అప్పుడు ఆనంద బెన్.. ఇప్పుడు రూపనీ! ఇద్దరికీ ఒకేలా ఉద్వాసన..
posted on Sep 12, 2021 @ 1:31PM
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారు. ఏమిటీ అనే విషయాన్ని పక్కన పెడితే. ఇలా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రులను మార్చడం, బీజేపీ కొత్తగా పెట్టుకున్న రూలు నిబంధన కాదు కదా అనే సందేహాలు, రాజకీయ, మీడియా వర్గాల్లోనే కాదు, పార్టీలోనూ వినిపిస్తున్నాయి.కొద్ది నెలల క్రితమే నిండా నాలుగు నెలలు అయినా నిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్’ను రాత్రికి రాత్రే మార్చేశారు.అలాగే, బీజేపీ జాతీయ నాయకత్వం ఇటీవల కర్ణాతక ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేత బలవంతంగా రాజీనామా చేయించారు.
గుజరాత్ విషయానికే వస్తే, మోడీ 2014 లో ఢిల్లీకి షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఏడేళ్ళలో ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు. మోడీ తర్వాత ఆయన వారసురాలుగా, ఆయనే ఏరి కోరి ఎంపిక చేసిన ఆనందబెన్ పటేల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు 2016 ఆగష్టులో ఆమె రాజీనామా చేశారు. ఆమె స్థానంలో విజయ్ రూపానీ నియామకం జరిగింది. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమంటే, అప్పుడు ఆమె.. ఇప్పుడు ఈయన ఒకే విధంగా ఉద్వాసనకు గురయ్యారు. సిట్యువేషన్స్, ఇష్యూస్ వేరైతే కావచ్చును కానీ, ఫెయిల్ అయ్యే పక్కకు తప్పుకున్నారు. అప్పట్లో, మరో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయన్న సమయంలో హార్దిక్ పటేల్ (ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) సారధ్యంలో ఉదృతంగా సాగిన పటీదార్ ఆందోళనను అదుపు చేయడంలో విఫల మయ్యారన్న కారణంగా, బీజేపీ అధిష్టానం ఆనందబెన్ పటేల్’కు ఉద్వాసన పలికింది. అఫ్ కోర్స్, దానికి తోడు 2016లో ఉన్నాలో దళితుల బహిరంగ ఉచకోత సంఘటన, వంటి ఇతర కారణాలు కూడా ఉన్నా. పటీదార్ ఆందోళన ప్రభావంతో 2015 స్థానిక సంస్థల ఎన్నికలో ఎదురైన ఓటమిని దృష్టిలో ఉంచుకునే బీజేపీ ఆమెకు ఉద్వాసన పలికిందని, పార్టీ వర్గాలు దృవీకరించాయి.
ఇప్పుడు కొవిడ్ కట్టడిలో ఫెయిల్ అయ్యారనే కారణంగానే, రూపానీని తప్పించారని తెలుస్తోంది. ఈ విషయంలో గుజరాత్ హై కోర్టు, గట్టిగానీ రూపనీ నెత్తిన అభిశంసన అక్షింతలు వేసింది. అంతే కాకుండా, వచ్చే సంవత్సరం (2022) డిసెంబర్’లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని విజయపధంలో నడిపించే సామర్ధ్యం రూపనీకి లేవని, ఆయన ఆ స్థాయికి ఎదగడంలో విఫల మయ్యారని అందుకే ఆయన స్థానంలో. పటేల్ సామాజిక వర్గానికి చెందిన సమర్ధ నాయకునికి పట్టం కట్టేందుకు రూపానీని తొలిగించి రూట్ క్లియర్ చేశారని అంటున్నారు. అయితే, రూపానీ వారసుడు ఎవరన్నది ఇంకా తేలవలసి ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరైనా, మోడీ బొమ్మ, అమిత షా వ్యూహంతోనే బీజేపీ 2022 అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుంది. అందులో ఎవరికీ సందేహం లేదు. అందుకు ఇప్పటి నుంచే వ్యూహ రచన సాగుతోంది, సంస్థాగతంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.
బీజేపీకి మొదటి నుంచి మంచి పట్టున్న పటేల్ వర్గం మీదనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. నిజానికి రూపానీని ఇప్పుడు మార్చినా, గత సంవత్సరం జూన్’లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు, సీఆర్ పాటిల్ ‘ను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించడంతోనే మార్పు ప్రక్రియ ప్రారంభమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఆ తర్వాత కూడా 2022 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ సంస్థాగతంగా, ప్రభుత్వ పరంగా అనేక మార్పులు చేర్పులను చేపట్టింది.
వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలో పాటుగా గుజరాత్’లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన బీజేపీ పెద్దలకు ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, రెండు కీలక రాష్ట్రాలలో ఒకే సారి ఎన్నికలకు వెళ్ళే సాహసం చేస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయి.చివరకు ఏమి జరుగుతుందో, గుజరాత్ రాజకీయ ఏ మలుపు తిరుగుతుందో.. ఈ అవకాశాన్ని ప్రతిపక్షలు ఎంత వరకు, ఎలా ఉపయోగించుకుంటాయో చూడవలసి ఉందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.