చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్!.. అసలేం జరిగిందంటే...
posted on Sep 12, 2021 @ 2:29PM
ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రహసనంగా సాగుతోంది. టీకా కేంద్రాల దగ్గర భారీగా తోపులాటలు చూశాం. తాజాగా, అధికారుల నిర్లక్ష్యంతో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబంలో జరిగిన రెండు ఘటనలు వైద్య సిబ్బంది నిర్వాకానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రెండు డోసుల టీకా వేసుకున్నా.. మొదటి డోసు వేసుకున్నట్టు మెసేజ్ రావడం ఒకటైతే.. ఏకంగా చనిపోయిన వ్యక్తి పేరు మీద వ్యాక్సిన్ వేసుకున్నట్టు సమాచారం రావడం మరింత షాకింగ్ న్యూస్.
అనంత నగరానికి చెందిన ఓ వ్యక్తి మూడేళ్ల నుంచి హిందూపురంలో ఉంటున్నారు. అనారోగ్యంతో జులైలో చనిపోయారు. అయితే శనివారం ఉదయం ఆయనకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు అతని కుమారుడి మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. అంతే. అంతా షాక్. తన తండ్రి చనిపోయి రెండు నెలలు అవుతోంది.. ఇప్పుడు ఆయన వ్యాక్సిన్ వేసుకున్నట్టు మెసేజ్ రావడమేంటని కుటుంబ సభ్యులంతా అవాక్కయ్యారు. చుట్టుపక్కల వారికి విషయం తెలిసి అంతా ఆ చోద్యంపై చర్చించుకుంటున్నారు. అయితే.. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో ఝలక్ తగిలింది అదే ఫ్యామిలీకి.
అదే కుటుంబంలో మరో యువకుడు గతంలోనే రెండు డోసులు టీకా వేయించుకున్నాడు. అయితే, లేటెస్ట్‌గా అతనికి మొదటి డోస్ పూర్తి చేసుకున్నట్టు మెసేజ్ వచ్చింది. మరోసారి కన్ఫ్యూజన్‌లో పడిపోయింది ఆ కుటుంబం. ఇలా, ఒకేరోజు.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు వ్యక్తుల గురించి ఇలా తప్పుడు టీకా సందేశాలు రావడం.. స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
ఏపీలో కొవిడ్ టీకాల వ్యవహారం మొదటి నుంచి విమర్శల పాలవుతూనే ఉంది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తుంటే.. సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ అంటూ సరిపెడుతున్నారు స్టాఫ్. పాలకులు, ఉన్నతాధికారుల నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి అడ్డదిడ్డమైన మెసేజ్‌లు వస్తున్నాయని మండిపడుతున్నారు.
ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా టీకాలు వేస్తున్నారు. ఈ బాధ్యతను వైద్యఆరోగ్య సిబ్బందితోపాటు ఏఎన్‌ఎంలకు అప్పగించారు. పర్యవేక్షణ బాధ్యత మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు అప్పగించారు. కొంతమంది సిబ్బంది లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ఆయా గ్రామాల్లోని ఆధార్‌కార్డులు, ఫోన్‌నెంబర్లు సేకరించి టీకాలు వేయకుండానే వేసినట్లు నమోదు చేస్తున్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు కొవిన్ యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. అందుకే, జిల్లాలో చాలామంది రెండో డోసు వేసుకోకుండానే వేసుకున్నట్లు సమాచారం వస్తోంది. దీనిపై వందల్లో ఫిర్యాదులు వస్తున్నా సాంకేతిక లోపం అని చెప్పి ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల టీకాకు దూరమవుతున్నామని బాధితులు మండిపడుతున్నారు.