TOP NEWS @ 7pm
posted on Sep 30, 2021 @ 7:04PM
1. ఏపీ ప్రభుత్వానికి ఎస్‌బీఐ షాక్ ఇచ్చింది. 6500 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వడానికి ఎస్‌బీఐ బ్యాంక్ నిరాకరించింది. సీఎస్ఎస్ పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కోసం ఏపీ ప్రభుత్వం అష్ట కష్టాలు పడుతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతున్న సమయంలో ఎస్‌బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం ఆందోళనలో పడింది.
2. పవన్ కల్యాణ్ జీవితంలో సీఎం జగన్‌ను ఓడించలేరని మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్‌ను పవన్ మాజీ ముఖ్యమంత్రిని చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పీకే ముందు ఎమ్మెల్యేగా గెలుస్తాడే లేదో చూసుకోవాలని నాని ఎద్దేవాచేశారు.
3. ప్రజా సమస్యలపై స్పందించమంటే.. వ్యక్తిగత దూషణలు ఎందుకు? అని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. కాటన్ బ్యారేజ్‌పై శ్రమదానం చేసి తీరుతామని.. పవన్ కల్యాణ్ వెళ్లే ప్రాంతాలలో హడావుడిగా రోడ్లు వేస్తున్నారని అన్నారు. మీరు బాగు చేయరు.. తాము శ్రమదానం చేస్తామంటే.. అడ్డుకుంటామంటే ఎలా? అని నిలదీశారు నాదెండ్ల మనోహర్.
4. తెలంగాణలో నిరసన కార్యక్రమాలు చేసే హక్కు కూడా లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందన్నారు. విద్య, ఉద్యోగ రంగాలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు కాంగ్రెస్ తరఫున నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తామన్నారు.
5. ఏపీ అప్పుల పాలైన పర్వా లేదు.. మాదక ద్రవ్యాలతో యువత నాశనం అవుతున్నా అక్కర లేదు.. కానీ, సినిమాలు, టిక్కెట్లు, దూషణలు, బహుబలి టికెట్స్‌పై దర్యాఫ్తు అంటున్న వారు ఏన్నో ఏళ్ళ నుంచి ఏ1, ఏ2లపై ఉన్న కేసుల సంగతి ఏంటని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. టీటీడీలో భజనలు చేయనివ్వడం లేదనే వార్తలు వస్తున్నాయని, టీటీడీ వసతి గృహాల్లో, రూముల్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని రఘురామ అన్నారు.
6. పవన్ ఊసరవెల్లి రాజకీయాలపై ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అని పోసాని కృష్ణమురళి నిలదీశారు. డబ్బులు ఇచ్చి మరీ రాళ్ల దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. అప్పుడు చిరంజీవి కుటుంబాన్ని తానే కాపాడానని.. ఇప్పుడు తమ్ముడు దాడులు చేయిస్తుంటే ఆయన ఎందుకు మాట్లాడటం లేదని పోసాని ప్రశ్నించారు.
7. పోసాని ఇంటిపై దాడికి తమ పార్టీకి సంబంధం లేదని జనసేన నేత కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. పోసాని ఇంటిపై వైసీపీనే దాడి చేసి జనసేనపై రుద్దే కుట్ర జరుగుతోందని, ఈ విషయం తాము రెండు రోజుల క్రితమే చెప్పామని, ఇప్పుడు అదే జరిగిందని కిరణ్ రాయల్ తెలిపారు. రాజకీయ వ్యహకర్త ప్రశాంత్ కిశోర్ సలహాతోనే పోసాని ఇంటిపై వైసీపీ దాడి చేసిందని ఆరోపించారు.
8. పరకాల ఎన్నికల కేసు విచారణలో భాగంగా వైఎస్ విజయలక్ష్మి, షర్మిలలు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. 2012లో పరకాల ఉప ఎన్నిక సందర్భంగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని, కోడ్ ఉల్లంఘించినందుకుగాను పరకాల పోలీస్ స్టేషన్‌లో విజయలక్ష్మి, షర్మిల, కొండా సురేఖ దంపతులపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసు విచారణలో భాగంగా విజయలక్ష్మి, షర్మిల కోర్టుకు హాజరయ్యారు.
9. కాంగ్రెస్‌లో తనకు ఎదురైన అవమానాలు చాలని, ఇక ఆ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదన్నారు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్. తాను బీజేపీలో కూడా చేరబోనని స్పష్టం చేశారు. అమిత్‌షాను, అజిత్ దోవల్‌ను రైతు చట్టాల రద్దు విషయమై కలిశానని చెప్పారు. మరోవైపు, మూడు రోజులుగా కాంగ్రెస్ నేతలకు దూరంగా ఉంటున్న సిద్ధూ.. తాజాగా ముఖ్యమంత్రి చన్నీని కలవడం ఆసక్తికరంగా మారింది.
10. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు చేసిన డ్యాన్స్ ప్రధాని దృష్టిని ఆకర్షించింది. కేంద్ర మంత్రి డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో స్పందించిన ప్రధాని మోదీ.. ‘‘మన న్యాయశాఖ మంత్రి మంచి డ్యాన్సర్ కూడా. అరుణాచల్ ప్రదేశ్‌లోని అద్భుతమైన సంస్కృతిని చూడడం చాలా బాగుంది’’ అంటూ ట్విటర్‌లో అభినందించారు.