10 లక్షలు వేశారు.. ఖాతా ఫ్రీజ్ చేశారు! కేసీఆర్ దళిత బంధు లక్ష్యమేంటో?
posted on Sep 12, 2021 @ 1:31PM
పళ్లెంలో అన్నం ఉండటం ముఖ్యం కాదు. దానిని నోటికి అందిస్తేనే ఉపయోగం. అలా చేస్తేనే కడుపు నిండుతుంది. ఆకలి మాయమవుతుంది. ఒక సినిమాలో కోడిని తన ఎదురుగా కట్టేసి పెట్టుకుని.. దాని చూస్తూ తెల్ల అన్నం తింటూనే చికెన్ కర్రీతో తింటున్నట్లుగా ఫీలవుతుంటారు కోట శ్రీనివాస రావు. ఈ సీన్ సినిమాలో సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు తెలంగాణలో అమలవుతున్న దళిత బంధు పథకం తీరు కూడా అచ్చం కోట శ్రీనివాస రావు సినిమాలోని సీన్ లానే ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై మొదటి నుంచి అనుమానాలు, కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలే ఉన్నాయి. హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండటంతో .. త్వరలో జరగనున్న ఉపఎన్నిక కోసమే తీసుకొచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి అందిస్తామని చెబుతోంది. హుజురాబాద్ లో సర్వే కూడా పూర్తైంది. అయితే సర్వేతోనే సరి పుచ్చుతారని, ఎన్నికల వరకు నిధులు ఇవ్వరనే ప్రచారం జరిగింది. విపక్షాల విమర్శలతో 2 వేల కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. అర్హుల ఖాతాలకు మనీ ట్రాన్స్ ఫర్ కూడా చేస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీ వరకు దాదాపు 13 వేల కుటుంబాల ఖాతాల్లోకి దళిత బంధు డబ్బులు జమ చేశామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చెప్పారు. మిగితా వాళ్లకు కూడా త్వరలోనే వేస్తామన్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా... ఇక్కడే అసలు కథ కనిపిస్తోంది. దళిత కుటుంబాలకు ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం. ఆ ఖాతాలపై ఆంక్షలు పెడుతోంది. దళిత బంధు పథకం కింద లబ్ధిదారులకు నిధులు విడుదల చేశామంటూ కేసీఆర్ ఘనంగానే ప్రకటించినా.. ఆ నిధులన్నీ మొన్నటిదాకా ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లోనే ఉండిపోయాయట. ఇదేంటంని లబ్ధిదారులు నిలదీయడం, విపక్షాలు ఆరోపణలు చేయడంతో మొదటికే మోసం వస్తుందని గ్రహించిన ప్రభుత్వం.. లబ్దిదారుల ఖాతాలకు జమ చేయాలని ఆదేశించింది. దీంతో కలెక్టర్ల నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేశారు. తమ ఖాతాల్లో 10 లక్షలు జమ అయినట్లు మెసేజ్ లు రావడంతో సంబరాలు చేసుకున్నారు హుజురాబాద్ దళితులు.
అయితే వాళ్ల సంతోషం ఎంతో సేపు నిలవలేదు. తమ ఖాతాల్లో జమ అయిన దళిత బంధు నిధులను విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు వెళ్లిన లబ్ధిదారులకు షాక్ తగిలింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే మీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామన్న బ్యాంకర్ల సమాధానంతో వాళ్లంతా అవాక్కయ్యారు. జిల్లా కలెక్టర్ వద్దకెళ్లినా అదే పరిస్థితి ఎదురైంది. ‘‘ఈ నిధులతో మీరేం చేస్తారో చెప్పాలి. ఎందుకు వినియోగిస్తారో చెప్పాలి. మీరు చెప్పిన వ్యాపారాలు లాభసాటివి అయి ఉండాలి. అప్పుడే నిధుల విత్ డ్రా సాధ్యం అవుతుంది’’ అని చావు కబురు చల్లగా చెప్పరట అధికారులు. అంటే దళిత బంధు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసినా ఆ ఖాతాలను బ్యాంకర్లు ఫ్రీజ్ చేసిపారేశారన్న మాట.
లాభసాటి వ్యాపారాలు చెబితే తప్పించి ఆ నిధులను విత్ డ్రా చేసుకోవడం కుదరదని కలెక్టర్లు తేల్చి చెప్పారట. ఈ క్రమంలో ట్రాక్టర్ కొంటానని ఒకరు, కారు కొని క్యాబ్ గా మార్చుకుంటానని మరొకరు చెబితే.. అవేవీ లాభసాటి వ్యాపారాలు కాదని కలెక్టర్లు వారి ముఖం మీదే చెప్పారట. దీంతో జిల్లా కలెక్టర్లు భావించే లాభసాటి వ్యాపారాలేవో అర్థంకాక దళిత బంధు లబ్ధిదారులు జుత్తు పీక్కుంటున్నారట. దళిత బంధు వచ్చిందని, 10 లక్షలు వచ్చాయని చెబుతూ.. మళ్లీ ఈ మెలికలు ఏంటని హుజురాబాద్ దళితులు ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. దళిత బంధు ఖాతాలు ఫ్రీజ్ చేశారన్న అంశంపై ఉద్యమానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి.