ఇంకా జైలులోనే రఘురామ.. ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యం..
posted on May 17, 2021 @ 10:12AM
ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ రఘురామకృష్ణరాజును ఈ ఉదయం గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తరలించాల్సి ఉంది. అయినా, అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టలేదు. దీంతో ఆయన ఇంకా జిల్లా జైలులోనే ఉన్నారు. ఎంపీని రమేశ్ ఆస్పత్రికి తరలించాలని ఉన్నత న్యాయస్థానం ఆదివారం రాత్రి ఆదేశించింది. కాగా.. తరలింపునకు సంబంధించి ఆర్డర్ కాపీ ఆలస్యం అయినట్టు తెలుస్తోంది. రఘురామ తరఫు లాయర్లు జైలు అధికారులకు కోర్టు ఉత్తర్వులు అందజేశారు. జైలు నిబంధనల మేరకు ఫార్మాలిటీస్ పూర్తి చేశాక.. రఘురామను రమేశ్ హాస్పిటల్‌కు తరలిస్తారని తెలుస్తోంది.
మరోవైపు, రఘురామను రమేశ్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వ తరఫున అధికారులు హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. అటు, సీఐడీ అధికారుల తీరుపై రఘురామ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం రఘురామకు జీజీహెచ్‌లో మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించి రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా వెనుక గేటు నుంచి నేరుగా గుంటూరు జైలుకు తరలించడం వివాదాస్పదమైంది. మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎంపీని రమేశ్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) అభ్యంతరం తెలుపుతూ రమేశ్ ఆసుపత్రికి తరలించడం అంటే టీటీడీ కార్యాలయానికి పంపడం లాంటిదేనన్నారు. అగ్నిప్రమాదం జరిగి పది మంది చనిపోయిన వ్యవహారంలో రమేశ్ ఆసుపత్రి ఎండీపై ఇప్పటికే ప్రభుత్వం కేసు నమోదు చేసిందని గుర్తుచేశారు. అక్కడికి పంపొద్దని కోరగా ధర్మాసనం నిరాకరించింది. మెజిస్ట్రేట్ ఉత్తర్వులను కనీసం రెండు రోజులైనా నిలుపుదల చేయాలన్న ఏఏజీ అభ్యర్థననూ హైకోర్టు ఆదివారం తోసిపుచ్చింది.