ఆ నలుగురు.. కేసీఆర్‌కు చార్‌మార్.. అప్పుడే ఎలక్షన్ ఫీవర్...
posted on Jul 7, 2021 @ 1:13PM
ఏడేళ్లుగా తెలంగాణలో కేసీఆర్‌ది వన్ మ్యాన్ షో. అడిగేవాడు లేడు.. ప్రశ్నించే గొంతుక లేదు.. నిలదీసే చొరవ.. నిగ్గదీసే సత్తువ.. లేనేలేదు.. విపక్షం ఘోరంగా విఫలమైందనే టాక్. అందుకే, ఏ ఎలక్షన్ వచ్చినా కేసీఆర్‌కు వార్ వన్‌సైడ్‌గా ఉండేది. ఎన్నికల హామీలు మూలకు పడేసినా.. పట్టించుకనే నాథుడే లేకుండా ఉండే. కానీ, ఇటీవల బీజేపీ కాస్త యాక్టివ్ కావడంతో సీన్ మారిపోయింది. దుబ్బాక, జీహెచ్ఎమ్‌సీలో తగిలిన షాక్‌తో కేసీఆర్‌కు దిమ్మ తిరిగింది. ఆ తర్వాత నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ, వరంగల్-ఖమ్మం కార్పొరేషన్లు గెలుచుకొని.. ఇక బిందాస్‌గా ఉందామనుకున్న టైమ్‌లో ఈటల మేటర్ ఈటెల్లా గుచ్చుకుంది. ఆయన బీజేపీలో చేరడంతో గులాబీ బాస్‌లో గుబులు పెరిగింది. బండి సంజయ్ సైతం చీటికీ మాటికి.. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామంటూ సెగ రాజేస్తున్నారు. ఈలోగా అసలైన ప్రమాదం.. రేవంత్‌రెడ్డి రూపంలో పిడుగులా పడింది. ఇక షర్మిల సైతం సూటిపోటి మాటలతో ఎంతోకొంత డిస్టర్బ్ చేస్తోంది. ఇలా.. రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, షర్మిల.. ఆ నలుగురు కలిసి కేసీఆర్‌ను చార్‌మార్ అడుకుంటున్నారు.
తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంకా ఎన్నికలకు రెండేళ్లకు పైనే సమయం ఉన్నా.. రేపోమాపో ఎన్నికలు అన్నంతగా పొలిటికల్ యాక్టివిటీ నడుస్తోంది. అందరిలోనూ టెన్షన్. అందరికంటే సీఎం కేసీఆర్‌లో ఇంకా అటెన్షన్. అందుకే కాబోలు.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జిల్లా పర్యటనలు, సహపంక్తి భోజనాలు, ఆకస్మిక సందర్శనలు, ఆకట్టుకునే ప్రసంగాలు, సరికొత్త పథకాలు, పింఛన్‌లు, రేషన్‌కార్డులు.. అబ్బో కేసీఆర్ సర్కారులో కదలిక బాగా ఉంది. పనిలో పనిగా పాచిపోయిన నీళ్ల పంచాయితీని మళ్లీ ఫ్రిడ్జ్ నుంచి ఫ్రెష్‌గా బయటకు తీసి.. ఎవర్‌గ్రీన్ సెంటిమెంట్ పాలిటిక్స్‌ను రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కేసీఆర్‌లో.. ఇంతలా మునపటి కేసీఆర్ బయటకు రావడానికి కారణం.. ఆ నలుగురు...?
అందరికంటే కేసీఆర్‌కు యమ డేంజర్ గండం రేవంత్‌రెడ్డితోనే. పీసీసీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టి.. ప్రగతిభవన్ పైకి దండెత్తుతున్నారు. ఏ రేవంత్‌నైతే అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చేయగలిగారో.. అదే రేవంత్ ఎంపీగా, పీసీసీ ప్రెసిడెంట్‌గా.. గోడకు కొట్టిన బంతిలా తనవైపే దూసుకురావడం కేసీఆర్‌కు కలవరపాటే. గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి పట్టాభిషేకం ఘనంగా జరగడం.. కాంగ్రెస్ సీనియర్లంతా ఏకమవడం గులాబీ దళానికి డేంజర్ సింబలే. రాళ్లతో కొడతాం.. బయటకు గుంజుతాం.. ఇలాంటి దూకుడు స్వభావం.. సీనియర్లను తన దారికి తెచ్చుకున్న చాతుర్యం.. ఇక కేసీఆర్‌ను ఏనాటికైనా జైల్లో పెట్టాలనే జీవిత లక్ష్యం.. ఇవన్నీ కలగలిసిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి ఏనుగుల బలం పుంజుకోవడం.. కేసీఆర్‌కే ఎక్కువ ప్రమాదకరం అంటున్నారు.
