ఎవరూ గొప్ప అంటూ ఫైట్.. సెవెన్త్ క్లాస్ స్టూడెంట్ మృతి! విశాఖ జిల్లాలో దారుణం..
posted on Oct 1, 2021 9:11AM
విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంలో దారుణ ఘటన జరిగింది. ఓ స్కూల్ ఫైటింగ్ వేదికగా మారింది. విద్యార్థుల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసింది. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవతోనే జశ్వంత్ అనే ఏడవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఇటీవలే తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘర్షణలో ఓ స్టూడెంట్ మృతి చెందగా.. తాజాగా స్కూల్లో మరో ఘటన జరగడం కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. అక్కయ్యపాలెంలోని ఓ ఎయిడెడ్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న జశ్వంత్, మరో స్టూడెంట్ మధ్య పాఠశాలలోనే గొడవ జరిగింది. ఎవరు గొప్ప అన్న విషయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ.. చివరకు కొట్లాటకు దారి తీసింది. ఇద్దరు విద్యార్థులు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనలో కుప్పకూలిపోయాడు జశ్వంత్. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. జశ్వంత్ మృతి చెందాడు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. విద్యార్థుల మధ్య గొడవ జరిగిన సమయంలో మరో ఇద్దరు స్టూడెంట్స్ అక్కడే ఉన్నారని..వారి నుంచి అన్ని వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. స్కూల్ టీచర్స్ కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నామని తెలిపారు. చదువుకోవలసిన వయసులో ఇలా గొడవలతో ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమంటున్నారు స్థానికులు. టీవీలు, సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.