సాయిధరమ్‌తేజ్ కోసం 100, 108కి ఫోన్ చేసింది ఎవరంటే...
posted on Sep 12, 2021 @ 1:47PM
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం అత్యంత ముఖ్యం. ఆ తొలి నిమిషాలు గోల్డెన్ పిరియడ్. వెంటనే ఆసుపత్రికి తీసుకెళితే బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆలస్యం అవుతున్నా కొద్దీ.. అవకాశాలు చేజారిపోతాయి. హీరో సాయిధరమ్‌తేజ్ యాక్సిడెంట్ సమయంలో వెంటనే స్పందించి.. ఆసుపత్రికి చేర్చడం అదృష్టమనే చెప్పాలి. అప్పటికే స్పృహ కోల్పోయిన తేజ్‌కు వెనువెంటనే ట్రీట్‌మెంట్ లభించడం చాలా మంచిదైంది. ఓ బాధ్యతగల పౌరుడి వల్లే సాయిధరమ్‌తేజ్‌ను అత్యంత కీలక సమయంలో.. హాస్పిటల్‌కు చేర్చగలగడం.. మెరుగైన చికిత్సతో ఆయన స్పృహలోకి రావడం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే డయల్ 100తో పాటు డయల్ 108కి ఫోన్ చేసి.. దగ్గరుండి మరీ ఆసుపత్రికి తరలించిన ఆ హైదరాబాదీ అబ్దుల్‌ను ఇప్పుడు అంతా అభినందిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
బైక్‌పై వెళుతున్న అబ్దుల్ సడెన్‌గా షాక్ అయ్యారు. ఆయన పక్కనే మరో బైక్ స్కిడ్ అయి పడిపోయింది. ఆ బైక్ రైడర్ రోడ్డు మీద పల్టీలు కొట్టాడు. ఆ సమయానికి ఆయనెవరో అబ్దుల్‌కు తెలీదు. సెలబ్రెటీనా? సామాన్యుడా? అని చూడలేదు. పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చాడు. వెంటనే డయల్ 100కు, ఆ తర్వాత 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. వారు వచ్చే వరకూ అక్కడే ఉన్నారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించడంలో సహాయం చేశారు. హాస్పిటల్ వరకూ వెంటే వెళ్లాడు. ఏదైనా ప్రమాదం జరిగితే.. మనకెందుకులే.. మరెవరైనా ఫోన్ చేస్తారులే.. పోలీసులతో తలనొప్పి ఎందుకు.. ఇలా పలురకాల కారణాలతో పట్టించుకోని జనాలు ఉన్న ఈ రోజుల్లో.. సాయిధరమ్‌తేజ్‌కు యాక్సిడెంట్ జరగ్గానే వెంటనే స్పందించిన అబ్దుల్ చొరవ ఎంతైనా అభినందనీయం. అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన అబ్దుల్.. సీఎంఆర్ సంస్థలో వ్యాలెట్ పార్కింగ్‌లో ఉద్యోగం చేస్తుంటారు.
ఇక, ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్దిదూరంలో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్లావత్ గోవింద్ సైతం సకాలంలో స్పందించారు. అబ్దుల్ చేసిన కాల్ తర్వాత.. డయల్ 100 నుంచి ప్రమాదంపై కానిస్టేబుల్ గోవింద్‌కు సమాచారం అందింది. ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు గోవింద్. ఆసుపత్రికి తరలించడంలోనూ హెల్ప్ చేశారు. అబ్దుల్.. గోవింద్.. వీరిద్దరూ సకాలంలో రెస్పాండ్ కావడంతో సాయిధరమ్ తేజ్‌ను ఇన్‌టైమ్‌లో ఆసుపత్రికి తరలించగలిగారు. వెంటనే చికిత్స అందించి మరింత ప్రమాదం జరగకుండా చూడగలిగారు. అందుకే, అబ్దుల్, గోవింద్‌లను పోలీస్ అధికారులు అభినందిస్తున్నారు.