రాజస్థాన్ లో మృగాడికి మరణ శిక్ష.. మరీ తెలంగాణలో ..
posted on Mar 18, 2021 @ 7:38PM
రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఒక ఐదేళ్ల బాలికపై, ఓ మృగాడు అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఫిబ్రవరి 19న జరిగింది.ఇంకా నిండా నెలరోజులు కాలేదు, అయినా, చేసిన ప్రత్యేక పోక్సో కోర్టు ఆ కామాంధుడికి మరణశిక్ష విధించింది. వివరాలోకి వెళితే సరిగ్గా 26 రోజుల క్రితం తన ఇంటికి దగ్గరలోని పొలంలో ఆడుకుంటున్న చిన్నారిని, చూసిన ఒక 21 ఏళ్ల యువకుడు ఆ పాపను కిడ్నాప్ చేశాడు. ఆమెపై బలాత్కారం చేశాడు. ఈ దారుణం ఫిబ్రవరి 19న జరిగింది. ఆ తర్వాత అటుగా వచ్చిన కొందరు స్థానికులు తీవ్రంగా గాయపడి ఒక నిర్జన ప్రదేశంలో పడి ఉన్న ఆ పాపను చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసుపై విచారణ చేసిన ప్రత్యేక పోక్సో కోర్టు నిందితుడికి మరణశిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది.
బంగారు తెలంగాణ వైపు వడి వడిగా అడుగులు వేస్తున్న తెలంగాణలో ... మత కలహాలకు మరు పేరుగా మారిన భైంసాలో .. నాలుగేళ్ళ చిన్నారిపై, తెలంగాణ మృగాడు అత్యాచారం చేశాడు. ఇది జరిగి వారం రోజుల పైగానే అయింది. అయినా ఇంతవరకు ప్రభుత్వం పెదవి విప్పలేదు. పోలీసులు దర్యాప్తు ఒక కొలిక్కిరాలేదు. కేసు నమోదు చేయడానికే వరం రోజులకు పైగా తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, పూర్తి ఆధారాలు సేకరించామని, దోషికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు, చెపుతూనే ఉన్నారు. కానీ, కదలిక లేదు.
ప్రభుత్వ స్పందన కోసం బీజేపీ గురువారం ధర్నా చేసింది. ఈ ధర్నాలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చిన్నారిపై లైంగిక దాడి చేస్తే ప్రభుత్వం నోరు మూగపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకూ స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. తమ బిడ్డపై అఘాయిత్యం జరిగిందని ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు పోతే...ఇక్కడ గొడవలు ఉన్నాయని పోలీసులు బాధితుల నోరు మూయించడం దారుణమని డీకే అరుణ పేర్కొన్నారు.
అక్కడ రాజస్థాన్’లో మృగాళ్ల కు నెల రోజుల్లో శిక్ష పడుతుంది .. ఇక్కడ రోజులు గడుస్తాయి అయిన కేసులు కదలవు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ బంగారు తెలంగాణ కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న తెరాస ప్రభుత్వం ఉంది..అదే అక్కడికీ ఇక్కడికీ ఉన్న తేడా..