రేవంత్‌రెడ్డిని కాదని బీజేపీలోకి తీన్మార్ మల్లన్న.. కారణం అదేనా?
posted on Oct 1, 2021 @ 5:59PM
చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. క్యూ న్యూస్ అధినేత. ఒకప్పుడు తెల్లారితే చాలు.. తన యూట్యూబ్‌లో కేసీఆర్ సర్కారును కుమ్మేసేవారు. పదునైన మాటలతో, ఘాటైన విమర్శలతో సర్కారుపై చెలరేగిపోయేవారు. కొన్ని వారాలుగా మల్లన్న వాయిస్ లేదు. క్యూ న్యూస్‌లో మునపటి జోష్ లేదు. కారణం తెలిసిందే. మల్లన్నపై కేసుల మీద కేసులు పెట్టి.. బెయిల్ మీద బయటకు రాకుండా చేసి.. జైల్లోనే మగ్గేలా చేస్తున్నారు. ఆఫ్ ది రికార్డ్ సమాచారం ప్రకారం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకూ మల్లన్నను జైల్లోనే ఉంచుతారని అంటున్నారు. ఆయన తరఫు లాయర్ ఉమేశ్‌చంద్ర బెయిల్ కోసం తెగ ప్రయత్నిస్తున్నప్పటికినీ.. ప్రభుత్వం బలంగా కేసులు మోపి.. సాధ్యమైనంత కాలం మల్లన్నని జైలుకే పరిమితం చేసేలా చేస్తోంది. ఈ విషయం పసిగట్టిన ఆయన.. ఇప్పుడు వ్యూహం మార్చారు. ఒంటరిగా పోరాడితే ప్రయోజనం ఉండదని.. అధికార పక్షంపై యుద్ధం చేయడానికి తనొక్కడి బలం సరిపోదని ఆలస్యంగా గుర్తెరిగారు. అందుకే, తనకు అండా-దండాగా ఉండేలా జాతీయ పార్టీ ఆశ్రయం కోరుతున్నారు.
తీన్మార్ మల్లన్న ముందు రెండు మూడు పొలిటికల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి.. తానే సొంతంగా పార్టీ పెట్టి.. కేసీఆర్‌పై ఒంటరి పోరాటం చేయడం. కానీ, మిగతా ప్రతిపక్షాలు సైతం బలంగా ఉన్న ఈ తరుణంలో సామాన్యుడైన మల్లన్నకు అది అంత ఈజీ కాదు. పైగా సర్కారు తనను అడుగడుగునా టార్గెట్ చేస్తున్న క్రమంలో.. భారీ ఆర్థిక వనరులు, కార్యకర్తల మద్దతు లేకుండా పార్టీ స్థాపించి మనుగడ సాధించడం కష్ట సాధ్యం. అందుకే, సొంత పార్టీతో సొంతంగానే ఎదగాలనే ఆలోచన ఉన్నా.. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అది వర్కవుట్ కాదని భావించి ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
ఇక మల్లన్న ముందున్న మరో ఆప్షన్.. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌లో చేరడం. ఇప్పటికే రేవంత్‌రెడ్డికి, మల్లన్నకి మంచి సంబంధాలే ఉన్నాయి. ఇన్నాళ్లూ తెరవెనుక మల్లన్నకి రేవంత్‌రెడ్డి సపోర్ట్ ఉందని ప్రచారం జరిగింది. అయినా, కాంగ్రెస్‌ను ఎంచుకోలేదు మల్లన్న. ఎందుకంటే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువే. మోదీ వేవ్ ఇప్పటికీ బాగానే వీస్తోంది కాబట్టి.. వచ్చే సారి కూడా కేంద్రంలో బీజేపీదే అధికారం అంటున్నారు. ఇక తెలంగాణలో హోరాహోరీ తప్పకపోవచ్చు. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల ట్రయాంగిల్ వార్‌లో విజయం ఎవరినైనా వరించొచ్చు. పక్కాగా ఈ పార్టీ గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరితే.. రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్సే గెలిస్తే..? తనకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే, ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా కేంద్రంలో పక్కాగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న బీజేపీ అయితే తనకు సేఫ్‌గా ఉంటుందని.. అలా అయితే తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. జాతీయ పార్టీ బీజేపీ సాయంతో సురక్షితంగా ఉండొచ్చనేది మల్లన్న మతలబు అంటున్నారు.
ఇక పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు మొదటి నుంచీ మల్లన్నకి మద్దతుదారులుగా ఉన్నారు. V6, వెలుగు అధినేత వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్‌లు మల్లన్నకి సపోర్ట్‌గా నిలిచేవారు. మల్లన్న జైలుకెళ్లినప్పుడు వివేక్ ఆయన ఇంటికెళ్లి మరీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక తన క్యూ న్యూస్‌లో ఎల్లప్పుడూ కేసీఆర్ సర్కారును విమర్శించే మల్లన్న.. కేంద్ర వైఫల్యాలపై ఒక్కసారి కూడా ప్రశ్నించిన దాఖలాలు లేవు. అందుకే, బీజేపీవాదులు రెగ్యులర్‌గా క్యూ న్యూస్‌ను ఫాలో అవుతుంటారు.
అటు.. మల్లన్నకు ఈటల రాజేందర్ సైతం ఫుల్ క్లోజ్ అంటారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు.. ప్రభుత్వం, పార్టీకి చెందిన అంతర్గత విషయాలను మల్లన్నకు లీక్ చేసే వారని.. ఆ విషయాల ఆధారంగానే క్యూ న్యూస్‌లో సర్కారును ఏకిపారేసే వారని అంటారు. ఇటీవల మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు సైతం ఈటల రాజేందర్ ఆయనకు పరోక్షంగా, ప్రత్యక్షంగా భారీ సాయమే చేశారని చెబుతారు. ప్రభుత్వ సెక్యూరిటీ కన్నుగప్పి మరీ.. మల్లన్నను ఈటల కలిసేవారని అంటారు. ఈటలపై కేసీఆర్ వేటు వేయడంలో ఇలాంటి విషయాలు కూడా కారణమే. ఈటలతో మల్లన్నకు అంత క్లోజ్‌నెస్ ఉంది కాబట్టే.. ఆయన సలహా మేరకే.. మల్లన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరితే.. సామాన్యుడైన మల్లన్న ఇకపై అసమాన్యుడు అవుతారు. కేసుల దూకుడు కాస్త తగ్గే ఛాన్స్ ఉంటుంది. బీజేపీ అధిష్టానానికి రాసిన లేఖలో మల్లన్న భార్య సైతం ఇదే విజ్ఞప్తి చేశారు. కేసుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. కేసీఆర్‌ను బలంగా వ్యతిరేకించే.. గట్టిగా గొంతు వినిపించే మల్లన్న వంటి వారు చేరడం.. తెలంగాణ బీజేపీకి సైతం అదనపు బలమే. మల్లన్న+బీజేపీ కాంబినేషన్.. కేసీఆర్‌కు ఇబ్బందికరమే.