ఆరోగ్యశ్రీలో కరోనా ... ఆర్థిక పరిస్థితే అవరోధమా?
తెలంగాణా ప్రభుత్వం కరోనా కట్టడి, చికిత్సను ఆర్థిక కోణంలో చూస్తోందా, అంటే ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు అవుననే అంటున్నాయి. ఓ వంక మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, రాష్ట్రంలో కరోనా కట్టడి, చికిత్సకు ఎటువంటి నిధుల కొరత లేదని పదే పదే చెపుతున్నారు. అయితే అదేసమయంలో ప్రభుత్వ చర్యలు మాత్రం అందుకు విరుద్దంగా ఉంటున్నాయని, ప్రతి పక్ష నాయకులు, ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, పేద మధ్య తరగతి ప్రజల బతుకులను చిత్రం చేస్తున్న కరోనాను ఆరోగ్య శ్రీ’లో చేర్చాలని, సొంత పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మొదలు, కాంగ్రెస్, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీలు, చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి.అయినా, ప్రభుత్వంలో స్పందన లేదు. ఇంకా పుట్టని షర్మిల పార్టీ మొదలు అన్ని పార్టీలు, చివరకు ప్రజలు, ప్రజా సంఘాలు కూడా కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని పలు రూపాల్లో అన్దోఅలన చేస్తున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్ల్యే సీతక్క గత నెలలోనే, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ, ఇందిరా పార్క్ వద్ద దీక్ష సైతం చేశారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఉస్మానియా అసుపత్రికి తరలించిన తర్వాత కూడా ఆమె దీక్షను కొనసాగించారు. చివరకు,అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకుని, ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలోనే కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆమె, దీక్షను విరమించారు. అయితే, ఇంతలో ఈటల పదవి పోయిందే కానీ, అయన ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదు. ఈ నేపధ్యంలోనే ఆమె ఆదివారం మరో మారు, ఆందోళన చేపట్టారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి, అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా ఆమె కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. మరోవంక తెలంగాణ పీసీసి అధ్యక్షుడు, ఉత్తమ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ఇతర నాయకులు పలు సందర్భాలలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజకీయ పార్టీలే కాదు, సామాన్య ప్రజలు కూడా వీద్దుల్లోకి వచ్చి, ఆందోళన చేస్తున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఎప్పుడో పది నెలల క్రితమే, అసెంబ్లీ సాక్షిగా కరోనానాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని హామీ ఇచ్చారని ప్రజలే గుర్తుచేస్తున్నారు. ఆ విషయం ఆయన మరిచిపోయినా ఇటీవల వరంగల్, తదితర ప్రాంతాల్లో దీక్షలు చేపట్టిన ప్రజలు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైదని ప్రశ్నిస్తున్నారు. కరోనా తొలి విడత కంటే రెండవ విడతలో ప్రతి ఇంటిలో ఒకరో ఇద్దరో, మొత్తం కుటుంబమో, కరోనా బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. మరణాల సంఖ్య కూడా తొలివిడత కంటే ఎక్కువగా ఉంది, కాబట్టి, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కరోనాను, ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదిలా ఉంటే,ఇదే విషయంపై తాజాగా బీజేపే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గవర్నర్ తమిళిసైకు లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్’కు విజ్ఞప్తి చేశారు. కరోనాను నియంత్రించటంలో, వైద్య వసతులు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన లేఖలో ఫిర్యాదు చేశారు. దానివల్లే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేవని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని, ప్రైవేటులో చికిత్స కోసం పేదలు ఆస్తులను అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్‌లో కరోనా చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లే..‘ఆరోగ్య శ్రీ’ ద్వారా కూడా కరోనా చికిత్స ఉచితంగా అందిచాలని, బండి సంజయ్ డిమాండ్ చేశారు.అలాగే, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలుపుకోవాలని బండి సంజయ్ తమ లేఖలో పేర్కొన్నారు.
అయితే, ఇన్ని విధాలుగా ఇన్ని వైపులా నుంచి వత్తిడి వస్తున్నా, ప్రభుత్వం సానుకూలంగా స్పందిచక పోవడానికి, ఆర్థిక సమస్యలే కారణంగా కనిపిస్తున్నాయి. నిజానికి, కరోనా రాక ముందు నుంచే, కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చెల్లించ వలసిన బకాయిలు కొండలా పేరుకు పోయాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులకు పెద్ద మొత్తంలో ప్రభుత్వం బకాయి పడింది. ఆ చెల్లింపులు చేయక పోవడం వలన ఆరోగ్యశ్రీ సేవలను చాలా వరకు కార్పొరేట్ ఆసుపత్రులు నిలిపి వేశాయి. ఇప్పుడు కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చినా పాత బకాయిలు చెల్లించకుండా, కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స చేయవు. బకాయిలు చెల్లించే పరిస్థిటిలో ఖజానా లేదు. అందుకే, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు ప్రభుత్వం విముఖత చూపుతోందని, అధికార వర్గాల సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలించే పరిస్థితులు లేక పోవడం వల్లనే ప్రభుత్వం లాక్ డౌన్ విధించేందుకు సైతం తటపటాయించిందని, చివరకు కోర్టు జోక్యంతో గత్యంతరం లేని పరిస్థితిలో మాత్రమే చివరి క్షణంలో ఆదరాబాదరాగా మంత్రివర్గలో ‘మమ’ అనిపించి లాక్ డౌన్ ప్రకటన చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, లాక్ డౌన్ విధిస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కోలుకోలేని దెబ్బ తగులుతుందని బహిరంగంగానే ప్రకటించారు. అందుకే రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండడుగాక ఉండదని పలు సందర్భాలలో చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అద్వాన్నంగా ఉన్నందునే, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చక పోవడం మొదలు, ఇతర కట్టడి చర్యలను, చికిత్సకు అవసరమైన ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఇతర మౌలిక సదుపాయలను సంకుర్చుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, అందుకే కేంద్ర సహకరించడం లేదన్న సాకును చూపుతున్నారని, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిజానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి పెర్కొన్నట్లుగా, ప్రభుత్వం మొదటి నుంచి అనుసరిస్తూ వచ్చియన్ తప్పుడు విధానాల వల్లనే రాష్ట్రం ప్రస్తుత అయోమయ స్థితి చేరిందని, అంటున్నారు, ఆపార్టీ నాయకులు.