న్యాయవాదుల హత్య కేసు.. ఆరో నిందితుడు అరెస్ట్
posted on Mar 19, 2021 @ 11:23AM
రాష్టంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసు విచారణలో మరో ముందడుగు పడింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రధాన నిందితుడు కుంట శ్రీనుతో సహా మరో ముగ్గురుని అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు, శుక్రవారం మరొకరిని అరెస్ట్ చేశారు. హత్య కేసులో ఆరో నిందితుడిగా ఉన్న వెల్ది వసంతరావును అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వసంతరావు గతంలో ప్రభుత్వ ఇంజినీర్‌గా పనిచేశారు. గ్రామంలో కడుతున్న పెద్దమ్మ గుడిని అడ్డుకునేందుకు న్యాయవాద దంపతులు ప్రయత్నం చేస్తున్నారనే కారణంతో నిందితులకు వసంతరావు సహాయం చేసిట్లు ఆరోపణలు వచ్చాయి. న్యాయవాద దంపతులను హత్య చేయడానికి ఏ1 కుంట శ్రీనును వసంతరావు ప్రోత్సహించాడు. గుంజపడుగు గ్రామ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా వసంతరావు ఉన్నారు.
రామగిరి మండలం కల్వచర్ల వద్ద గత నెల 17న న్యాయవాద దంపతులు వామన రావు, నాగమణిలు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీను, శివనందుల చిరంజీవి, అక్కపాక కుమార్, ఊదరి లచ్చయ్యలను పోలీసులు ఇంతకూ ముందే అరెస్ట్ చేశారు. దీంతో ఇంతవరకు ఈ కేసులో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.వామన రావు దంపతుల హత్య కేసులో అధికార పార్టీకి చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో, తెరాస నాయకత్వం వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
న్యాయవాద దంపతుల హత్య రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. పట్ట పగలు న్యాయవాదులు నడి రోడ్డు మీద హత్యకు గురైన సంఘటనపై ముఖ్యమంత్రి,అధికార పార్టీ నాయకులు ఎవరూ స్పదించక పోవడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. అయితే, ఎట్టకేలకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు న్యాయవాద దంపతుల హత్యపై స్పందించారు. ఈ కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారని అన్నారు. అందులో మా పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నారని, ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు. ఈకేసులో ఎవరున్నా రాజీ లేకుండా విచారణ చేస్తామని, దోషులకు శిక్ష పడేలా చూస్తామని అన్నారు.