ఏపీ కేబినెట్‌లో అలజడి.. మంత్రుల్లో భయం భయం..
posted on Oct 1, 2021 @ 11:35AM
నమ్మకం ఉన్నచోటే ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉన్నచోటే సరైన పనితనం కనిపిస్తుంది. ఏమాత్రం నమ్మకం సడలినా.. ఇక నిత్యం భయం భయం. ఏపీ మంత్రుల పరిస్థితి ఇప్పుడు అలానే ఉందంటున్నారు. కొన్ని వారాలుగా మినిస్టర్లు అదోరకం టెన్షన్‌కు లోనవుతున్నారట. సీఎం జగన్ ఎప్పుడు తుమ్ముతారో.. తమ మంత్రి పదవులు ఎప్పుడు ఊడిపోతాయోననే ఆందోళన మంత్రుల ముఖంలో, మాటల్లో సుస్పష్టంగా కనిపిస్తోంది. ఉండబట్టుకోలేక మంత్రి పేర్ని నాని ఆ విషయం బయటకు అనేయడం ఆసక్తికరంగా మారింది.
రెండున్నరేళ్ల తర్వాత సగం కేబినెట్‌ను మార్చేస్తా. ప్రమాణస్వీకారం రోజున జగన్ చెప్పిన డైలాగ్ ఇది. ఆ రెండున్నరేళ్ల గడువు ముగిసే సరికి జగన్ డైలాగ్ మార్చేశారు. సగం కాదు.. ఏక మొత్తంగా కేబినెట్ అంతటినీ మార్చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ విషయంలో ఇప్పటికే లీకులు రాగా.. ఇటీవల మంత్రి బాలినేని బహిరంగంగానే ప్రకటించేశారు. అప్పటి నుంచి మిగతా మంత్రులతో పాటు వైసీపీలో ప్రజల్లో కేబినెట్ ప్రక్షాళనపై చర్చ జరుగుతోంది.
సగం మంది మంత్రులనే మార్చుదామని అనుకున్న జగన్.. ఇప్పుడు అందరినీ తీసేయాలని డిసైడ్ అయ్యారంటే అర్థం.. ఏ ఒక్క మినిస్టర్‌పైనా ముఖ్యమంత్రికి నమ్మకం లేనట్టేగా? ఏ ఒక్క మంత్రి కూడా సరిగ్గా పని చేయడం లేదనేగా? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఆర్థిక మంత్రి బుగ్గనను తీసేస్తారంటే అర్థం ఉంది.. తనకు పోటీగా మారి, తన బెయిల్ రద్దైతే సీఎం కుర్చీకే ఎసరు పెడుతున్న పెద్దిరెడ్డిని సాగనంపడమూ కరెక్టే.. డమ్మీలుగా మారిన ఉప ముఖ్యమంత్రులు, పలు శాఖల మంత్రులనూ ఇంటికి పంపించేస్తారంటే కూడా రీజన్ ఉంది.. మరి, మంత్రి పదవికి తగిన ఏ అర్హతలూ లేకపోయినా.. కేవలం బూతులు మాట్లాడగలిగే టాలెంట్ ఉందనే ఏకైకా కారణంతో ఏరికోరి మంత్రిపదవులు కట్టబెట్టిన కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్, పేర్ని నానిలాంటి వారికి కూడా బై బై చెప్పబోతుండటం కాస్త సంచలన విషయమే.
తాను మోనార్క్‌నని.. తాను మాత్రమే తోపు అని భావించే జగన్.. తనది వన్ మ్యాన్ షో అని నిరూపించుకోవడానికే, మంత్రులకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదని.. నేతలు కేవలం కరివేపాకులాంటి వారేనని.. మరింత స్పష్టంగా చెప్పేందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు. అందుకే, మంత్రి పదవి పోతుందని తెలీగానే.. ఇన్నాళ్లూ తాము కూడా గొప్పోల్లమని విర్రవీగిన కొందరు మంత్రులు ఇప్పుడు నైరాశ్యంలో పడిపోయారు. తాజాగా, మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రి పదవి మీద ప్రేమ ఎందుకుంటుంది..? నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు’ అని సమాచార-రవాణా శాఖల మంత్రి పేర్ని నాని అనడం కలకలం రేపుతోంది.
తన మంత్రి పదవి పోవడం పక్కా అని తెలిసే.. ఇటీవల పేర్ని నాని మరింత వాయిస్ పెంచారు. పవన్‌కల్యాణ్‌పై విరుచుకుపడుతూ.. సినిమా వాళ్లతో చర్చలు జరుపుతూ.. కాస్త హడావుడి చేసి తన మంత్రి పదవి కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయినా, జగన్ కనికరించడం లేదని తెలిసి.. మరింత దిగజారిపోయారు. అవును, నేను సీఎం జగన్‌కు పాలేరునే.. అని బహిరంగంగా ప్రకటించేసుకుని.. మంత్రి పదవికి అసలైన అర్హుడునని చెప్పుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. కానీ, పేర్ని నాని, కొడాలి నాని లాంటి వాళ్లు తిట్లు, బూతులతో ఎన్ని కుప్పిగంతులు వేసినా.. కేబినెట్ మొత్తాన్ని మార్చేయాలనే జగన్ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. అందుకే, ఏపీ మంత్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ తుమ్మితే ఊడిపోయే తమ పదవులను.. గట్టిగా పట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.