. ప్రగతి భవన్ లో ఇంటి దొంగల బండారం బయటపడినట్టు తెలుస్తోంది. అందుకే, ఇటీవల ఓ ఉద్యోగిపై వేటు పడిందని చెబుతున్నారు. అసమ్మతి నాయకునితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఆ ఉద్యోగి కుట్ర చేశాడట.
సిఎంఓ నుంచి తీసేయబడిన ఉద్యోగి కొంతకాలంగా టీఆర్ఎస్ అసమ్మతి నాయకులతో టచ్‌లో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించారు. ప్రగతిభవన్‌లో జరుగుతున్న అంతర్గత చర్చలు, సమావేశాలు, నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఆ ఉద్యోగి అసమ్మతి నాయకుడికి చేరవేసేవాడట. ఆ ఇద్దరూ మరికొందరితో కలిసి పార్టీని చీల్చే కుట్ర చేశారని కేసీఆర్‌కు సమాచారం అందిందని.. అందుకే అతనిని సీఎంవో నుంచి తీసేశారని అంటున్నారు. సిఎంఓ మాజీ ఉద్యోగి పెద్ద ఎత్తున పైరవీలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలకు పాల్పడ్డాడని అధికారులు గుర్తించారని లీకులొస్తున్నాయి. బీనామీల పేరిట భారీగా ఆస్తులు కూడేశాడట. అతని రాసలీలల వ్యవహారాలపైనా సమాచారం ఉందట.
ప్రగతిభవన్ లో దాగున్న మిగతా ద్రోహులనూ నిఘా నేత్రం వెంటాడుతోందని.. ఇప్పటికే ఫస్ట్ వికెట్ పడగా.. మరో ఇద్దరు, ముగ్గురు నెక్ట్స్ లిస్ట్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పనిలో పనిగా.. మంత్రి కేటీఆర్ టీమ్ పైనా సీఎం కేసీఆర్ నిఘా పెట్టినట్టు కొందరు అంటున్నారు. పార్టీలో, ప్రగతి భవన్ లో జరుగుతున్న కుట్రలు, కుతంత్రాల వల్లే కేటీఆర్ ను సీఎం చేసే ఆలోచనను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారని చెబుతున్నారు. ముందు ఇంటి దొంగల అంతు చూశాకే.. ఇక అంతా పర్‌ఫెక్ట్ అనుకున్నాకే.. చినబాస్ కు సీఎం కుర్సీపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.