కాళ్లు వాచాయి.. రంగు మారాయి.. కానీ, గాయాలు లేవు.. రఘురామ మెడికల్ రిపోర్ట్
posted on May 16, 2021 @ 8:03PM
ఎంపీ రఘురామ రాజు రెండు పాదాలకు, అరికాలుకు రంగు మారింది కానీ, బయటికి గాయాలు కనిపించడం లేదని డాక్టర్లు తమ మెడికల్ రిపోర్టులో తెలిపారు. ఎంపీ రఘురామ రాజుకు సంబంధించిన మెడికల్ రిపోర్టును పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను హైకోర్టు న్యాయవాదులకు చదివి వినిపించింది. రఘురామ కాళ్లు వాచి ఉన్నాయని, రెండు పాదాలకు, అరికాలుకు రంగు మారిందని, కానీ బయటికి గాయాలు కనిపించడం లేదని అందులో ఉంది. అవి కొట్టిన దెబ్బలని చెప్పలేమని వైద్యులు అభిప్రాయపడ్డారు.
రఘురామకు గుండె నొప్పి ఉందని ఫిర్యాదు చేశారని, నాలుగున్నర నెలల క్రితం గుండెకు శస్త్రచికిత్స జరిగిందని, వెంటనే కార్డియాలజిస్ట్‌కు పంపామని రిపోర్టులో రాశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, గుండె నిలకడగానే ఉందని వైద్యులు తమ రిపోర్టులో తెలిపారు. నెఫ్రాలజిస్ట్ దగ్గరకు కూడా పంపామని, నార్మల్‌గానే ఉందని వైద్యులు నివేదికలో పొందుపరిచారు.
ఎంపీ రఘురామ కృష్ణంరాజు శరీరంపై ఎటువంటి గాయాలు లేవని హైకోర్టు కు సమర్పించిన నివేదికలో వైద్య నిపుణులు కమిటీ స్పష్టం చేసింది. రఘు రామ కృష్ణం రాజు ని రమేష్ ఆసుపత్రికి తరలించాలనే హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేష్ ఆసుపత్రిలో పై క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి ఆయన తీసుకువచ్చారు. రఘురామను రమేశ్ హాస్పిటల్‌కు తీసుకెళితే.. టీడీపీ పార్టీ ఆఫీసుకు పంపినట్టేనని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వాదనను హైకోర్టు విభేదించింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం మధ్యాహ్నం 12లోగా మెడికల్ రిపోర్ట్ ఎందుకు కోర్టుకు నివేదించలేదని కోర్టు ప్రశ్నించింది. ఎంపీ రఘు రామకృష్ణ రాజును తక్షణమే రమేశ్ హాస్పిటల్‌కు పంపించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎంపీ రఘురామ కేసులో వైద్య బృందం నివేదిక జిల్లా కోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు చేరింది. జీజీహెచ్‌తో పాటు రమేశ్ ఆసుపత్రిలోనూ పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు.
కస్టడీలో ఉండగా సీఐడీ అధికారి పిటిషనర్‌ను కలిశారని, ఇలా కలవడం చట్ట విరుద్ధమని రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టు సీఐడీ కోర్టు ఆదేశాలను ఎలా అమలు చేశారు? రఘురామను ఎందుకు జైలుకు తరలించారు? అని ప్రశ్నించారు.
గుంటూరు ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదేశాలను యధాతధంగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు, cid కోర్టు ఆదేశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అదనపు అడ్వకేట్ జనరల్ వాదించడాన్ని తప్పుపట్టారు.
ఎంపీ రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాది ఆదినారాయణ.. తన క్లయింట్ ప్రాణాలకు హాని తలపెట్టే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు పంపించాలని కోర్టును కోరారు. అలాంటిది ఏదైనా జరిగితే తనను షూట్ చేయవచ్చునని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకి తెలిపారు. ఇప్పటికే రిమాండ్ విధిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఎంపీని వెంటనే జైలు నుంచి రమేశ్ ఆసుపత్రికి పంపాలని ఆదేశించారు.