టాప్ న్యూస్ @ 7PM
posted on Oct 1, 2021 @ 6:34PM
ఏపీలో డ్రగ్స్ ఛాలెంజ్ కాకపుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అక్రమరవాణాపై వైసీపీ, టీడీపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, పలువురు నేతలు హైదరాబాద్ రామంతపూర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వచ్చారు. డ్రగ్స్ పరీక్షకు రావాలంటూ వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఏపీ టీడీపీ నేతలు సవాల్ విసిరారు. డ్రగ్ టెస్టుకు రాకుండా వైసీపీ నేతలు తోకముడిచారని ఎద్దేవా చేశారు.
-----------
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై నమోదైన అట్రాసిటీ కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అరెస్ట్, ఇతర తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఒకే అంశంపై ఒకటి కంటే ఎక్కువ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని న్యాయవాది వీవీ సతీష్ తెలిపారు. న్యాయవాది సతీష్ వాదనలతో కోర్టు ఏకీభవించింది.
---------
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లేవనెత్తిన అంశాలకు సీఎం జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమని ఆయన మండిపడ్డారు. జనసేనతో కలిసి బీజేపీ ప్రయాణం సాగుతోందని, బద్వేల్ ఉపఎన్నికలపై రెండు పార్టీ కలిసి ముందుకు వెళ్తాయని మాధవ్ చెప్పారు.
---------
బద్వేల్ ఉపఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా తమకు నష్టం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. పవన్ పబ్లిసిటీ పోరాటాలు మానుకోవాలని సూచించారు. యాక్షన్ అనగానే చేయడానికి ఇది సినిమా కాదని ఎద్దేవాచేశారు. గోతులు పూడ్చి ఫొటోలుదిగే ఆందోళనల వల్ల ప్రయోజనం లేదని తప్పుబట్టారు
--------
టిడ్కో ఇళ్ల కేటాయింపు అంశం విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాన్ని కుదిపేసింది. రెండున్నరేళ్లయినా ఇంకా ఇళ్లు కేటాయించని అంశాన్ని టీడీపీ కార్పొరేటర్లు ప్రస్తావించడం, దీనిపై దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బూతులు మాట్లాడటంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 202 అంశాలతో అజెండా ప్రవేశపెట్టారు
--------
ఏపీ రాష్ట్రంలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య ఇటీవల బూతుల పురాణం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలను ఒలంపిక్స్‌లో బూతు ఆటలు ఆడితే, వైసీపీకి స్వర్ణపథకం, జనసేనకి రజత పథకాలు వస్తాయని తులసిరెడ్డి అన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలతో అల్లాడుతుంటే.. ఈ రెండు పార్టీల నాయకులు పోటీ పడి బూతులు తిట్టుకోవడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు
------
హరితహారం పై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహణకు హరిత నిధి ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా హరిత నిధి ఉపయోగపడుతుంద్ననారు. హరిత నిధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు రూ. 500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రతీ నెలా 100 రూపాయల విరాళం ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి.
---------
నల్గొండ జిల్లా చిట్యాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వచ్చారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడడంతో ఇరు పార్టీల శ్రేణులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
-----
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీని కూడా వీడుతున్నట్లు ప్రకటించారు కెప్టెన్ అమరీందర్ సింగ్. అయితే ఆయన భార్య మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పటియాలా ఎంపీగా ఉన్న ప్రెణీత్ కౌర్ కూడా పార్టీ వీడతారా అనే అనే ప్రశ్నలు అనేకం వచ్చాయి. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడనని, పార్టీలోనే కొనసాగుతానని కౌర్ స్పష్టం చేశారు.
-------
టాలీవుడ్ దివంగత హాస్యనటులు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు రామలింగయ్య అల్లుడు, కేంద్రమాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ , యం.పీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు.
------