వైసీపీలోకి జేసీ బ్రదర్స్! జగన్‌కు జై కొట్టిన ప్రభాకర్‌రెడ్డి..
posted on Mar 18, 2021 @ 4:42PM
జేసీ బ్రదర్స్. నిప్పులాంటి నాయకులు. ఎవరికీ తలొంచరు. మాటలు తూటాల్లా వదులుతారు. కడుపులో ఉన్నది ఉన్నట్టు బయటకు అనేస్తారు. వారి నోటి నుంచి ఒక మాటొస్తే.. అది వారి మనసు నుంచి వచ్చినట్టే. తాడిపత్రిలో తిరుగులేని నేతలు. లేటెస్ట్‌గా మున్సిపల్ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికై తాడిపత్రిలో తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఛైర్మన్ అయిన వెంటనే జగన్‌కు జై కొట్టి మరింత సంచలనంగా నిలిచారు.
జేసీ బ్రదర్స్ అంత ఈజీగా మరొకరికి జై కొట్టరు. వాళ్లు నిజంగా అభిమానిస్తేనే.. అతను తమ వాడని అనుకుంటేనే.. బయటకు ప్రకటిస్తారు. తాడిపత్రిలో అదే జరిగిందంటున్నారు. తాను మున్సిపల్ ఛైర్మన్ కావడానికి జగన్ హెల్ప్ చేశాడని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జగన్ తలుచుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను మున్సిపల్ ఛైర్మన్ అయ్యే పరిస్థితి లేదన్నారు. తాడిపత్రి అభివృద్ధి కోసం సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణను కలుస్తానని తెలిపారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి లేఖలు రాస్తానని అన్నారు. తాడిపత్రిలో రౌడీయిజం, గుండాయిజం ఇక ఉండదన్నారు.
నిన్నటి దాకా జగన్ అంటే ఒంటి కాలిపై లేచిన జేసీ ప్రభాకర్‌రెడ్డి సడెన్‌గా సీఎం జగన్‌ను పొగడటం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ కేసులు మీద కేసులు ఎదుర్కొని, జైలుకూ వెళ్లొచ్చి.. జగన్‌ను ఢీకొట్టి తాడిపత్రి మున్సిపాలిటీ దక్కించుకొని.. కొదమసింహంలా నిలిచిన జేసీ ప్రభాకర్‌రెడ్డిలో సడెన్‌గా ఈ మార్పు ఏంటని అంతా చర్చించుకుంటున్నారు.
సీఎం జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసించారు జేసీ. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగానే.. ఆయనలో కూడా విలువలు ఉన్నాయన్నారు. ఆ విషయాన్ని తాను ఈరోజు స్పష్టంగా గమనించాన్నారు. త్వరలో సీఎం జగన్‌ని కలుస్తానని, తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య తో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఛైర్మన్ అయిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వరం మార్చడం వెనుక వేరే కారణాలు ఉన్నాయి అంటున్నారు. జేసీ సోదరులను కేసులు వెంటాడుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా.. ఎన్నికలు ఏవైనా వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో టీడీపీ నుంచి అండ ఉన్నా లాభం లేదని జేసీ బ్రదర్స్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జగన్ కు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడి.. కష్టాలు తెచ్చుకోవడం కంటే.. సర్దుకుపోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారంటున్నారు.
ఇక తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, జేసీ ఫ్యామిలీకి ఇటీవలే పెద్ద ఎత్తున చిన్నపాటి యుద్ధమే జరిగింది. జేసీ ఇంటికొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు పెద్దారెడ్డి. అలాంటి పెద్దారెడ్డితో సయోథ్యకు సైతం సై అంటున్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఆత్మాభిమానానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి జేసీ బ్రదర్స్‌లో ఒక్కసారిగా ఇలాంటి మార్పు రావడం వారు పార్టీ మారుతున్నారనటానికి సంకేతం అంటున్నారు. మరోవైపు, రాష్ట్రమంతా గెలిచాం కదా ఒక్క తాడిపత్రి పోతే ఏంటి అన్నట్టు మాట్లాడారు మంత్రి బొత్స. అంటే, వైసీపీ నుంచి సైతం వీరికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనని అంటున్నారు. సీఎం జగనే తన గెలుపునకు సహకరించారని స్వయంగా జేసీ ప్రభాకర్‌రెడ్డే చెబుతుంటే.. ఇక ఇంతకంటే వేరే ఆధారం ఇంకేం కావాలంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు, జేసీ ప్రభాకర్‌రెడ్డి మాటలు చూస్తుంటే.. త్వరలోనే జేసీ బ్రదర్స్ టీడీపీ వీడి వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.