కరోనా కేసులు తగ్గుతున్నాయ్.. మరణాలు పెరుగుతున్నాయ్..
posted on May 17, 2021 @ 10:25AM
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా నాలుగో రోజు కొత్త కేసులు తగ్గాయి. తాజాగా, 3 లక్షల దిగువన నమోదయ్యాయి. ఆదివారం 15,73,515 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 2,81,386 మందికి పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 20న 2.95 లక్షల మందికి కరోనా నిర్ధారణ కాగా.. ఈ తర్వాత 3 లక్షలకు దిగువన కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
వరసగా నాలుగో రోజు కొత్త కేసుల సంఖ్య తగ్గడంతో దాని ప్రభావం క్రియాశీల కేసుల్లో కనిపించింది. ప్రస్తుతం 35,16,997 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 3,78,741 మంది మహమ్మారి నుంచి కోలుకోవడం గమనార్హం. కొత్త కేసుల కంటే రికవరీలు భారీగా పెరిగాయి. మొత్తంగా 2,11,74,076 మంది వైరస్‌ను జయించారు. అయితే ఆదివారం కొవిడ్ పరీక్షల సంఖ్యలో తగ్గుదల కూడా పాజిటివ్ కేసుల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది.
అయితే.. కొత్త కేసులు తగ్గుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం భారీగా నమోదవుతూ భయపెడుతోంది. దేశంలో కరోనా సృష్టిస్తోన్న విలయం భారీ సంఖ్యలో ప్రాణాలను హరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4వేల మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. ఆదివారం ఒక్కరోజే 4,106 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం కేసులు సంఖ్య 2.49 కోట్లకు చేరగా.. ఇప్పటివరకు 2,74,390 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు, దేశంలో నిర్వహిస్తోన్న కరోనా టీకా కార్యక్రమంలో ఆశించిన వేగం కనిపించడంలేదు. ఆదివారం కేవలం 6,91,211 మందికి మాత్రమే టీకాలు అందించారు. మొత్తంగా ప్రభుత్వం 18,29 కోట్ల డోసులను పంపిణీ చేసింది.