కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం? రేవంత్ వెంటే కేసీఆర్ వ్యతిరేక వర్గం!
posted on Jul 7, 2021 @ 2:28PM
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరగబోతోందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో ఫుల్ జోష్ లో కనిపిస్తున్న కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు మొదలు కాబోతున్నాయని సమాచారం. గతంలో కాంగ్రెస్ లో కీలక నేతలుగా ఉండి.. ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి సొంత గూటికి రాబోతున్నారని సమాచారం. ఇప్పటికే కొందరు నేతలు రేవంత్ రెడ్డితో మాట్లాడారని, త్వరలో అధికారికంగా చేరబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో టీడీపీ పని చేసి బీజేపీలో చేరిన నేతలంతా రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ లో పని చేసేందుకు ముందుకు వస్తున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
వలసలతో పాటు ఓ పార్టీ కూడా కాంగ్రెస్ లో విలీనం కావచ్చనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక నేత, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్.. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే యోచనలో ఉన్నారని సమాచారం. టీజేఎస్ విలీనంపై ఇప్పటికే రేవంత్ రెడ్డితో కోదండరామ్ మాట్లాడారని చెబుతున్నారు. టీజేఎస్ విలీనంపై క్లారిటీగా ఉన్నందునే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లో చేరాలని కోదండరామ్ సూచించారని తెలుస్తోంది. టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా చేసిన తర్వాత.. అతనితో పలు సార్లు కోదండరామ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. అయితే రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈటలతో ఈ ఇద్దరు నేతలు చర్చలు జరిపారని, కాంగ్రెస్ లో చేరాలని సూచించారని చెబుతున్నారు.
టిపిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. గత ఏడేండ్లుగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ కేడర్ లో కొత్త ఉత్సాహం కనబడ్డది. రేవంత్ రెడ్డి దూకుడు స్వభావంతోపాటు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను ఢీకొట్టగల సమర్థుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు చెల్లాచెదరైన కేసిఆర్ వ్యతిరేకులంతా రేవంత్ రెడ్డి వెనకాల ర్యాలీ అయ్యే వాతావరణం కనబడుతున్నది. తెలంగాణ జన సమితి పార్టీ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది. కోదండరాం వ్యక్తిగతంగా ఉన్నతమైన వ్యక్తిగా జనాల్లో గుర్తింపు ఉన్నా.. రాజకీయా లు నడపాలంటే ఆయనకు సరైన వ్యూహం లేదని అంటున్నారు. అందుకే ఆయనే పోటీ చేసినా పట్టభద్రుల ఎమ్మల్సీగా ఓటమిపాలయ్యారు. ఇక పార్టీని నడిపించడం సాధ్యం కాదనే ఆలోచనకు వచ్చిన కోదండరామ్.. పార్టీని వదిలించుకునే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు.
కోదండరాంతో రేవంత్ కొంతకాలంగా టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు పిసిసి వస్తే జన సమితిని కాంగ్రెస్ లో విలీనం చేయాలని రేవంత్ కోరినట్లు చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఈవిషయమై చర్చలు కూడా సాగినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీలో జన సమితిని విలీనం చేద్దామనే ప్రతిపాదన ఇటీవల కోదండరాం నుంచి వచ్చినట్లు జన సమితి నేతల్లో టాక్ నడుస్తోంది. కుదిరితే కాంగ్రెస్ తో పొత్తు, లేదంటే విలీనం అనేదిశగా వారు సమాలోచనలు చేసినట్లు చెబుతున్నారు.ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత స్వయంగా ఆయన కోదండరాం ను కలిసి ఓపెన్ గానే విలీనం చేయాలని అభ్యర్థించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మరికొద్దిరోజుల్లోనే తెలంగాణ జన సమితి కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోవచ్చని టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.