టీడీపీ నేత హత్యకు కుట్ర.. నిందితుడికి వైసీపీ సపోర్ట్!
posted on Sep 13, 2021 @ 11:40AM
రెండేళ్లుగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకులు ప్రత్యర్థులకు టార్గెట్‌గా మారుతున్నారు. వరుస దాడులతో తెలుగు తమ్ముళ్లను భయాందోళనకు గురవుతున్నారు. శత్రువుల దాడుల్లో పలువురు టీడీపీ నేతలు బలయ్యారు కూడా. చాలా కేసుల్లో అధికార పార్టీ వారే నిందితులు. వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా, గుంటూరులో ఏకంగా టీడీపీ కార్పొరేటర్‌నే హతమార్చడానికి కుట్ర చేశాడో క్రిమినల్. ఇది టీడీపీ చేస్తున్న ఆరోపణ కాదు.. స్వయానా పోలీసులే ఆ విషయం వెల్లడించారు. అయినా.. నిస్సిగ్గుగా ఆ నేరగాడికి వైసీపీ వంత పాడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
గుంటూరులోని టీడీపీ కార్పొరేటర్ యల్లావుల అశోక్ యాదవ్ హత్యకు కుట్ర పనిన్నట్లు పోలీసులు గుర్తించారు. అశోక్‌ను మట్టుబెట్టేందుకు కన్నెగంటి బాలకృష్ణ పధకం పన్నినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో అశోక్‌ను ఓడించేందుకు బాలకృష్ణ గట్టి ప్రయత్నం చేశాడు. అయినా, ప్రజాధారణతో టీడీపీ అభ్యర్థి అశోక్ గెలుపొందారు. అశోక్ ఎదుగుదలను బాలకృష్ణ ఓర్వలేక.. ఏకంగా ఆయన్ను హతమార్చేందుకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది.
నిఘా వర్గాల ద్వారా హత్య కుట్రను బహిర్గతం చేశారు గుంటూరు జిల్లా ఎస్పీ. ఆయన ఆదేశాల మేరకు పట్టాభిపురం పోలీసులు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. కాగా బాలకృష్ణను కాపాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
గతంలో రౌడీ షీటర్ బసవల వాసు హత్య కేసులో బాలకృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో బాలకృష్ణను కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే కాలవ రమణ హత్యకు బాలకృష్ణ పధకం పన్నగా.. అతడిని తప్పించి మరో నలుగురిపై కేసు నమోదు చేశారనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఓ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి నగ్న చిత్రాలు, వీడియోలు తీసిన కేసులోనూ బాలకృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. ఇంత నేర చరిత్ర ఉన్న బాలకృష్ణకు వైసీపీ నేతలు కొమ్ముకాస్తుడటంపై గుంటూరు వాసులు మండిపడుతున్నారు.