చలో చలో ట్యాంక్‌బండ్.. సండే ఈవెనింగ్ సందడే సందడి...
posted on Sep 12, 2021 @ 1:47PM
ట్యాంక్‌బండ్..హైదరాబాద్ మధ్యలో కొలువుదీరిన టూరిస్ట్ అట్రాక్షన్. ఇన్నాళ్లూ ట్యాంక్‌బండ్ అంటే నగరాన్ని కలిపే వారధిగానే భావించేవాళ్లు చాలామంది. ఎప్పుడు చూసినా ఆ బండ్‌పై వాహనాల రణగొణులే. ట్రాఫిక్ ఇక్కట్లే. వేగంగా వెళ్లే వెహికిల్స్, బండ్ల పొగతో వచ్చే పొల్యూషన్, హారన్స్, రోడ్డు దాటాలంటేనే టెరిఫిక్ సిట్యూయేషన్. అందుకే, అందమైన ట్యాంక్‌బండ్ ఇన్నేళ్లూ అందరికీ అందకుండా పోయింది. సర్కారుకు ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అయినట్టుంది. ట్యాంక్‌బండ్‌ను సండే ఈవెనింగ్.. ప్రజల కోసమే కేటాయించేశారు. సాగర్ తీరాన.. సాయంసంధ్యవేళలో.. ప్రకృతి ఒడిలో.. నగరవాసులు కులాసాగా సేదతీరొచ్చు. ఇకపై సండే ఈవెనింగ్ ట్యాంక్‌బండ్‌పై నో వెహికిల్స్.. నో ట్రాఫిక్. అంతేనా.. ఇంకేంలేదా.. అంటే, ఇంకా చాలానే మస్తీ మజా ఉందంటోంది హెచ్ఎండీఏ.
ట్యాంక్‌బండ్‌ను సందర్శించే నగరవాసులకు ఇక నుంచి సండే.. ఫన్‌డేగా మారనుంది. ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి పది గంటల వరకు నగరవాసుల కోసం సాంస్కృతిక ఉత్సవాన్ని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. పర్యాటకులకు, సందర్శకులకు అనువుగా ఎన్నో సెల్ఫీ స్పాట్‌లను ఏర్పాటు చేసింది.
ట్యాంక్‌బండ్‌ను నగరవాసులకు మరింత చేరువ చేయడానికి సాయంకాలం ట్యాంక్‌బండ్‌పై వాహనాలను అనుమతించ వద్దని ట్విట్టర్‌లో ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు కొంతకాలం క్రితం మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ఆదేశాలతో రెండు వారాలుగా ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 5నుంచి రాత్రి 10గంటల వరకు సందర్శకులను మినహా వాహనాలను అనుమతించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్న నగరవాసులు.. తథాగతుని సమక్షంలో.. మహనీయుల విగ్రహాల సాక్షిగా.. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. 2 కిలోమీటర్ల మేర.. ట్యాంక్‌బండ్‌పై పండగ చేసుకుంటున్నారు. అందుకే, సండే ఈవెనింగ్.. సందడే సందడి.
సండే ఈవెనింగ్ ట్యాంక్‌బండ్‌పై స్పెషల్ ఎంటర్‌టైన్మెంట్...
-సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ (ఏఓసీ) ఆధ్వర్యంలో బ్యాగ్‌పైపర్ బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనున్నాయి. ట్యాంక్‌బండ్ ఆ వైపు నుంచి ఈ వైపు వరకు కలియ తిరుగుతూ బ్యాండ్ చప్పుళ్లతో సందర్శకులను ఆకట్టుకోనున్నారు.
- తెలంగాణ సాంస్కృతిక విభాగం సారథ్యంలో పలువురు కళాకారుల ద్వారా ఆట పాటలతో ప్రదర్శనలు
- పిల్లలను ఆకట్టుకునే విధంగా మేజిషియన్లు, జోకర్ల ప్రదర్శనలు
- శిల్పారామంలోని హస్తకళాకారులకు చెందిన ఉత్పత్తులను ట్యాంక్‌బండ్‌పై విక్రయించడానికి ప్రత్యేకమైన స్టాల్స్
- టాస్కో హ్యాండ్లూమ్ ఆధ్వర్యంలో చేనేత ఉత్పత్తులను విక్రయించేందుకు స్టాల్స్
- హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ
- వివిధ ప్రాంతాల్లో ఆహార ప్రియుల కోసం ప్రత్యేకమైన ఫుడ్‌స్టాల్స్
- సందర్శకులను ఆకట్టుకోవడానికి హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా లేజర్‌షో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు