రఘురామను ఆసుపత్రికి తరలించండి.. హైకోర్టు ఆదేశాలు..
posted on May 16, 2021 @ 7:23PM
ఎంపీ రఘు రామకృష్ణ రాజును తక్షణమే రమేశ్ హాస్పిటల్‌కు పంపించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎంపీ రఘురామ కేసులో వైద్య బృందం నివేదిక జిల్లా కోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు చేరింది. జీజీహెచ్‌తో పాటు రమేశ్ ఆసుపత్రిలోనూ పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు.
కస్టడీలో ఉండగా సీఐడీ అధికారి పిటిషనర్‌ను కలిశారని, ఇలా కలవడం చట్ట విరుద్ధమని రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టు సీఐడీ కోర్టు ఆదేశాలను ఎలా అమలు చేశారు? రఘురామను ఎందుకు జైలుకు తరలించారు? అని ప్రశ్నించారు.
గుంటూరు ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదేశాలను యధాతధంగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు, cid కోర్టు ఆదేశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అదనపు అడ్వకేట్ జనరల్ వాదించడాన్ని తప్పుపట్టారు.
ఎంపీ రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాది ఆదినారాయణ.. తన క్లయింట్ ప్రాణాలకు హాని తలపెట్టే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు పంపించాలని కోర్టును కోరారు. అలాంటిది ఏదైనా జరిగితే తనను షూట్ చేయవచ్చునని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకి తెలిపారు. ఇప్పటికే రిమాండ్ విధిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఎంపీని వెంటనే జైలు నుంచి రమేశ్ ఆసుపత్రికి పంపాలని ఆదేశించారు.