ఇక.. బీజేపీ. తోకలో పార్టీ అనుకుంటే.. తోక కట్ చేసే పార్టీగా ఎదుగుతుందని అస్సలూ ఊహించలేదెవ్వరు. దుబ్బాక కలిసొచ్చిందని అనుకుంటే.. జీహెచ్ఎమ్‌సీతో తమది వాపు కాదు బలం అని నిరూపించుకుంది కమలం పార్టీ. ఆ తర్వాత వరుస ఓటములు ఎదురైనా.. ఉత్సాహం మాత్రం తగ్గలేదు. రేవంత్‌రెడ్డిలాంటి స్టామినా లేకపోయినా.. ఈటల రాజేందర్‌లాంటి బలమైన నేత బీజేపీలో చేరడం ఆ పార్టీకి అనుకూలం. ఇక బండి జోరు మామూలుగా లేదు. నోరు తెరిస్తే.. కేసీఆర్‌పై కేసులు పెడతాం.. సాక్షాలు సేకరించాం.. త్వరలోనే జైలుకు పంపుతాం.. ఇవే బెదిరింపులు. కేసీఆర్‌కు కునుకు పట్టకుండా.. చెవిలో తూనీగ మోత మోగిస్తున్నారు బండి సంజయ్. హుజురాబాద్‌లో సత్తా చాటి కేసీఆర్‌కు స్ట్రాంగ్ సందేహం ఇవ్వాలని తహతహలాడుతున్నారు.
రేవంత్‌రెడ్డి ఎఫెక్టో ఏమోగానీ.. తాజాగా పాదయాత్ర ప్రకటించి తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా అడుగులేస్తున్నారు బండి సంజయ్. బండి ఎంత బలపడితే.. కేసీఆర్‌కు అంత మైనస్. ఇక ఈటల రాజేందర్ చేసే డ్యామేజ్ గురించి చెప్పేదేముంది. స్వతహాగా ఉద్యమనేత కావడంతో ఈటలకు తెలంగాణ వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది. ఆయన ఏనాటికైనా కేసీఆర్ కొంప ముంచే ప్రమాదం ఉంది. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతానంటూ ఈటల చేసిన శపథం దడదడలాడిస్తోంది. ముందు హుజురాబాద్‌లో గెలిచి.. ఆ తర్వాత కేసీఆర్ సంగతి చూస్తానంటూ ఈటల జోరు మీదున్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్‌లతో బీజేపీ.. కేసీఆర్ వైపు డబుల్ బ్యారెట్ గన్ ఎక్కుపెట్టడం గులాబీ బాస్‌కు గుబులు పుట్టించే అంశమే.
ఇక, వైఎస్ షర్మిల. మొదట ఆటలో అరటిపండు అనుకున్నారు. తాను అరటిపండు కాదు అనకొండానంటూ అన్నిపార్టీల ఓటుబ్యాంకును మింగేసేందుకు ముందుకు వస్తున్నారు. సింగిల్‌గానైనా సింగంలా గాండ్రిస్తున్నారు. కొత్త పార్టీతో బలంగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ప్రొఫెషనల్ పొలిటికల్ అడ్వైజర్ల సాయంతో.. పక్కా ప్లాన్డ్‌గా ముందుకు సాగుతున్నారు వైఎస్ షర్మిల. తెలంగాణ మనిషి కాదనే అనుమానం ఉన్నా.. ఎవరు సంధించిన బాణమో అర్థం కాకున్నా.. ఆ కన్ఫ్యూజన్‌లోనే మరింతగా రాజకీయ దెబ్బ కొట్టేస్తున్నారు షర్మిల. వైఎస్సార్‌టీపీ ఎఫెక్ట్.. కేసీఆర్‌తో పాటు రేవంత్‌రెడ్డి ఓటుబ్యాంక్‌కూ ఎంతోకొంత దెబ్బ ఉంటుందంటున్నారు.
ఇలా.. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, వైఎస్ షర్మిల.. ఆ నలుగురు కలిసి కేసీఆర్‌తో చెడుగుడు ఆడుకునేందుకు తెలంగాణ దంగల్‌లోకి దిగిపోయారు. రాష్ట్రంలో తాజా పొలిటికల్ యాక్టివిటీతో అప్పుడే ఎలక్షన్ ఫీవర్ పెరిగిపోయింది. అయితే.. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టు.. ప్రత్యర్థులంతా ఎవరికి వారే తొడలు కొట్టి.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి.. కేసీఆర్‌కే లాభం చేసే అవకాశమూ లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. మాయల మరాఠీ, మాటల మాంత్రికుడైన కేసీఆర్‌ను.. ఆ నలుగురు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.. ఈ రాజకీయ వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కేది ఎవరో? అధఃపాతాళానికి పడిపోయేది ఇంకెవరో..? వెయిట్ అండ్ సీ...