సీఎం ఇంటి దగ్గరే ధర్నా! పవన్ కల్యాణ్ వార్నింగ్..
posted on Jul 7, 2021 @ 3:24PM
జనసేనాని చాలా కాలం తర్వాత జనంలోకి వచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే... ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్.. ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా తాడేపల్లి కరకట్ట వాసులు పవన్ కల్యాణ్ ను కలిసి తమ కష్టాలను, సమస్యలను తెలిపారు.
సీఎం ఇంటి చుట్టూ ఉన్నవారిని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని, ముందు స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని చెప్పారు. అర్ధరాత్రి ప్రొక్లెయినర్లను ఇళ్ల మీదకు పంపిస్తున్నారన్నారు. అదేమని అడిగితే చెప్పలేని విధంగా బూతులు తిట్టి బెదిరిస్తున్నారన్నారు. ముప్పై ఏళ్లుగా ఉంటున్న తమకు గూడు లేకుండా చేస్తున్నారన్నారు. తమకు అండగా నిలబడి ఉద్యమం చేయాలని పవన్‌ను బాధితులు విజ్ఞప్తి చేశారు. వాళ్ల సమస్యలు విన్న జనసేన చీఫ్.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
కరకట్ట వాసుల సమస్యలపై స్పందించిన పవన్.. వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం ఇంటిచుట్టూ ఉన్నవారికే రక్షణ లేదని ఆరోపించారు. సీఎం భద్రత పేరుతో ఇళ్లను ఖాళీ చేయిస్తారా అంటూ మండిపడ్డారు. ఆడపడుచులను పచ్చి బూతులను తిడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నాయకులు ఉంటే.. మానభంగాలు ఆగుతాయా అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. 35 ఏళ్లుగా ఉన్నవారికి పునరావాసం కల్పించాలని, భయపెట్టి.. బెదిరిద్దాం అనుకుంటే ప్రజలు భయపడరని హెచ్చరించారు. ఖాళీ చేయించడం తప్పని సరైతే... వారికి ముందు న్యాయం చేయాలన్నారు. 350 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చాకే అక్కడి నుంచి ఖాళీ చేయించాలన్నారు. మొండిగా ముందుకెళితే... జనసేన తరపున సీఎం నివాసం వద్దే ఉద్యమిస్తామని పవన్ హెచ్చరించారు.
జనసేన అధినేతను నిరుద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం జగన్ లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు ‘అన్న వస్తున్నాడు’ అంటూ ఊదరగొట్టారని, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అన్నారని, ఇప్పుడు ఆ ఊసే లేకుండా చేస్తూ.. జాబులు అడిగితే జైలుకు పంపిస్తున్నారని వాపోయారు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మామని, ఇప్పుడు నట్టేట మునిగామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై జనసేనాని పోరాడాలని కోరారు. నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నేతల మాటలను విన్న పవన్.. పీఏసీలో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.