అసలు ఇవి గ్రాడ్యుయేట్లు వేసిన వోట్లేనా...?
posted on Mar 18, 2021 @ 4:42PM
తెలంగాణాలో నిన్న ఉదయం మొదలైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది. జంబో బ్యాలెట్ వల్ల ఒక్కో రౌండ్ ఫలితాల ప్రకటన ఆలస్యం అవుతోంది..మరోపక్క మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరూ గెలిచే అవకాశం కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా పూర్తైతే కానీ.. ఇందులో ఎవరు నెగ్గుతారు అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
.
ఇది ఇలా ఉండగా నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ సీటు లో ఇప్పటివరకు మొదటి మూడు రౌండ్ల లెక్కింపు పూర్తైంది. దీనిలో భగంగా లక్ష యాభై వేలకు పైగా ఓట్ల లెక్కింపు జరగగా … అందులో 9252 ఓట్లు చెల్లవని అధికారులు ప్రకటించారు. దాదాపు ప్రతి రౌండ్ లోనూ 3వేలకు పైగా ఓట్లు చెల్లని పరిస్థితి నెలకొంది .ఇక ఇటు హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి గ్రాడ్యుయేట్ స్థానం లో ఇప్పటివరకు రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఇక్కడ ఒక లక్ష ఇరవై వేల ఓట్లు లెక్కించగా.. అందులో 6400కు పైగా ఓట్లు చెల్లకుండా పోయాయి. అంటే ప్రతి రౌండ్ లో ఇక్కడ కూడా 3వేలకు పైగానే ఓట్లు చెల్లకుండా పోయాయి.
ఈ ఓట్లను కనుక పరిశీలిస్తే .. ఈ చెల్లని ఓట్లు ఒక అభ్యర్థికి వచ్చే ఓట్ల కంటే కూడా ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఈ చెల్లని ఓట్లు వేసిన వారిపై సహజంగానే ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. పట్టభద్రులైన వారికి కూడా సరిగా ఓట్లు వేయడం రాకపోతే ఎలా అంటూ జనం మండిపడుతున్నారు. వీరికంటే అక్షరజ్ఞానం లేనివారే నయం.. వాళ్ళైతే అభ్యర్థుల పేర్లతో సంబంధం లేకుండా తమకు నచ్చిన అభ్యర్థి గుర్తుపై పక్కాగా ఓటు వేసి వస్తారని పేర్కొంటున్నారు. మరోపక్క అసలు ఓటు వేసినవారు నిజంగా డిగ్రీ చదువుకున్న వారేనా…అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ గ్రాడ్యుయేట్లకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడం కంటే నిరుద్యోగ భృతి ఇవ్వడమే బెటర్ అని తాజాగా సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.