భారతిని సీఎం చేయాలి.. ఏపీలో డిక్టేటర్ షిప్..
posted on May 16, 2021 @ 6:23PM
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు రాష్ట్రంలో ప్రతి ఊరు తిరిగి ప్రజల మనోభావాలు తెలుసుకోవాలి.. కనీసం ఆ ప్రాంతాల ఎమ్మెల్యేల దగ్గర నుంచి అయినా సమాచారం తీసుకోవాలి.. ప్రతిపక్షంలో ఉన్నవారిని మాట్లాడనివ్వరు.. కలవడానికి సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరు.. ఇదొక వింత ప్రభుత్వం.. వింతైన ముఖ్యమంత్రి.. సీఎం పదవికి జగన్ రాజీనామా చేసి ఆయన సతీమణి వైఎస్ భారతికి బాధ్యతలు అప్పగించాలి.. అప్పుడైనా రాష్ట్రాంలో కొంత మార్పు వస్తుందేమో చూద్దాం.. కనీసం ఇప్పటికైనా ప్రజల ఆర్తనాదాలను జగన్ అర్థం చేసుకోవాలి.. అంటూ బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చేసిన దాడి వాస్తవమేనని నివేదిక వస్తే.. దాని అర్థం వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా నోరు విప్పితే బొక్కలో వేసి, నాలుగు ఉతికి పంపిస్తామని చెప్పడానికి చేసిన ప్రక్రియని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. సొంతపార్టీలో ఉన్నవాళ్లకే ఇలా చేస్తే, ఇక ప్రతిపక్ష నేతల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో కక్ష్య సాధింపులు పెరుగిపోయాయని మండిపడ్డారు.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబుపై నంద్యాలలో ఆయన చేసిన వ్యాఖ్యాలు ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం కాదా? అని ప్రశ్నించారు. దానికంటే రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఎక్కువా? అని నిలదీశారు. ఒక డిక్టేటర్ షిప్‌గా రాష్ట్రంలో పాలన జరుగుతోందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే వారిపై కేసులు పెట్టి, అరెస్టులు చేయించడం సరికాదని ఆయన అన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఏం మాట్లాడారో తెలియదా? అని నిలదీశారు. వైసీపీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితేంటని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు.