కొవాగ్జిన్.. కొత్త వేరియంట్‌లపైనా ఎఫెక్ట్..
posted on May 16, 2021 @ 7:04PM
కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు స్వదేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా కొత్త రకాలపై పనిచేస్తోందని భారత్ బయోటెక్ వెల్లడించింది. భారత్‌లో విజృంభిస్తున్న బి.1.617తో పాటు బ్రిటన్‌లో రకం బి.1.1.7 వైరస్‌నూ కొవాగ్జిన్ టీకా తటస్థీకరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన పత్రాన్ని భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
వ్యాక్సిన్ వేరియంట్ D614Gతో పోలిస్తే బి.1.617 రకాన్ని తటస్థీకరించడంతో కొవాగ్జిన్ చెప్పుకోదగిన రీతిలో తగ్గిస్తున్నప్పటికీ.. అంచనా వేసిన దానికంటే ఎక్కువ రక్షణ కల్పిస్తుందని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఇక వ్యాక్సిన్ వేరియంట్, బ్రిటన్ రకం బి.1.1.7 వైరస్‌లను తటస్థీకరించడంలో కొవాగ్జిన్ ఒకే విధంగా పనిచేస్తుందని తెలిపింది. ఐసీఎంఆర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో జరిపిన అధ్యయనంలో ఈ ఫలితాలు కనిపించాయని భారత్ బయోటెక్ తెలిపింది. కొవాగ్జిన్ టీకాను భారత్‌లో ఇప్పటివరకు 18 రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
భారత్‌లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాగా ఇప్పటివరకు 18 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ భారత్‌లోనే తయారవుతుండగా తాజాగా అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ జులై నుంచి భారత్‌లో ఉత్పత్తి కానుంది. ఇక కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా రకాలపై ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు పనిచేస్తున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి.