మోదీ టీమ్ అట్టర్‌ఫ్లాప్!.. అందుకే వారంతా అవుట్?
posted on Jul 7, 2021 @ 3:39PM
రెండేళ్లుగా అధికారంలో ఉన్నారు. ఇంతటి గొప్ప ప్రభుత్వం ఇంతవరకూ లేదన్నట్టు ఫోజులు కొట్టారు. ఇప్పుడేమైంది? రెండేళ్లు తిరిగే సరికి తత్వం బోధపడింది. ఏవేవో కారణాలు చెబుతూ.. కేంద్ర కేబినెట్‌లో పలువురు మంత్రులపై వేటు వేశారు ప్రధాని మోదీ. అంటే, రాజీనామా చేసిన వారంతా అసమర్థులన్నట్టేగా? గత రెండేళ్లుగా దేశాన్ని పాలించిన వారేగా? అంటే, వారంతా రెండేళ్లుగా చెత్త పనితీరును ప్రదర్శించినట్టేనా? అంటే, మోదీ టీమ్ ఫెయిల్ అయినట్టేగా? అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు.
కరోనాను ఎదుర్కోవడంలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమైందనే అపవాదు ఎదుర్కొంటోంది. మోదీ పని తీరుపై ఇంటాబయటా భారీగా విమర్శలు. గడ్డం పెంచడం మినహా ఆయన చేసిందేమీ లేదనే సెటైర్లు. పీఎం మోదీ చేతగాని తనంతోనే దేశంలో కరోనా ఇంతలా విజృంభించిందనే ఆరోపణలు. దేశంలో వ్యాక్సిన్ కొరతకు మోదీయే కారణమనే ఆగ్రహం. ఆ అపవాదుల నుంచి బయటపడేందుకు.. ఆ వైఫల్యాలను ప్రధాని మోదీ మీద నుంచి తొలగించేందుకు.. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను బలి చేశారని అంటున్నారు. సెకండ్ వేవ్‌ను సరిగా హ్యాండిల్ చేయలేకపోయారంటూ స్వతహాగా డాక్టర్ అయిన.. సీనియర్ మంత్రి హర్షవర్ధన్‌ను కేబినెట్ నుంచి గెంటేశారు మోదీ.
ఇక మరో మంత్రి సదానంద గౌడనూ మంత్రిమండలి నుంచి తొలగించడంపైనా విమర్శలు వస్తున్నాయి. మోదీని కాపాడేందుకే ఈయననూ బర్తరఫ్ చేశారని అంటున్నారు. కర్నాటకకు చెందిన సదానంద గౌడ.. రసాయనాలు, ఎరువుల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా కాలంలో ఔషదాల కొరత తీవ్రంగా ఏర్పడిందని, దీనిని సమన్వయం చేయడంలో సదానంద గౌడ విఫలం చెందారని చెబుతున్నారు. సర్కారు వైఫల్యాలను ప్రశ్నించినందుకు మరో మంత్రి తన పదవిని కోల్పోయారు. యూపీకి చెందిన సంతోశ్ గాంగ్వర్.. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. కరోనా కాలంలో యూపీ పాలనను ఇరుకున పెట్టే విధంగా ఓ లేఖ రాశారు. ఈ లేఖ విపరీతంగా వైరల్ అవడంతో యూపీ ప్రభుత్వ పరువు గంగపాలైంది. ఆ కడుపు మంటతోనే.. గాంగ్వర్‌ను పదవి నుంచి తీసేశారని అంటున్నారు.
ఇక.. బెంగాల్‌లో రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దేవశ్రీ చౌదరిపై వేటు పడిందని.. అనారోగ్య కారణాలతో ఉత్తరాఖండ్‌కు చెందిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ను తొలగించినట్టు తెలుస్తోంది. ఇలా కరోనా వైఫల్యాలు.. భవిష్యత్ రాజకీయ అవసరాల కోసమే కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతోందని అంటున్నారు. మంత్రుల సంగతి సరే.. మరి, కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమయ్యారంటూ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీని.. ఎందుకు పదవి నుంచి తొలగించరనేది ప్రతిపక్షాల ప్రశ్న. మంత్రులను కాదు.. ముందు మోదీని పీఎం పోస్ట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.