మల్లన్నా.. నువ్ తోపన్నా..
posted on Mar 19, 2021 @ 11:23AM
వరంగల్, ఖమ్మం, నల్గొండ.. జిల్లా ఏదైనా మల్లన్న తోపు. మాములు తోపు కాదు తోపులకే తోపు. అవును, ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చూస్తుంటే వారెవా మల్లన్న అనకుండా ఉండలేరు ఎవరు. ఫలితాలు అలా వస్తున్నాయి మరి. పార్టీ లేదు, కేడర్ లేదు, గ్రూపులు లేవు, గూడుపుఠానీలు లేవు. ఉన్నదల్లా ఒక్క యూట్యూబ్ ఛానల్ మాత్రమే. కామన్‌మేన్‌లా సింగిల్‌గా వచ్చాడు. సింహంలా గాండ్రించాడు. పులిలా పంజా విసిరాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుమ్ము రేపుతున్నాడు. ఆయన గెలుపు ఖరారు కాకున్నా.. అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. జాతీయ పార్టీగా విర్రవీగుతున్నా బీజేపీకి గట్టి ఝలక్ ఇచ్చాడు. ఇక, కోదండరాం సార్‌కు సైతం షాక్. ఈ ఒక్క మగాడు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొనగాడిలా నిలిచాడు.
సర్కారును ఎప్పటికప్పుడు చీల్చి చెండాడమే అతని పని. యూట్యూబ్ ఛానెల్‌లో రోజూ అధికార పార్టీని ప్రశ్నించడమే. నేతల తీరును నిప్పులతో కడిగి నిగ్గదీసి అడగడమే. జెండా లేకున్నా ఎజెండా మాత్రం క్లియర్. అది.. కేసీఆర్‌పై దండయాత్ర. రేవంత్‌రెడ్డి తర్వాత ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో కడిగేసే ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్నే. అదే జనాలకు నచ్చింది. ఆ దూకుడే వారిని ఆకట్టుకుంది. ఆ దమ్ము.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుమ్ము రేపుతోంది.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలా బలం, బలగం మెండు. టీఆర్‌ఎస్ చేతిలో అధికారం ఫుల్లు. అయితే, ఆ పార్టీలకు సాధ్యంకానిది సామాన్యుడైన మల్లన్నకు సాధ్యమైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 83,290 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అధికార పార్టీకి చెందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి కంటే జస్ట్ 27,550 ఓట్లు మాత్రమే వెనకంజ. ఉద్యమ కాలం నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్న కోదండరాం సార్ కంటే 13వేల ఆధిక్యం సంపాదించాడు. ఇక, తనంత తోపులు లేరంటూ టెంపర్ మీదున్న బీజేపీ అభ్యర్థి ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. బీజేపీ కేండిడేట్ ప్రేమేందర్‌రెడ్డి కంటే రెట్టింపు ఓట్లు మల్లన్నకే పడ్డటం మామూలు విషయం కాదు. అటు, కాంగ్రెస్ అభ్యర్ధి ఐదో స్థానానికి పరిమితమయ్యారు. మామూలు మనిషి మల్లన్న.. ఇంతటి హేమాహేమీలను పడగొట్టడం మామూలు విషయం కాదు. ఇది మల్లన్నకే సాధ్యం.
ఎమ్మెల్సీగా మల్లన్న గెలుస్తాడా? లేదా? అనేది ఆసక్తికర విషయం. మల్లన్న గెలిచినా గ్రేటే.. ఓడినా గ్రేటే. సింగిల్‌గా.. సామాన్యుడిగా.. అంత పెద్ద పార్టీలకు.. అంత పెద్ద నేతలకు.. ముచ్చెమటలు పట్టించడం నిజంగా గ్రేటాది గ్రేట్. మల్లన్నా మజాకా...