సాహో సజ్జనార్.. మూడేళ్ల తర్వాత ఆర్టీసీలో ఒకటే తేదీనే జీతాలు!
posted on Oct 1, 2021 9:28AM
పోలీస్ శాఖలో ఆయన సూపర్ కాప్.. డైనమిక్ ఆఫీసర్ గా జనాల నుంచి జేజేలు అందుకున్నారు. ప్రజల భద్రత కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఆ ఆఫీసర్ ఇప్పుడు నాన్ పోలీస్ శాఖకు బదిలీ అయ్యారు. అయితే అక్కడ కూడా ఆయన తన మార్క్ చూపిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే సంస్థను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఉద్యోగుల సంక్షేమంపై ఫోకస్ చేశారు. అక్కడా ఇప్పుడు సాహో అనిపించుకుంటున్నారు.
పైన చెప్పిదంతూ ఎవరి గురించో అంచనా వేశారు.. ఆయన ఎవరో కాదు సీనియప్ ఐపీఎస్ సజ్జనార్. సైబరాబాద్ సీపీ నుంచి తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నియమితులైన సజ్జనార్.. ఆర్టీసీలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. కొత్త బాస్ రావడంతోనే సంస్థలో మార్పులు తెచ్చారు. ఉద్యోగుల సమస్యలకు చెక్ పెట్టారు. ఆర్టీసీ ఉద్యోగులకు దాదాపు మూడేళ్ల తర్వాత ఒకటో తేదీనే జీతాలు అందుకోనున్నారు. ఇన్నాళ్లు పది, పదిహేను రోజులు ఆలస్యంగా వేతనాలు అందుకున్న ఉద్యోగులు.. సజ్జనార్ చర్యలతో సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రతి నెల సరిగ్గా ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా టీఎస్‌ఆర్టీసీ కొత్త ఎండీ సజ్జనార్ ప్లాన్ సెట్ చేశారు.. ఈ మేరకు అక్టోబర్ నుంచి ఒకటో తేదీనే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ కానున్నాయి. 018 డిసెంబర్ వరకు ఆర్టీసీ ఉద్యోగులు ప్రతినెలా ఒకటో తేదీకి అటూఇటుగా వేతనాలు తీసుకునేవారు. కానీ రాను.. రాను మరింత దారుణంగా మారింది. కోవిడ్ వ్యాప్తి, లాక్‌డౌన్ సమస్యలు వచ్చ పడటంతో సంస్థకు ఆర్ధిక భారం మరింత పెరిగిపోయింది.దీంతో ఆర్టీసీ కార్మికుల వేతనాలు సమస్యగా మారిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ జోన్, బస్‌భవన్ ఉద్యోగులకైతే మరింత దారుణంగా సెప్టెంబర్‌లో 20వ తేదీన వేతనాలు అందాయి. ఉద్యోగుల ఈఎంఐలు, ఇతర ఖర్చుల కోసం ప్రతి నెల అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ విషయంపై ఆయన ఫోకస్ చేశారు. ఈ సమస్యలపై బ్యాంకులతో చర్చలు జరిపారు. ప్రతినెలా ఒకటో తేదీలోపు రూ.100 కోట్ల ఓవర్‌డ్రాఫ్టు ఇవ్వాలని.. డిపోల్లో రోజువారీ టికెట్ కలెక్షన్ ఖాతాలను సదరు బ్యాంకులో తెరుస్తామని ప్రతిపాదించారు. దీనికి ఓ ప్రభుత్వరంగ బ్యాంకు ఓకే చెప్పింది. అక్టోబర్ ఒకటిన జీతాల చెల్లింపు కోసం రూ.100 కోట్లు అందించింది. రోజువారి టికెట్ల ఆదాయం నుంచి కానీ.. ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం నుంచి కానీ తిరిగి ఈ సొమ్మును బ్యాంకుకు చెల్లించేలా ప్లాన్ చేశారు.
ఇలాంటి చిక్కు సమస్యల్లో చిక్కుకున్న ఆ సంస్థకు కొత్త దారిని చూపించే పనిలో పడ్డారు ఎండీ సజ్జనార్. సిబ్బంది తీసుకునే నెలసరి జీతంను సకాలంలో అందించాలనే లక్ష్యంతో సంస్థలో తొలి అడుగు వేశారు కొత్త బాస్. సజ్జనార్ చర్యలతో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎండీ స్పూర్తితో మరింతగా శ్రమించి సంస్థను లాభాల్లోకి తీసుకొస్తామని చెబుతున్నారు.