కిషన్ రెడ్డికి కేబినెట్ ప్రమోషన్! మోడీ టీంలో సోయంకు ఛాన్స్?
posted on Jul 7, 2021 @ 1:13PM
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం గంటల్లోకి వచ్చేసింది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్’లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అదలా ఉంటే, తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రివర్గంలో స్థానం ఎవరికి లభిస్తుందనే విషయంలో ఇంకా. ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, తెలంగాణ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావుకు గిరిజన కోటాలో బెర్త్ దక్కే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలో అయిపొయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రాకతో పునర్జీవనం పొందిన నేపధ్యంలో, తెలంగాణలో అధికార తెరాసతో పాటుగా రేవంత్ యువ సేనను దీటుగా ఎదుర్కునేందుకు, మంత్రి వర్గంలో రాష్ట్రానికి సముచిత స్థానం ఇవ్వాలని బీజేపీ అగ్ర త్రయం నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి స్వతంత్ర మంత్రిగా పదోన్నతి కల్పించడంతో పాటుగా, అదిలాబాద్ ఎంపీ సోయం బాబురావును సహాయ మంత్రిగా తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు మోదీ కేబినెట్ విస్తరణలో మార్పుల కోసం ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన మంత్రివర్గ విస్తరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున కసరత్తు చేశారని అంటున్నారు. ఈ నేపధ్యంలో విస్తరణ భారీగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, మంత్రి వర్గ విస్తరణతో పాటుగా, ప్రధాని మోడీ కొద్దిమందికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకవచ్చని అంటున్నారు. ఆలాగే, పెద్ద ఎత్తున శాఖల మార్పు కూడా ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగా గిరిజన వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్న అర్జున్ ముండాతో పాటు సహాయ మంత్రి రేణుక సింగ్ సరుటను మంత్రివర్గం నుంచి తొలగించి.. మోడీ తొలి ప్రభుత్వంలో ఈ శాఖను నిర్వహించిన జ్యుయల్ ఓరమ్‌కు మళ్లీ తిరిగి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, అదే శాఖ సహాయ మంత్రిగా బాబురావుకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో 53 మంది ఉండగా కొత్తగా తన మరో 28 మందికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. మరో వంక ఆంధ్ర ప్రదేశ్’లో ఇంతవరకు, ఒక్క జీవీఎల్ నరసింహ రావు మినహా మరెవరి పేరు పైకి రాలేదు. యూపీ నుంచి ఎన్నికైన రాజ్య సభ సభ్యుడు జీవిఎల్ కు మంత్రివర్గంలో స్థానం కలిపించడం ఉభయ తారకంగా ఉంటుందని మోడీ,షా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నా, వారికి ఇంతవరకు ఎలాంటి ఇంటిమేషన్ రాలేదని తెలుస్తోంది. చివరకు ఎవరిని అదృష్టం వరిస్తుందో .. మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.