అఫ్గాన్ లో అరాచకం.. చదువు కోసం చిన్నారుల ఆక్రందనలు
posted on Oct 1, 2021 @ 10:47AM
ఆఫ్గనిస్థాన్ లో తాలిబన్ల పాలన, రాక్షస పాలనకంటే ఘోరంగా సాగుతోంది. ముఖ్యంగా మహిళలు,చిన్నారుల జీవితలాను మరింత దుర్భరం చేస్తోంది. చదువులకు దూరం చేయడమే కాకుండా, ఆడవారిని పడక బొమ్మలుగా చేసి వారి జీవితాలతో ఆడుకుంటోంది. ఈ దుర్మార్గ పరిస్థితుల్లో, చిన్నారులు ప్రాణాలకు తెగించి వీధుల్లోకి వస్తున్నారు. చదువుకుంటామని,చదువుకోనీయమని పాలకులను వేడుకుంటున్నారు.
ఇందులో భాగంగా విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో తమ హక్కులను కాలరాయొద్దంటూ అఫ్గాన్ మహిళలు గత కొంత కాలంగా చేపడుతున్న నిరసన ప్రదర్శనలపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. తాజాగా కాబుల్‌లో ప్రదర్శన చేపట్టిన మహిళలపై వారు హింసాత్మక ధోరణి ప్రదర్శించారు. 6 - 12 తరగతుల బాలికలనూ బడులకు అనుమతించాలంటూ ‘స్పాంటేనియస్ మూవ్‌మెంట్ ఆఫ్ అఫ్గన్ వుమెన్ యాక్టివిస్ట్స్’ బృందానికి చెందిన పలువురు మహిళలు గురువారం స్థానికంగా ఓ సెకండరీ స్కూల్ ముందు నిరసనకు దిగారు. ‘మా పెన్నులు విరగ్గొట్టొద్దు. మా పుస్తకాలను కాల్చొద్దు. మా పాఠశాలలను మూసివేయొద్దు’.. ఇలా వివిధ నినాదాలు రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. ఇది గమనించిన తాలిబన్లు వెంటనే వారిని అడ్డుకున్నారు. వెనక్కి నెట్టేసి, బ్యానర్లు లాగేసుకున్నారు. వారిని అదుపుచేసేందుకు గాల్లో కాల్పులు సైతం జరిపినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో వారి దుశ్చర్యలను రికార్డు చేస్తున్న విదేశీ జర్నలిస్టులనూ నిలువరించినట్లు పేర్కొంది.
తాలిబన్లు మాత్రం, ఇంకా తమను తాము మోసం చేసుకుంటూ, ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అఫ్గాన్‌లో 6- 12 తరగతులకు కేవలం బాలురను మాత్రమే అనుమతిస్తూ జారీ చేసిన ఆదేశాలు విషయం ప్రస్తావించకుండా, కేవలం నిరసనకారులు తమ ప్రదర్శనకు సంబంధించి అనుమతులు తీసుకోలేదని అందుకే వారిని అడ్డుకున్నమని పేర్కొన్నారు. మహిళలను అడ్డుకున్న తాలిబన్ల బృందానికి నాయకత్వంవహించిన మౌలావి నస్రతుల్లా, నిరసనకారులు తమ ప్రదర్శనకు సంబంధించి అనుమతులు తీసుకోలేదని అందుకే అడ్డుకున్నమని చెప్పు కొచ్చారు. అఫ్గాన్‌లో 6- 12 తరగతులకు కేవలం బాలురను మాత్రమే అనుమతిస్తూ తాలిబన్లు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళల హక్కుల విషయంలోనూ వారు మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారి దుశ్చర్యలను నిరసిస్తూ.. హెరాత్, కాబుల్ తదితర చోట్ల గళం విప్పిన మహిళలపై తమ ప్రతాపాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే.
మరో వంక తమ ఆజ్ఞలను దిక్కరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూపేందుకు, తాలిబన్లు తమ ఆజ్ఞల దిక్కరణకు శిక్షగా చంపిన మహిళల మృతదేహాలను బహిరంగ ప్రదేశాలలో వెళ్లాడదీసి ప్రజలను భయానికి గురిచేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.