జగన్ ఇలాఖాలో బీభత్సం.. పులివెందులలో రెచ్చిపోయిన దొంగలు..
posted on Sep 13, 2021 @ 11:07AM
శాంతిభద్రతల విషయంలో జగన్ సర్కారు అట్టర్‌ఫ్లాప్ అనే ఆరోపణలు. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఏకంగా తాడేపల్లిలో ముఖ్యమంత్రి ప్యాలెస్‌కు సమీపంలోనే అఘాయిత్యం జరిగితే.. నెలలు గడిచినా నిందితులను పట్టుకోలేకపోయారనే విమర్శలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలే టార్గెట్‌గా వరుస దాడులు జరుగుతున్నా.. పాలకులు, పోలీసులు కావాలనే మౌనంగా ఉంటున్నారని మండిపడుతున్నారు. ఇలా ఏపీలో అరాచకం పెరిగిపోవడంతో.. నేరగాళ్లు, దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. క్రిమినల్స్‌కు ప్రభుత్వమన్నా.. ఖాకీలన్నా భయం లేకుండా పోతోంది. అందుకేనేమో.. ఏకంగా సీఎం జగన్ ఏరియా పులివెందులలో దొంగలు తెగబడ్డారు. ఇది ముఖ్యమంత్రి ఇలాఖా.. ఇక్కడ దొంగతనం చేస్తే పోలీసులు ఊరుకోరనే భయం కూడా వారిలో లేనట్టుంది. వైసీపీ పాలనలో తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమానో.. తెగింపో.. కారణం ఏదైనా.. పులివెందులలో దొంగల హంగామా మాత్రం జగన్ ప్రభుత్వానికి అపవాదు అంటున్నారు.
తాజాగా, పులివెందులలో దొంగలు భీబత్సం సృష్టించారు. పట్టణంలోని భాకరాపురం, బ్రాహ్మణపల్లె రోడ్డు, సాయిబాబగుడి దగ్గర మూడు ప్రాంతాల్లో మూడు ఇళ్లల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. లక్ష్మిదేవి అనే మహిళను తాళ్లతో కట్టేసి.. బంగారు నగలతో పాటు ఇంట్లో పార్క్ చేసి ఉన్న బైక్ ఎత్తుకెళ్లారు. మరో రెండు ఇళ్లలోనూ బైక్‌లను దుండగులు అపహరించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలు స్థానికులా? అంతరాష్ట్ర ముఠానా అనే దిశగా ఆరా తీస్తున్నారు పోలీసులు. సమీపంలోని సీసీకెమెరా ఫూటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఏదిఏమైనా.. పులివెందులలో దొంగల బీభత్సం జగన్ సర్కారుకు అవమానకరమే అంటున్నారు.