బద్వేలు బరిలో జనసేన! జగన్ తో పవన్ తేల్చుకోనున్నారా?
posted on Sep 30, 2021 @ 9:03PM
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పెరిగింది. అక్టోబర్ 1 నుంచి నామినేషన్లు మొదలుకానున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీలు బద్వేలు ఉప ఎన్నికకు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార పార్టీ దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధను బరిలోకి దింపుతోంది. ఇక టీడీపీ తమ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖర్ ను మరోసారి రంగంలోకి దింపుతోంది. రెండు పార్టీలు ప్రచారం కూడా ప్రారంభించాయి. బద్వేలు ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు సీఎం జగన్.
వైసీపీ, టీడీపీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా బీజేపీ-జనసేన విషయం మాత్రం ఇంకా తేలలేదు. ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. బద్వేలులోనే రెండు పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నాయని తెలుస్తోంది. ఇటీవల కాలంలో బీజేపీ తీరుపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. కమలంలో కటీఫ్ చెప్పేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారనే చర్చ ఉంది. ఈ నేపథ్యంలో బద్వేలులో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయకవచ్చని భావించారు. అయితే పొత్తుపై వస్తున్న వార్తలకు తెర దించాయి రెండు పార్టీలు. బద్వేలులో కలిసి పోటీ చేస్తామనే సంకేతం ఇచ్చాయి.
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళగిరిలో సమావేశమయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వీరిరువురు బద్వేలు ఉప ఎన్నిక అంశంపై చర్చించారు. బద్వేలు ఉప ఎన్నికలో పోటీ విషయంలో రెండు పార్టీల అధినేతలు క్లారిటీకి వచ్చారని అంటున్నారు. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని నిలిపేందుకు మద్దతు ఇచ్చిన జనసేన... ఈసారి బద్వేలు ఉప ఎన్నికలో తన అభ్యర్థిని బరిలో దింపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి బీజేపీ కూడా మద్దతు తెలిపినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఉప ఎన్నిక నామినేషన్లు షురూ అవుతున్నందున రెండు, మూడు రోజుల్లోనే బీజేపీ-జనసేన అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం వైసీపీ, జనసేన మధ్య తీవ్ర స్థాయిలో వార్ సాగుతోంది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పవన్ పై అధికార పార్టీ నేతలు ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. పవన్ కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదు. పవన్ కల్యాణ్ పై వైసీపీ అభిమానిగా చెప్పుకునే పోసాని కృష్ణ మురళీ చేసిన కామెంట్లు ప్రకంపనలు స్పష్టిస్తున్నాయి. జనసేన నేతలు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు. బుధవారం మంగళగిరిలో పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను పారిపోనని.. భయం అంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సొంత జిల్లాలోని బద్వేలు ఉప ఎన్నికను జనసేన సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ముమ్మరంగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. దీంతో బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ-జనసేన గట్టి పోటీ ఇస్తుందనే చర్చ సాగుతోంది.