పదవి నిలుపుకునేందుకు మమత పాట్లు.. మండలి పునరుద్ధరణకు అసెంబ్లీ తీర్మానం
posted on Jul 7, 2021 @ 11:53AM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పదవీ గండం వెంతడుతోందా అంటే, అవుననే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికల్లో మమతా దీదీ సారధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ వరసగా మూడవసారి విజయంసాధించి, హట్రిక్ కొట్టింది. అయితే, నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. అయినా, ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అయితే, శాసన సభ సభ్యులు కాని వారు మంత్రి లేదా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, అక్కడి నుంచి అరునెలల్లో శాసన సభ లేద శాసన మండలిలలో ఎదో ఒక సభకు ఎన్నిక కావడం రాజ్యాంగ నియమావళి ప్రకారం అనివార్యం. నిజానికి ఆమెకు అదేమంత కష్టం కాదు. ఆమె కోసం భవానీపూర్ నియోజక వర్గం ఎమ్మల్యే సీటు ఖాళీ (రాజీనామా) చేశారు. ఉపఎన్నిక జరిగితే చాలు, ఆమె గెలిచినట్లే. కానీ, ఆరు నెలల గడువు ముగిసే లోగా ఉప ఎన్నిక జరిగే పరిస్థితి లేదు. కరోనా అనిశ్చిత పరిస్థితి దృష్ట్యా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సుముఖంగా లేదు. మరో వంక దీదీని ఎలాగైనా గద్దెదించాలని కంకణం కట్టుకున్న, బీజేపీ, గడువులోగా ఉప ఎన్నికలు జరిపేందుకు ఏ మాత్రం సహకరించదు. సో.. దీదీ అసెంబ్లీ రూట్’లో సభలో ప్రవేశించేందుకు తపులుపులు మూసుకు పోయాయి.
అసెంబ్లీ కాకపోతే మండలి రూట్’లో వద్దామంటే, అ అవకాశం కూడా లేదు. పశ్చిమ బెంగాల్’లో ఎగువ సభే లేదు.ఆదిలో, అంటే, 1952లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బెంగాల్’లో ఎగువ సభను ఏర్పాటు చేసింది. అయితే, 1969లో అప్పటి ప్రభుత్వం మండలిని రద్దు చేసింది. కాబట్టి దొడ్డిదారి తలుపులు కూడా మూసుకు పోయాయి. అందుకే, ఇప్పుడు అర్జెంటుగా ఎగువ సభ పునరుద్దణకు దీదీ ప్రయత్నాలు ప్రారంభించారు.మంగళవారం బెంగాల్ రాష్ట్ర శాసన సభ ఈ మేరకు తీర్మానం ఆమోదించింది.అయితే, మండలి రద్దు, పునరుద్ధరణ విషయంలో తీర్మానం చేసి పంపడం వరకే అసెంబ్లీ చేతుల్లో ఉంటుంది . మిగిలిన తతంగం అంతా కేంద్రం దయ రాష్ట్రం ప్రాప్తం అన్నట్లుగానే ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్’లో మండలి రద్దును కోరుతూ శాసన సభ ఎప్పుడో సంవత్సరం క్రితమే తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే,ఇంతవరకు కేంద్రం నుంచి స్పందన లేదు. ఈలోగా మండలిలో అధికార పార్టీ బలం పెరగడంతో జగన్ ప్రభుత్వం కూడా చప్పుడు చేయడంలేదు.
సో,బెంగాల్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించినా, జరిగేది మమతా దీదీకి ఒరిగేదీ ఏమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదీ గాక, అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని, బీజేపీ వ్యతిరేకించింది. తీర్మానంపై బెంగాల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగిన సమయంలో సభలో ఉన్న 265 మందిలో 196 మంది తీన్మారానికి అనుకూలంగా, 69 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అంటే బీజేపీ ఎమ్మెల్యేలు అందరికి అందరూ తీన్మారాన్ని వ్యతిరేకించారు. సో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందని అనుకోవడం అయితే అజ్ఞానం, కాదంటే మరొకటి అవుతుంది. సో.. నవంబర్ 4 గడువు లోగా మమతా బెనర్జీ సభలో అడుగు పెట్టడం అయ్యే పనికాదని, ఆమె రాజీనామా చేయక తప్పక పోవచ్చని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశం మొత్తంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా ఆరు రాష్ట్రాలలో మాత్రమే శాసన మండలి వుంది. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్’లో కూడా 1985లో అప్పటి ఎన్టీఅర్ ప్రభుత్వం మండలిని రద్దు చేసింది. అయితే.తిరిగి 2007లో వైఎస్సార్ ప్రభుత్వం మండలిని పునరుద్ధరించింది. మండలి పునరుద్ధరణకు,ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ 2015లో తీర్మానం చేసినా, కేంద్రంలోనూ,రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నా, కేంద్రం ఓకే చేయడానికి ఇంచుమించుగా రెండున్నర సంవత్సరాలు పట్టింది.సో.. బెంగాల్ కౌన్సిల్ పునరుద్ధరణకు ఇంకా ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఈ లోగా పుణ్యకాలం ముగిసి పోతుంది . అందకే, దీదీకి తాత్కాలికంగానే అయినా పదవీ గండం తప్పదని పరిశీలకులు బావిస్తున్నారు.