గవర్నర్ జోక్యానికి చంద్రబాబు లేఖ.. రఘురామకు ప్రాణహాని!
posted on May 16, 2021 @ 8:47PM
ఎంపీ రఘురామ కృష్ణంరాజుని ఏపీ సీఐడీ అక్రమ అరెస్ట్ పై గవర్నర్ శ్రీ బిస్వాభూషన్ హరిచందనకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గవర్నర్ జోక్యం చేసుకొనిఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని.. ఎంపీ రఘు రామకృష్ణ రాజు ప్రాణాలను కాపాడాలని కోరారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా రఘురామను రమేశ్ హాస్పిటల్‌కు తరలించకుండా.. జీజీహెచ్ నుంచి నేరుగా గుంటూరు జైలుకు తీసుకెళ్లారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు చంద్రబాబు. రఘురామ భార్య రమాదేవి తన భర్త ప్రాణాలకు ప్రమాదం ఉందని చెబుతోందని.. ఎంపీని శారీరకంగా గాయపరిచారని లేఖలో తెలిపారు చంద్రబాబు.
మరోవైపు, పలువురు టీడీపీ నాయకులు సైతం రఘురామ ఘటనపై మండిపడ్డారు. సీఐడీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజును జైలుకు పంపారని.. ఆయనకు ఏం జరిగినా సీఎం జగన్, సీఐడీ అధికారులదే బాధ్యతని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. జగన్ కనుసన్నల్లోనే మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చిందని ఆరోపించారున. భర్తకు ప్రాణహాని ఉందని రఘురామ భార్య ఆందోళన చెందుతున్నారని.. కోర్టు ఆదేశాల మేరకు రఘురామకు రమేశ్ హాస్పిటల్‌లో వైద్యం అందించాలన్నారు అచ్చెన్నాయుడు.
ఏపీలో ఎమర్జెన్సీ రోజుల కన్నా దారుణంగా పరిస్థితులున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సొంత పార్టీ ఎంపీపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు పరాకాష్ట అని విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకులపైనా అక్రమ కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే ఇంకా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అరాచకాల నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయమన్నందుకే ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందని టీడీపీ నేత, మాజీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ఎంపీని అంతమొందించే కుట్ర జరుగుతోందన్నారు. రఘురామ ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. రూల్ ఆఫ్ లా కంటే లాఠీకే పనిచెబుతున్న పోలీసుల తీరు హేయమన్నారు. వైసీపీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని చినరాజప్ప ప్రశ్నించారు. రఘురామ నేరస్థుడు కాదని.. ప్రభుత్వ అక్రమ కేసులో నిందితుడని అన్నారు. జగన్ కళ్లల్లో ఆనందం చూసేందుకు కొంతమంది పోలీసులు ఇలా హింసిస్తున్నారని, ఏపీలో అరాచకాలపై రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్ స్పందించాలన్నారు. దీనిపై కేంద్ర బృందాలతో న్యాయవిచారాణ జరిపించాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధమైన పాలన లేదని, ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. జగన్ పాలన కంటే బ్రిటీష్ పాలన మెరుగు అనిపించేటట్లు ఉందన్నారు. ఏపీలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)కు బదులు జగన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అమలవుతోందన్నారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం, కస్టడీలో ఉండగా దారుణంగా కొట్టడం దారుణమన్నారు. ఈ చర్య రాజకీయ కక్షపూరితమని, అప్రజాస్వామికమని, అమానుషమని తులసీరెడ్డి మండిపడ్డారు.